Gopalkrishna Gandhi
-
విపక్షాలకు దెబ్బ మీద దెబ్బ.. గోపాలకృష్ణ గాంధీ కూడా నో
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. ఎవరిని సంప్రదించినా మాకొద్దు బాబోయ్ అంటూ సైలెంట్‌గా సైడ్ అవుతున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రతిపక్ష నేతల అభ్యర్థనను మహత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్షాల తరుపున పోటీ చేయనని చెప్పినవారి జాబితాలో గాంధీ వరసగా మూడో వ్యక్తి. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవర్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా పోటీకి దూరంగా ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు గాంధీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది ప్రతిపక్ష నాయకులు నన్ను అడిగారు. దీనిని నేను గౌరవంగా భావిస్తున్నాను. వారి అందరి ఆలోచనలకు నేను కృతజ్ఞుడను. కానీ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన తరువాత ప్రతిపక్షాల అభ్యర్థి.. జాతీయ ఏకాభిప్రాయాన్ని, ప్రతిపక్షాల ఐక్యతను సాధించే వ్యక్తి అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇందుకు నాకంటే మెరుగైన వారు ఉన్నారని భావిస్తున్నాను. కాబట్టి అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని నాయకులను అభ్యర్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా గోపాలకృష్ణ గాంధీ పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా నో చెప్పడంతో ఎవరినీ బరిలోకి దింపాలా? అని విపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 21న విపక్ష పార్టీలు మరోసారి సమావేశం కానున్నాయి. ఈ భేటీలో రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్ధి ఖరారుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చదవండి: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత.. -
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీ మనవడు!
-
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీ మనవడు!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెర మీదకు గోపాల్‌కృష్ణ గాంధీ పేరు వినిపిస్తోంది. మహాత్మా గాంధీ, సీ రాజగోపాలచారిల మనవడైన గోపాల్‌కృష్ణ గాంధీ.. పోటీలో నిలపాలనే ప్రతిపాదనను వామపక్ష పార్టీలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఆయన కొంత సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐఏఎస్, మాజీ దౌత్యవేత్త అయిన గోపాల్‌కృష్ణ గాంధీ.. గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పని చేశారు. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ గాంధీ పోటీ చేశారు కూడా. అయితే ఆ సమయంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. ఇదిలా ఉంటే.. బుధవారం జరగబోయే విపక్షాల భేటీతో రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించబోయే ఈ భేటీకి దూరం జరిగాయి నాలుగు పార్టీలు. టీఆర్ఎస్, ఆప్, బీజేడీ, అకాలీదళ్ గైర్హాజరు కానున్నాయి. భేటీలో కాంగ్రెస్ ఉన్నందునా తాము భేటీకి దూరంగా ఉంటామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాలకు సీనియర్ నేత షాక్ -
వెంకయ్య ఘన విజయం.. ఇక ఉపరాష్ట్రపతిగా..
-
వెంకయ్య ఘన విజయం.. ఇక ఉపరాష్ట్రపతిగా..
న్యూఢిల్లీ : దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అనుకున్నట్లుగానే ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజార్టీని సాధించారు. మొత్తం 781 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణకు 244 ఓట్లు వచ్చాయి. శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ ఆవరణలో మొదలైన ఈ ఓటింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో వెంటనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగుతున్న హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది. దీంతో ఆగస్టు 11న ఆయన భారతదేశానికి 13వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎవరి అంచనాలకు అందకుండా వెంకయ్యానాయుడి ఎన్డీయే నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈయనపై పోటీ చేసిన మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీకి ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి. లోక్‌సభలో మెజార్టి ఉన్న ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనప్రాయమేనని అనుకున్న విషయం తెలిసిందే. రైతు కుటుంబం నుంచి.. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడి ప్రస్థానమంతా చాలా ఆసక్తిగా కనిస్తుంది. ముఖ్యంగా ఆయనకు ఆభరణం మాట. చక్కటి మాటలతో ఆయన ఎవరినైనా మంత్రముగ్దుల్ని చేయగలరు. ఏ అంశాన్నయినా విశ్లేషించగలరు. విద్యార్థి దశ నుంచి తనలో మొలకెత్తిన నాయకత్వ లక్షణాలను పొదివిపట్టుకున్న ఆయన అంచలంచెలుగా ఎదిగి దేశంలోనే రెండో అత్యున్నత పదవిని అందుకున్నారు. సొంత ప్రతిభతోపాటు తాను ఎంతో నమ్ముకున్న పార్టీని కడవరకు అంటిపెట్టుకునే ఉన్నందుకే ఆయనను ఈ అదృష్టం దక్కిందని చెప్పాలి. వెంకయ్య బాల్యం గురించి సంక్షిప్తంగా.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చవటపాళెం అనే గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో వెంకయ్యనాయుడు జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తల్లి చనిపోవడంతో మేనమామ మస్తాన్‌నాయుడు ఆదరణలో శ్రీరామపురంలో పెరిగారు. అక్కడే పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం నెల్లూరు వెళ్లటానికి సుమారు 6 కి.మీలు నడిచి వెళ్లేవారు. నెల్లూరులో డిగ్రీ వరకు చదివిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 ఏప్రిల్ 14న ఉషమ్మను వివాహం చేసుకున్నారు. రాజకీయాలవైపు.. ప్రతికూల పరిస్థితుల్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకునే ఆయన రాజకీయాల్లో అజాత శత్రువనే చెప్పాలి. సమయస్ఫూర్తి, వాగ్ధాటి ఆయన సొంతం లౌక్యం, మాటకారితనం, కష్టపడి పనిచేసే తత్వం ఈ స్థాయికి తీసుకెళ్లాయి. విశాఖపట్నంలో న్యాయవాద విద్య అభ్యసించేటప్పుడు జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొని విద్యార్ధి నేతగా మారారు. ఉద్యమంలో అరెస్టై తొలిసారి జైలుకు వెళ్లిన ఆయన తర్వాత జయప్రకాశ్ నారాయణ్(జేపీ) ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విద్యార్ధి సంఘర్షణ సమితి పేరుతో కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు వెళ్లారు. తొలిసారి 1977లో జనతా పార్టీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1978లో ఇందిర ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లోనే ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ హయంలో కూడా రెండోసారి విజయం సాధించారు. 1987 డిసెంబర్ 31 నుంచి నాలుగు రోజులపాటు విజయవాడలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో 45నిమిషాలపాటు వెంకయ్య చేసిన ప్రసంగం నాటి అగ్ర నేతలు వాజ్‌పేయి, అద్వానీలను అమితంగా ఆకర్షించింది. దీంతో ఆయనకు జాతీయ రాజకీయాల్లో ప్రవేశం దొరికినట్లయింది. ఆ తర్వాత ఆయన జాతీయ నేతగా వివిధ పదవులు నిర్వహించారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ ప్రస్తానం 1973-74 : ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షులు 1974-75 : లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ యువజన సంఘర్ష్ సమితి రాష్ట్ర విభాగం కన్వీనర్ 1977-80 : జనతాపార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు 1978-83 : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నిక 1980-83 : ఏపీ భాజపా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి 1983-85 : ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నిక (భాజపా శాసనసభపక్ష నేత) 1988-93 : ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు 1993-2000 : భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి 1998 : కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక. భాజపా పార్లమెంటరీ కార్యదర్శిగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1998-99 : హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ, వ్యవసాయ కమిటీల్లో సభ్యుడు. 2000-02: వాజ్‌పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి 2002-04 : భాజపా జాతీయ అధ్యక్షుడు 2004 : కర్ణాటక నుంచి రెండో సారి రాజ్యసభకు ఎంపిక 2014-: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, సమాచార శాఖ మంత్రి. కొన్నాళ్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. 2016 : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నాలుగోసారి ఎన్నిక 2017 : ఆగస్టు 5న ఉపరాష్ట్రపతిగా ఎన్నిక -
ఓటింగ్ ముగిసింది.. ఇక లెక్కింపే
-
ఓటింగ్ ముగిసింది.. ఇక లెక్కింపే
న్యూఢిల్లీ: దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ ఆవరణలో మొదలైన ఈ ఓటింగ్ ప్రక్రియ, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 781 ఓట్లలో 771 ఓట్లు పోలయ్యాయి. వెంటనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఫలితాలు రాత్రి 7 గంటల వరకు వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగుతున్న హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అధికారపక్షం ఎన్డీయే తరుఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు బరిలోకి దిగగా... ప్రతిపక్షాలు మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని పోటీకి దింపాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గోపాలకృష్ణ గాంధీకి మద్దతిచ్చాయి. అయితే, లోక్‌సభలో మెజార్టి ఉన్న ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనమే. -
ఉపరాష్ట్రపతి ఎన్నికలు: వార్ వన్ సైడ్ కాబోదు!
- విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ కామెంట్ న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోవని విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిపై పోటీచేసిన విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ గణనీయంగా ఓట్లు సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పోలింగ్ సందర్భంగా శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీరాకుమార్లాగే నాకు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఓట్లు పడతాయనే నమ్మకం ఉంది. కాబట్టి వార్ వన్ సైడ్ అయ్యే అవకాశమే లేదు’ అని గాంధీ అన్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తలపడుతోన్న వెంకయ్యనాయుడితో తనకు మంచి స్నేహం ఉందని, రాజ్యాంగపరమైన ప్రక్రియలో భాగంగానే తాము పోటీపడుతున్నామని, ఇరువురమూ స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నామని గోపాలకృష్ణ గాంధీ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ హాలులో శనివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మొదటి ఓటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షానికి చెందిన ఎంపీలు ఓట్లు వేశారు. విపక్ష ఎంపీలు మధ్యాహ్నం తర్వాత ఓటు వేసే అవకాశం ఉంది. నేటి సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. -
ఉపరాష్ట్రపతి ఎన్నికలు: ఆ ఓట్లు వెంకయ్యకు కాదా?
- ఇంతకు ముందే విపక్షాల అభ్యర్థికి మద్దతు ప్రకటించిన జేడీయూ - శనివారం ఉదయం వరకూ విరుద్ధ ప్రకటన చేయని నితీశ్ కుమార్ న్యూఢిల్లీ: భారతదేశపు 13 ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా పార్లమెంట్ హౌస్‌లో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెల్లడిస్తారు. ఇప్పటికే లభించిన మద్దతును బట్టి ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్యనాయుడు గెలుపు ఖాయమే అయినప్పటికీ.. ఇటీవలే బీజేపీతో పొత్తుపెట్టుకున్న నితీశ్ కుమార్(జేడీయూ పార్టీ) ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తారా? లేక ఇంతకు ముందే ప్రకటించినట్లు విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి ఓటేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు బేషరతుగా మద్దతు పలికినిన నితీశ్.. ఉపరాష్ట్రపతి విషయంలో మాత్రం యూ టర్న్ తీసుకుని.. విపక్షాల అభ్యర్థి గాంధీకే ఓటేస్తామని ప్రకటించారు. అయితే ఇటీవల బిహార్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల దరిమిలా, బీజేపీతో అంటకాగుతున్న జేడీయూ ఓటును తిరస్కరించాలని కొందరు ఎన్సీపీ నేత తారీఖ్ అన్వర్.. గోపాలకృష్ణ గాంధీకి సూచించారు. కానీ అందుకు గాంధీ ఒప్పుకోలేదు. ‘మద్దతు వద్దనడం భావ్యం కాదు’ అని సున్నితంగా చెప్పారు. ఒకవేళ నితీశ్ పార్టీ గాంధీకే ఓటువేస్తే ఎన్డీఏ పార్టీల స్పందన ఎలా ఉండబోతోందన్నది కీలకంగా మారింది. కాగా, శనివారం ఉదయం వరకూ నితీశ్ మరో ప్రకటన చేయకపోవడాన్నిబట్టి ఆయన పార్టీ(జేడీయూ) గాంధీకే ఓటు వేయబోతున్నట్లు అర్థమవుతోంది. మాక్‌పోలింగ్‌లో తడబడ్డ ఎన్డీఏ సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు ముందు, అంటే శుక్రవారం సాయంత్రం ఎన్డీఏ కూటమి సభ్యులకు మాక్ పోలింగ్ నిర్వహించగా, 16 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం 17 మంది ఎన్డీఏ సభ్యుల ఓట్లు చెల్లకుండా పోయినా దరిమిలా ఈ సారి ఆ తప్పు జరగకుండా ఉండేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. కాగా, మాక్ పోలింగ్ సందర్భంగా తనకు మద్దతు ఇస్తోన్న సభ్యులతో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు మాట్లాడారు. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారన్న సగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్‌సభలో 337 సభ్యులు, రాజ్యసభలో 80 మంది సభ్యుల బలం ఉంది. దీనికితోడు ఏఐడీఎంకే, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన 67 మంది కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటువేయనున్నారు. తద్వారా మొత్తం 790 ఎంపీల్లో వెంకయ్యకు 484 మంది మద్దతు లభించినట్లయింది. గెలవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫికర్(395)ను ఆయన ఎప్పుడో అధిగమించారు. దీంతో ఆయన గెపులు లాంఛనమైంది. -
తెర మీదకు గాంధీజీ మనవడి పేరు..
న్యూఢిల్లీ: జూలైలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మహాత్మా గాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిగా జేడీయూ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ పేర్లు చక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ తాజగా గాంధీజీ వారసుడిని తెరమీదకు తెచ్చే యత్నం చేస్తోంది. (గాంధీజీ కుమారుడు దేవేంద్ర కొడుకే గోపాల్‌కృష్ణ గాంధీ. ఐఏఎస్ అధికారి అయిన ఆయన 1992లో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.) గోపాల్‌కృష్ణ గాంధీ అభ్యర్థిత్వంపై పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ మాట్లాడుతూ... ఈ విషయంపై తాను ఇప్పుడే మాట్లాడలేననని, దీనిపై చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి... ఈ అంశంపై గోపాల్‌కృష్ణ గాంధీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ మద్దతు కూడా ఉంది. అలాగే మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ పేరు కూడా వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పాలకపక్ష అభ్యర్థికి పోటీగా ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కసరత్తును భుజానికెత్తుకున్న కాంగ్రెస్ పార్టీ తరఫు అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి నామినేట్ చేసేందుకు ఇతర పార్టీలు సుముఖంగా లేవు. ఇక పాలకపక్ష రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రధానంగా వినిపిస్తోంది. -
'మెమన్ కు క్షమాభిక్ష పెట్టండి'
న్యూఢిల్లీ: ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడిన యాకూబ్ మెమన్ కు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఉరిశిక్షను వ్యతిరేకించిన అబ్దుల్ కలాంకు నివాళిగా మెమన్ కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. ఈ నెల ఆరంభంలో ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని న్యాయ కమిషన్ కు కలాం తెలిపారని గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో మెమన్ కు ప్రాణభిక్ష పెట్టి అతడికి కొత్త జీవితం ప్రసాదించాలని రాష్ట్రపతిని గాంధీ అభ్యర్థించారు. తొందరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు. మెమన్ కు క్షమాభిక్ష పెట్టేందుకు గతేడాది రాష్ట్రపతి తిరస్కరించారు. క్షమాభిక్ష పెట్టాలని మరోసారి రాష్ట్రపతిని మెమన్ అభ్యర్థించాడు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకోవాల్సివుంది.