‘కోడ్‌’ ఉన్నా కమీషన్ల బేరం! | TDP Another corruption with the name of electricity storage project | Sakshi

‘కోడ్‌’ ఉన్నా కమీషన్ల బేరం!

Published Wed, May 15 2019 4:18 AM | Last Updated on Wed, May 15 2019 8:11 AM

TDP Another corruption with the name of electricity storage project - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి(కోడ్‌) అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేట్‌ సంస్థలతో రూ.వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. ‘ముఖ్య’నేతకు భారీగా ముడుపులు చెల్లించిన సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిదారులకు ఆఖరి నిమిషంలో భారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫెక్లీ పవర్, ఎనర్జీ షిప్పింగ్‌ స్టోరేజ్‌ సిస్టమ్‌ పేరుతో కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.  ప్రైవేట్‌ సంస్థలు– ప్రభుత్వ పెద్దల మధ్య కుదిరిన ఈ డీల్‌కు రాష్ట్ర కేబినెట్‌ మార్చిలోనే ఆమోదముద్ర వేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు దీనిపై అభ్యంతరాలు లేవనెత్తినా ప్రభుత్వం లెక్కచేయలేదు. ఇంతలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంపై ఒత్తిడి పెంచింది. ఉత్పత్తిదారుల నుంచి అధిక ధరకు కరెంటు కొనుగోలు చేసి, వారికి లాభం చేకూర్చి, కమీషన్లు దండుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే.. 
తక్షణమే విద్యుత్‌ సమన్వయ కమిటీ సమావేశమై, ఈ ప్రాజెక్టును ఆమోదించాలని గత రెండు రోజులుగా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే సంబంధిత ఒప్పందాలు జరిగిపోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హుకూం జారీ చేయడంతో విద్యుత్‌ అధికారులకు దిక్కు తోచడం లేదు. బుధవారం విద్యుత్‌ సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేసి, ప్రైవేట్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుకూలంగా తీర్మానం చేయాలని సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్న ట్రాన్స్‌కో సీఎండీ వ్యక్తిగత సెలవులో ఉన్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) సీఎండీ ఎన్నికల విధుల్లో ఇతర రాష్ట్రానికి వెళ్లారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో విజిలెన్స్‌ జేఎండీనే అన్ని బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత హడావిడిగా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమిటని విద్యుత్‌ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా లేని ఈ ప్రాజెక్టును ఆమోదించమని ఒత్తిడి చేస్తే తాము సెలవుపై వెళ్తామని ఇద్దరు చీఫ్‌ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. తమను బలి పశువును చేస్తున్నారని ట్రాన్స్‌కో తాత్కాలిక జేఎండీ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఏమిటీ ప్రాజెక్టు? 
రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తిదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఎక్కడా లేని విధంగా అత్యధిక రేట్లకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. తాజాగా ఫెక్లీ పవర్‌ పేరుతో 600 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఉత్పత్తిదారులు చెప్పిన రేటుకు 25 ఏళ్ల పాటు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ప్రతిపాదించింది. ఆయా సంస్థలు ఉత్పత్తి చేసిన సౌర, పవన విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి, విద్యుత్‌ డిమాండ్‌ ఉన్న సమయంలో డిస్కమ్‌లకు అందిస్తాయి. ఇతర రాష్ట్రాల్లో పవన, సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.3 చొప్పున లభిస్తోంది. బ్యాటరీల్లో నిల్వ చేసి అందించడం వల్ల యూనిట్‌ రూ.6 వరకూ పడుతుందని ప్రైవేట్‌ సంస్థలు పేర్కొన్నాయి. అదేవిధంగా ఏపీ జెన్‌కో ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌ను 400 మెగావాట్ల మేర నిల్వ చేసి, అవసరం అయినప్పుడు అందించే మరో విధానాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. దీన్ని ఎనర్జీ షిప్పింగ్‌ స్టోరేజ్‌ సిస్టమ్‌ అంటారు. జెన్‌కో ఉత్పత్తి చేసేదాని కన్నా ప్రైవేటు సంస్థలు నిల్వ చేసి, తిరిగి ఇవ్వడానికే ఎక్కువ ఖర్చవుతుందని తేల్చారు. దాదాపు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేయడం ఇంతవరకూ ఎక్కడా లేదని, ఏ ప్రయోగం లేకుండానే ఈ ప్రాజెక్టును ఎలా ఆమోదిస్తామని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ ఆమోదించి తీరాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. ప్రభుత్వ పెద్దలకు ప్రైవేట్‌ ఉత్పత్తిదారుల నుంచి భారీగా ముడుపులు అందాయనే అనుమానాలు బలపడుతున్నాయి. 

ఒత్తిడికి తాళలేక సెలవుపై అధికారులు 
ప్రభుత్వ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. రాబోయే ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తే తాము చిక్కుల్లో పడతామని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ గుర్తించారు. అందుకే ఆయన ఈ నెల 22 వరకూ సెలవు పెట్టారని విద్యుత్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ కూడా వారం రోజులుగా సెలవులో ఉన్నారు. నిజానికి ఆయన మంగళవారం విధుల్లో చేరాల్సి ఉంది. ఆయన సెలవును పొడిగించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇంజనీర్లు సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement