సాక్షి, నెల్లూరు: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈవోడీబీలో ఆంధ్రప్రదేశ్‌కి దేశంలోనే ప్రథమ స్థానం దక్కడం అభినందనీయమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఆదివారం నెల్లూరు జర్నలిస్టులతో వెబినార్ కార్యక్రమాన్ని నిర్శహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు మరింత కృషి చేస్తామని, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని కేంద్ర పథకాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
పెండింగ్‌లో ఉన్న పథకాలు, సంస్థల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తి చేస్తామని తెలిపారు. కరోనా రోగులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కోవిడ్‌పై పూర్తిగా దృష్టి సారించారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. దానికోసం రూ.15వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరుచుకోవచ్చుని పేర్కొన్నారు.
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం కోలుకుంటుండటం శుభ పరిణామమని ఉప రాష్ట్రపతి తెలిపారు. నిత్యం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి వర్గాల నుంచి తెలుసుకుంటున్నానని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేయిస్తామని తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంసీఐ గుర్తింపు కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తామని చెప్పారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన సులభతర వాణిజ్య విభాగంలో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – ఈవోడీబీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 2019 సంవత్సరానికిగాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా సులభతర వాణిజ్యం కోసం నిర్దేశించిన 187 సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేయడం ద్వారా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment