ఇక దోస్త్‌ షురూ.. | Sakshi
Sakshi News home page

ఇక దోస్త్‌ షురూ..

Published Mon, May 6 2024 12:10 AM

ఇక దో

ఖమ్మంసహకారనగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈనెల 3వ తేదీన విడుదల చేసింది. ఈనెల 6 నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం తదితర కోర్సుల్లో చేరాలనుకునే వారు దోస్త్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. దోస్త్‌ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియలో విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా తాము చేరదలుచుకున్న కళాశాలను, సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్‌ ప్రక్రియ మూడు విడతలుగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 37 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. ఖమ్మం నగరంలో ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సత్తుపల్లి, నేలకొండపల్లి, మధిరల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కలిపి 15,840 సీట్లు ఉన్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 16 ప్రైవేటు కళాశాలలు ఉండగా 7,380 సీట్లు ఉన్నాయి. మీ సేవ, ఆన్‌లైన్‌ సర్వీస్‌లతో పాటు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

దోస్త్‌ ప్రక్రియ ఇలా..

దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ద్వారా డిగ్రీలో ప్రవేశాల కోసం మూడు విడతల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తొలి విడత ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుండగా వచ్చే నెల 25వ తేదీ వరకు విద్యార్థులు రూ.200 రుసుంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 15 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, జూన్‌ 3న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటాయి. 4 నుంచి 10వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కళాశాల ఫీజు, సీటు రిజర్వేషన్‌ ఫీజు ఆన్‌ౖలైన్‌ ద్వారా చెల్లించాలి.

● ఇక 2వ విడతలో రూ. 400 రిజిస్ట్రేషన్‌ ఫీజుతో ఆన్‌లైన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల (జూన్‌) 4 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఉండగా, 4 నుంచి 14వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. 18న సీట్లు కేటాయిస్తారు. 19 నుంచి 24వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కళాశాల ఫీజు, సీటు రిజర్వేషన్‌ ఫీజు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

● 3వ విడత ప్రక్రియ జూన్‌ 19 నుంచి 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు జరగనుండగా రూ.400 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 19 నుంచి 26వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు, 29న సీట్ల కేటాయింపు జరగనుంది. 29 నుంచి జూలై 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. 1, 2, 3 విడతల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థులంతా జూన్‌ 29నుంచి జూలై 5వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి 6వ తేదీల్లో ఆయా కళాశాలల్లో విద్యార్థులతో ఓరిఝెంటేషన్‌ కార్యక్రమాలు ఏర్పాటుచేసి 8 నుంచి తరగతులు నిర్వహించనున్నారు.

మూడు విడతల్లో డిగ్రీలో ప్రవేశాలు

నేటి నుంచి దరఖాస్తులు

రిజిస్ట్రేషన్‌ సమయంలో విద్యార్థులకు కావాల్సినవి..

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం

హాల్‌టికెట్‌ నంబర్‌

ఆధార్‌కార్డు జిరాక్స్‌

ఆధార్‌కార్డుకు లింకై న ఫోన్‌ నంబర్‌.

టెన్త్‌, ఇంటర్మీడియట్‌ మెమోలు

6 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు

స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు

ఇంటర్మీడియట్‌ టీ.సీ

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు

పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో

ఆధార్‌కార్డు

ఓటీపీలు ఇతరులకు చెప్పొద్దు

దోస్త్‌ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఓటీపీని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే కళాశాలలో ఉన్న హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించవచ్చు. లేదంటే సమీపంలోని కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

– ఎం.సుబ్రహ్మణ్యం,

దోస్త్‌ కో ఆర్డినేటర్‌, ఖమ్మం

ఇక దోస్త్‌ షురూ..
1/2

ఇక దోస్త్‌ షురూ..

ఇక దోస్త్‌ షురూ..
2/2

ఇక దోస్త్‌ షురూ..

Advertisement
Advertisement