'హీరామండి' వెబ్‌ సిరీస్‌ రివ్యూ | Heeramandi Web Series 2024 Telugu Review And Rating, Streaming On Netflix | Sakshi
Sakshi News home page

Heeramandi OTT Response: సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది..?

Published Sat, May 4 2024 11:41 AM

Heeramandi Web Series Telugu Review And Rating

టైటిల్‌ : హీరామండి: ది డైమండ్‌ బజార్‌ (వెబ్‌సిరీస్‌)
నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌,  తదితరులు
నిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్
దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీ
సంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్
కథ:    మొయిన్ బేగ్
జానర్‌:     చారిత్రక నాటకం
ఎపిసోడ్స్‌:
భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్‌

'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్‌ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. పీరియాడిక్‌ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్‌, బాజీరావ్‌ మస్తానీ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను డైరెక్ట్‌ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్‌ 'హీరామండి' సిరీస్‌ ఎలా ఉందో తెలుసుకుందాం.

కథేంటంటే... 
బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..?  ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. 

హీరామండిలో ఉండే  షాహీ మహల్‌ నిర్వహణ మొత్తం మల్లికా జాన్‌ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది.  ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు.  అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్‌ అనే మరో మహల్‌ ఉంటుంది. అక్కడ ఫరీదాన్‌ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్‌) మల్లికా జాన్‌కు సోదరి. బిబోజాన్‌ (అదితిరావ్‌ హైదరి), ఆలంజేబు (షర్మిన్‌ సెగల్‌) ఇద్దరూ కూడా మల్లికా జాన్‌కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్‌ దత్తత తీసుకున్న కూతురు.

హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్  (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే  మల్లికా జాన్‌ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్‌ ప్రేమలో పడతారు. 

కానీ, మల్లికా జాన్‌  చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్‌దార్‌ (తాహా షా బహదూర్‌ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్‌తో పాటు తాజ్‌దార్‌ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్‌ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్‌ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. 

ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్‌ (అదితిరావ్‌ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర  పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్‌గా బిబోజాన్‌ ఒక గూఢచారి  అని తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్‌న్‌ అనచివేసేందుకు ఫరీదాన్‌ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్‌ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్‌ చూడాల్సిందే..

ఎలా ఉందంటే..
పీరియాడిక్‌ డ్రామా చిత్రాలను  డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్‍డ్రాప్‍లో హీరామండి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్‌ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్‌ చాలు.. ఈ సిరీస్‌ డెప్త్‌ ఏంటో చెప్పడానికి బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. 

లాహోర్‌ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్‌కు, బ్రిటీష్‌వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్‌లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర   పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్‌ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్‌లలో తన విజువల్‌ ఫీస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు.  హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్‌ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్‌లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో  సంజయ్‌లీలా భన్సాలీ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు.

తన టేకింగ్‌, విజువల్‌ ఫీస్ట్‌తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్‌కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్‌ సిరీస్‌ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్‌లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్‌ మాత్రం దుమ్మురేపుతాయి. 

మల్లికా జాన్‌ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్‌ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్‌ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది.  వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్‌లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్‌ చేసేలా ఈ సిరీస్‌ ఉంటుంది. బ్రిటీష్‌ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్‌ను 'హీరామండి'గా సంజయ్‌లీలా తీసుకొచ్చాడు.

ఎవరెలా చేశారంటే
రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో టాప్‌ హీరోయిన్‌లను దర్శకుడు సెలక్ట్‌ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ వంటి స్టార్స్‌ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్‌కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్‌ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా నెగెటివ్‌ పాత్రలో మెప్పించింది. 

వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్‌ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం విజువల్స్‌, కాస్ట్యూమ్స్‌,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్‌ సీన్స్‌  ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్‌ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి.

Rating:
Advertisement
Advertisement