మాస్టర్ షూటింగ్‌లో బీజేపీ కార్యకర్తలు
పెరంబూరు: నటుడు విజయ్ చిత్ర షూటింగ్ రచ్చరచ్చగా మారింది. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మాస్టర్. ఈ చిత్ర షూటింగ్ నైవేలిలోని ఎన్‌ఎల్‌సీ సొరంగం ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఐటీ అధికారులు అక్కడకు వచ్చి ఆయన్ని విచారించిన విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్ ఇంటిలోనూ అధికారులు విచారించారు. అలా రెండు రోజులు విచారణను ఎదుర్కొన్న నటుడు విజయ్ శుక్రవారం తిరిగి మాస్టర్ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు.
అయితే మాస్టర్ చిత్ర షూటింగ్‌ను ఎన్‌ఎల్‌సీ సొరంగం ప్రాంతంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి యూనిట్ వర్గాలతో వివాదానికి దిగారు. షూటింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు పలువురు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా గొడవకు దారి తీసి రచ్చరచ్చగా మారింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పి వారిని అక్కడ నుంచి పంపించేశారు. ఈ సంఘటనతో విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్‌కు పోలీసుల భద్రతను పెంచారు. కాగా బిగిల్ చిత్ర ఫైనాన్సియర్ అన్భు చెలియన్ ఇల్లు, కార్యాలయంలో ఐటీ దాడులు వరుసగా ఐదు రోజులు జరిగి ముగిశాయి.
మద్దతు పెరుగుతోంది
కాగా విజయ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయడంపై ఆయనకు రాజకీయ నాయకుల మద్దతు పెరుగుతోంది. ఈ ఐటీ దాడుల వెనుక ఉన్నది బీజేపీనేనని ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, నామ్‌తమిళర్ పార్టీ నేత సీమాన్ వంటి వారు విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఐటీ దాడులకు బీజేపీనే కారణం అంటూ విమర్శించారు. కాగా శనివారం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా విజయ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కే.బాలకృష్ణన్ శనివారం కోవైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియాలో కరోనా వైరస్ బీజేపీనేనని దండెత్తారు. నటుడు విజయ్ ఇంటిపై ఐటీ దాడుల గురించి స్పందిస్తూ ఆయన తన చిత్రాల్లో బీజేపీని విమర్శిస్తునందువల్లే, విజయ్ గొంతు నొక్కే ప్రయత్నమే ఈ ఐటీ దాడులు అని విమర్శించారు. ఈయన నటుడు రజనీకాంత్‌పైనా విమర్శలు చేశారు. ఆయన బీజేపీ గొంతుగా మారారని ఆరోపించారు. తమిళనాడులో బీజేపీకి వాయిస్ లేదని, దీంతో ఆ పార్టీ తాను అనుకున్నది నటుడు రజనీకాంత్ ద్వారా జరిపించుకునే చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అదేవిధంగా మనిద నేయ జననాయక కట్చి కార్యదర్శి తమిమున్ అన్సారి రజనీకాంత్‌పై విమర్శలు చేశారు. ఆయన ఇంతకు ముందు భారతీరాజా దర్శకత్వంలో నటించారని, ఇప్పుడు బీజేపీ దర్శకత్వంలో నటిస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment