సాక్షి, రాజమండ్రి: ఆంగ్లభాషను ప్రోత్సహించడంలో తప్పులేదని.. ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డెల్టా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా ఇంగ్లీష్ భాష అవసరమని.. అలాగే మాతృభాషను కూడా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నదుల అనుసంధానం అనేది ప్రధాన ప్రక్రియ అని, అది జరిగితే ఆహార సమస్య ఉండదని చెప్పారు. గోదావరి నీటిని ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమకు కూడా అందించే ప్రయత్నం చేస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు.
గోదావరి అంటే ఎంతో ఇష్టం..
రాజమండ్రిలో మరిన్ని విద్యాలయాలు, వైద్యాలయాలు రావాలన్నారు. గోదావరి ప్రాంతానికి రావడం అంటే తనకెంతో ఇష్టమన్నారు. కార్యక్రమం పెద్దది కాకపోయినా.. సేవా కార్యక్రమం కావడంతో హాజరయ్యానన్నారు. దేశంలో టెలీ మెడిసిన్ విస్తృతం కావాలన్నారు. ప్రపంచంలో అనేక చోట్ల భారతీయ వైద్యులు సేవలందిస్తున్నారన్నారు. అమెరికాలో మొదటి టాప్ టెన్ వైద్యుల్లో ఐదుగురు భారతీయులేనని తెలిపారు. అందరూ ప్రోటీన్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment