బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన చంపయీ సోరెన్‌! | Champai Soren To Join BJP On august 30 Confirms Himanta Biswa Sarma | Sakshi
Sakshi News home page

బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన చంపయీ సోరెన్‌!

Published Tue, Aug 27 2024 7:00 AM | Last Updated on Tue, Aug 27 2024 8:48 AM

Champai Soren To Join BJP On august 30 Confirms Himanta Biswa Sarma

ఢిల్లీ: జార్ఖండ్‌ ఆదివాసీ నేత,  మాజీ సీఎం చంపయీ సోరెన్‌.. జేఎంఎంకు ఝలక్‌ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరునున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై  చంపయీ సైతం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా ఆయన చేరికను నిర్ధారిస్తూ.. బీజేపీ నేత, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ‘ఎక్స్‌’ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘మాజీ సీఎం, ఆదివాసీ నేత చంపయీ సోరెన్‌ ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు. రాంచీలో చంపయీ అధికారికంగా ఆగస్టు 30 (శుక్రవారం)బీజేపీలో చేరనున్నారు’అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని చంపయ సోరెన్‌ ఇటీవల అన్నారు. మరోవైపు.. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తోందని జేఎంఎం కార్యవర్గ నేత, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి నాయకులను జార్ఖండ్‌కు తెచ్చి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో విషం నింపుతోందని, ఒకరిపైకి మరొకరిని ఉసిగోల్పుతోందని అన్నారు.

భూ కుంభకోణం కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల గడువు జనవరి 5, 2025తో ముగియనుంది. దీంతో.. ఈ ఏడాది చివర్లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. తాజాగా జమ్ము కశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జార్ఖండ్‌కు ప్రకటన చేయొచ్చనే ప్రచారం జరిగింది. కానీ, ఈసీ అలాంటిదేం చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement