ఉపరాష్ట్రపతి ఎన్నికలు: ఆ ఓట్లు వెంకయ్యకు కాదా?
- ఇంతకు ముందే విపక్షాల అభ్యర్థికి మద్దతు ప్రకటించిన జేడీయూ
- శనివారం ఉదయం వరకూ విరుద్ధ ప్రకటన చేయని నితీశ్ కుమార్
న్యూఢిల్లీ: భారతదేశపు 13 ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా పార్లమెంట్ హౌస్‌లో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెల్లడిస్తారు. ఇప్పటికే లభించిన మద్దతును బట్టి ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్యనాయుడు గెలుపు ఖాయమే అయినప్పటికీ.. ఇటీవలే బీజేపీతో పొత్తుపెట్టుకున్న నితీశ్ కుమార్(జేడీయూ పార్టీ) ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తారా? లేక ఇంతకు ముందే ప్రకటించినట్లు విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి ఓటేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు బేషరతుగా మద్దతు పలికినిన నితీశ్.. ఉపరాష్ట్రపతి విషయంలో మాత్రం యూ టర్న్ తీసుకుని.. విపక్షాల అభ్యర్థి గాంధీకే ఓటేస్తామని ప్రకటించారు. అయితే ఇటీవల బిహార్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల దరిమిలా, బీజేపీతో అంటకాగుతున్న జేడీయూ ఓటును తిరస్కరించాలని కొందరు ఎన్సీపీ నేత తారీఖ్ అన్వర్.. గోపాలకృష్ణ గాంధీకి సూచించారు. కానీ అందుకు గాంధీ ఒప్పుకోలేదు. ‘మద్దతు వద్దనడం భావ్యం కాదు’ అని సున్నితంగా చెప్పారు. ఒకవేళ నితీశ్ పార్టీ గాంధీకే ఓటువేస్తే ఎన్డీఏ పార్టీల స్పందన ఎలా ఉండబోతోందన్నది కీలకంగా మారింది. కాగా, శనివారం ఉదయం వరకూ నితీశ్ మరో ప్రకటన చేయకపోవడాన్నిబట్టి ఆయన పార్టీ(జేడీయూ) గాంధీకే ఓటు వేయబోతున్నట్లు అర్థమవుతోంది.
మాక్‌పోలింగ్‌లో తడబడ్డ ఎన్డీఏ సభ్యులు
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు ముందు, అంటే శుక్రవారం సాయంత్రం ఎన్డీఏ కూటమి సభ్యులకు మాక్ పోలింగ్ నిర్వహించగా, 16 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం 17 మంది ఎన్డీఏ సభ్యుల ఓట్లు చెల్లకుండా పోయినా దరిమిలా ఈ సారి ఆ తప్పు జరగకుండా ఉండేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. కాగా, మాక్ పోలింగ్ సందర్భంగా తనకు మద్దతు ఇస్తోన్న సభ్యులతో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు మాట్లాడారు.
పార్లమెంట్ ఉభయసభల సభ్యులు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారన్న సగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్‌సభలో 337 సభ్యులు, రాజ్యసభలో 80 మంది సభ్యుల బలం ఉంది. దీనికితోడు ఏఐడీఎంకే, వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, ఇతర పార్టీలకు చెందిన 67 మంది కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటువేయనున్నారు. తద్వారా మొత్తం 790 ఎంపీల్లో వెంకయ్యకు 484 మంది మద్దతు లభించినట్లయింది. గెలవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫికర్(395)ను ఆయన ఎప్పుడో అధిగమించారు. దీంతో ఆయన గెపులు లాంఛనమైంది.