
మృతి చెందిన శరవణన్, ప్రభు (ఫైల్)
స్వలింగ సంపర్కం ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది.
అన్నానగర్: స్వలింగ సంపర్కం ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. స్నేహితుడిని హత్య చేసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చెన్నైలో సోమవారం చోటుచేసుకుంది. చెన్నై పార్క్ ప్రాంతానికి చెందిన జలకేష్‌కుమార్ అన్నాసాలై రిచ్ వీధిలో ఎలక్ట్రిక్ దుకాణం నడుపుతున్నాడు. ఇతని దుకాణంలో చింతాద్రిపేటకి చెందిన శరవణన్ (30), గోవిందన్ వీధికి చెందిన ప్రభు (28) వీరిద్దరూ పని చేస్తున్నారు. వీరిద్దరూ స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డారు. ఈ విషయం ప్రభు ఇంట్లో తెలియడంతో అతన్ని మందలించారు. దీంతో ప్రభు శరవణన్‌ను దూరం పెట్టాడు. ఈ క్రమంలో దుకాణం వద్ద తనను కలవాలని ప్రభును శరవణన్ బతిమాలాడు. దీంతో ప్రభు ఆదివారం రాత్రి దుకాణం వద్దకు వెళ్లాడు.
అప్పుడు ప్రభుని స్వలింగ సంపర్కానికి శరవణన్ పురమాయించాడు. అందుకు ప్రభు అంగీకరించకపోవడంతో ఆవేశం చెందిన శరవణన్ కత్తితో ప్రభు గొంతు కోశాడు. ఈ ఘటనలో ప్రభు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు విచారణకు భయపడి శరవణన్ దుకాణంలో ఉన్న ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పటిలాగే మహిళా కార్మికురాలు సోమవారం ఉదయం దుకాణం తెరవగా ప్రభు, శరవణన్ వీరిద్దరూ మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న చింతాద్రిపేట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.