
జిల్లాలో జాతిపిత జాడలు
స్వాతంత్య్రపోరాటంలో భాగంగా దేశపర్యటనలో మన జిల్లాకు మహాత్మాగాంధీ పలుమార్లు వచ్చారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, జిల్లా ముఖ్యపట్టణం కాకినాడలలో
నమో నమో బాపూ మాకు న్యాయమార్గమే చూపూ
నిరంతరం మా హృదంతరంలో నిలిచి ఉండు మూర్తీ నిత్య సత్య కీర్తీ
అని కవులు కొనియాడిన మహాత్మా గాంధీ స్మృతులు
జిల్లాలో ఎన్నెన్నో...
స్వాతంత్య్రపోరాటంలో భాగంగా దేశపర్యటనలో మన జిల్లాకు మహాత్మాగాంధీ పలుమార్లు వచ్చారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, జిల్లా ముఖ్యపట్టణం కాకినాడలలో ఆయన పర్యటన స్మృతులు వాడని తలపులే.
రాజమండ్రిలో...
తొలిసారిగా గాంధీ మహాత్ముడు 1921 మార్చి 30న రాజమండ్రి వచ్చారు. ఆయనతోపాటు లాలా లజపతిరాయ్, చిత్తరంజన్‌దాస్, ఇతర జాతీయ నాయకులు వచ్చారు. అప్పుడు రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న మైదానంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. నూలు వడకడం ప్రాధాన్యత, దురలవాట్లకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై గాంధీజీ ప్రసంగించారు. తిలక్ స్వరాజ్య నిధికి విరాళాలివ్వాల్సిందిగా ఆయన అభ్యర్థించారు.
రెండోసారి 1921 ఏప్రిల్ 6న రాజమండ్రి వచ్చారు. అప్పుడు పాల్‌చౌక్ (ప్రస్తుతం కోటిపల్లి బస్టాండ్ వద్ద ఫ్రీడంపార్కు ఉన్న స్థలం)లో ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని టంగుటూరి ప్రకాశం తెలుగులోకి అనువదించారు. మూడోసారి 1929 మే 6న రాజమండ్రి వచ్చి కందుకూరి వీరేశలింగం పురమందిరం (టౌన్‌హాల్)ను సందర్శించారు. నాలుగోసారి 1933 డిసెంబర్ 24న పాల్‌చౌక్‌లో మహాత్ముడు ప్రసంగించారు. ఆ సందర్భంగా గాంధీజీని సన్మానించారు. హరిజన నిధికి సన్మాన సంఘం సభ్యులు రూ.1300 విరాళంగా సమర్పించారు. చివరిసారిగా మహాత్ముడు 1946 జనవరి 20న రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి రైల్వేస్టేషను ఎదుట ఉన్న ప్రాంగణంలో మహాత్ముడు ప్రసంగించారు. సుమారు లక్షమంది ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో రాజమహేంద్రవర హిందీప్రచారమండలి తరఫున రూ.500 విరాళాన్ని గాంధీజీకి సమర్పించారు. గాంధీజీ హిందీ ప్రసంగాన్ని నాటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి కళావెంకటరావు తెలుగులోకి అనువదించారు.
కాకినాడలో...
మహాత్మా గాంధీ కాకినాడను రెండు సార్లు సందర్శించారు. 1920లో నగరంలో ఆయన పలు సమావేశాలను నిర్వహించారు. ఆ స్మతి చిహ్నంగా ఆసమావేశాలు జరిగిన ప్రాంతంలో (ప్రస్తుతం గాంధీనగర్) గాంధీపార్కును పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1940 ఆగస్టు 9న ఇక్కడ గాంధీజీ విగ్రహాన్ని డాక్టర్ రాజగోపాలాచారి ప్రారంభించారు. గాంధీజీ చిన్ననాటి ఫోటోలతో పాటు, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలకు సంబంధించిన అనేక చిత్రాలను పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలో భద్రపరిచారు.
1921 ఏప్రిల్ 3వ తేదీన కాంగ్రెస్ సేవాదళ్ హరిజనుల కోసం కాకినాడలో నిర్వహించిన సేవాశిబిరాల్లో పాల్గొనేందుకు గాంధీజీ రెండోసారి కాకినాడ వచ్చారు. సుమారు ఏడు రోజులు ఆయన ఇక్కడ బస చేశారు. దళితులకు మేలు జరిగేలా స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రోత్సహించారు. కాకినాడలో విద్యార్థులకు వసతిగృహాలను ప్రారంభించారు. ప్రస్తుతం గాంధీభవన్ ఉన్న ప్రాంతంలో బాపూజీ ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు. ఆయన బస చేసిన గాంధీభవన్ ద్వారా నాటి ప్రముఖులు తనికెళ్ల సత్యనారాయణమూర్తి , మెర్ల సుబ్బారావు అందించిన ఆర్థిక సాయంతో ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈట్రస్టు ద్వారా లైబ్రరీ, విద్యార్థులకు సేవా కార్యక్రమాలు, కళాకారుల వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
-రాజమండ్రి కల్చరల్ / బాలాజీ చెరువు (కాకినాడ)