వైఎస్సార్‌ సీపీలోనే శెట్టిబలిజలకు సముచిత స్థానం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోనే శెట్టిబలిజలకు సముచిత స్థానం

Published Sun, May 5 2024 8:15 AM

వైఎస్సార్‌ సీపీలోనే శెట్టిబలిజలకు సముచిత స్థానం

సుభాష్‌ వ్యాఖ్యలు సరికావు

ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు,

పార్టీ శెట్టిబలిజ నాయకులు

అమలాపురం టౌన్‌: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే శెట్టిబలిజలకు సముచిత స్థానం లభించిందని ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ శెట్టిబలిజ నాయకులు స్పష్టం చేశారు. అమలాపురానికి చెందిన రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ శెట్టిబలిజలకు వైఎస్సార్‌ సీపీ ఏమీ చేయలేదని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీతో పాటు పార్టీ నాయకులు ఖండించారు. స్థానిక వాసర్ల గార్డెన్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, పార్టీ శెట్టిబలిజ నాయకులు మాట్లాడారు. బోడసకుర్రులో కూటమి అభ్యర్థులు, టీడీపీ నాయకులతో జరిగిన సమావేశంలో శెట్టిబలిజలపై సుభాష్‌ చేసిన తప్పుడు ఆరోపణలపై వారు నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరు శెట్టిబలిజ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చి సగర్వంగా ఆ చట్టసభకు తొలిసారి పంపించారని గుర్తు చేశారు. శెట్టిబలిజ కార్పొరేషన్‌, ఎమ్మెల్సీలతో పాటు జెడ్పీ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ పదవులు ఇచ్చారని వివరించారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలు, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో శెట్టిబలిజలకు వైఎస్సార్‌ సీపీ టిక్కెట్లు ఇచ్చిన విషయాన్ని తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని మాట్లాడుతూ సుభాష్‌ టీడీపీ అభ్యర్థిగా మాట్లాడాలే తప్ప అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలకు వచ్చి కుల రాజకీయాలు చేయడం, వైఎస్సార్‌ సీపీ శెట్టిబలిజలకు ఏమీ చేయలేదని అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొందరు శెట్టిబలిజ నాయకులు బ్రోకర్లని వ్యాఖ్యానించిన సుభాష్‌ అమలాపురంలో ఒకప్పుడు వైఎస్సార్‌ సీపీ నాయకులైన అతని తండ్రి తదితరులు బ్రోకర్లు అవుతారా...? అని ఎదురు ప్రశ్నించారు. గతంలో సుభాష్‌కు వైఎస్సార్‌ సీపీ సముచిత స్థానమే ఇచ్చిందని గుర్తు చేశారు. తన వ్యక్తిగత స్వార్థ రాజకీయాలపరంగా అతనికి వ్యక్తిగతంగా ఏర్పడిన బాధను అదేదో మొత్తం శెట్టిబలిజ జాతికి అన్యాయం జరిగిపోయినట్లు, వైఎస్సార్‌ సీపీ తననేదో అగౌరపరిచినట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. కులాన్ని రెచ్చగొట్టే స్థాయిలో మాట్లాడే సుభాష్‌ తన వైఖరి మార్చుకోవాలని, రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా శెట్టిబలిజలు ఉన్న విషయాన్ని గుర్తెరగాలని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ దంగేటి డోలామణి, పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, నాయకులు కుడుపూడి భరత్‌ భూషణ్‌, చిట్టూరి పెదబాబు, వాసర్ల వెంకన్న, కుడుపూడి త్రినాథ్‌, కముజు రమణ తదితరులు పాల్గొని సుభాష్‌ వ్యాఖ్యలను ఖండించారు.

Advertisement
Advertisement