2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు. 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలని భావించిన ఆ జట్టును ఆతిధ్య దేశం చావుదెబ్బకొట్టగా.. కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావిస్తే, ఆ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
తొలి వన్డేలో ఓటమిపాలై వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న శ్రీలంక.. కివీస్‌తో ఇవాళ (మార్చి 28) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం కావడంతో వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే అశలను పూర్తిగా వదిలేసుకుంది. ఇంతలోనే ఆ జట్టుకు ఐసీసీ మరో షాకిచ్చింది. కివీస్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఐసీసీ ఆ జట్టుకు ఓ పాయింట్ కోత విధించింది. దీంతో శ్రీలంక అధికారికంగా వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు చిన్న జట్లతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది.
కాగా, క్రైస్ట్‌చర్చ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో శ్రీలంక సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే తొలి వన్డేలో నెగ్గిన కివీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2 వన్డేల అనంతరం 1-0 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ శ్రీలంక ఆఖరి వన్డేలో గెలిచినా సిరీస్ డ్రా అవుతుందే తప్ప, ఒరిగేదేమీ ఉండదు. మూడో వన్డే మార్చి 31న హామిల్టన్ వేదికగా జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment