
ఉపరాష్ట్రపతి ఎన్నికలు: వార్ వన్ సైడ్ కాబోదు!
- విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ కామెంట్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోవని విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిపై పోటీచేసిన విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ గణనీయంగా ఓట్లు సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పోలింగ్ సందర్భంగా శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘మీరాకుమార్‌లాగే నాకు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఓట్లు పడతాయనే నమ్మకం ఉంది. కాబట్టి వార్ వన్ సైడ్ అయ్యే అవకాశమే లేదు’ అని గాంధీ అన్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తలపడుతోన్న వెంకయ్యనాయుడితో తనకు మంచి స్నేహం ఉందని, రాజ్యాంగపరమైన ప్రక్రియలో భాగంగానే తాము పోటీపడుతున్నామని, ఇరువురమూ స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నామని గోపాలకృష్ణ గాంధీ చెప్పుకొచ్చారు.
పార్లమెంట్ హాలులో శనివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మొదటి ఓటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షానికి చెందిన ఎంపీలు ఓట్లు వేశారు. విపక్ష ఎంపీలు మధ్యాహ్నం తర్వాత ఓటు వేసే అవకాశం ఉంది. నేటి సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.