పాలసీలు ఎంత గొప్పగా ఉన్నా పనిచేసే యంత్రాంగం మీదనే ఫలితాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
విజయవాడ: పాలసీలు ఎంత గొప్పగా ఉన్నా పనిచేసే యంత్రాంగం మీదనే ఫలితాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం విజయవాడలో రెండోరోజు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అధికారుల సత్వర స్పందన వల్లనే సత్ఫలితాలు సిద్ధిస్తాయని, సరైన ప్రణాళికతో చురుగ్గా పనిచేయాలని కోరారు. సమాజంలో అట్డడుగు వర్గాలు, ఆర్ధికంగా వెనుకబడిన మహిళలు సాధికారత సాధించాలనే సత్సంకల్పంతో తాను డ్వాక్రా మహిళలకు ఇసుక క్వారీల నిర్వహణను అప్పగించానని వివరించారు. అవినీతి ఎంత ప్రమాదమో, అసమర్ధత కూడా అంతే ప్రమాదమన్నారు. ఇసుక క్వారీల ద్వారా ఒకప్పుడు ప్రభుత్వానికి ఏటా రూ.50 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చేదని చెబుతూ, తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏడాదికే రూ.750 కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు.
ఆర్ధిక క్రమశిక్షణ మన కర్తవ్యమన్నారు. ఆర్థిక నిర్వహణ సక్రమంగా ఉంటే అభివృద్ధి సవ్య దిశలో జరుగుతుందని తెలిపారు. ఎక్కడైతే నిధులు పక్కదారి పడతాయో అక్కడ వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకోవడం కత్తి మీద సామేనని, ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసి ఆర్ధిక వ్యవస్థను గాటిలో పెడుతున్నట్లు వివరించారు. పర్యాటక శాఖపై సమీక్షిస్తూ.. కొల్లేరును కాలుష్యం లేకుండా దేశంలో ఆదర్శ పర్యటక కేంద్రంగా తీర్చదిద్దుతామని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ను టూరిజం హబ్‌గా రూపొందిస్తామని తెలిపారు.
సర్టిఫికెట్‌లెస్ గవర్నెన్స్
ఐటీ ఒక వాస్తవం.. మాన్యువల్‌గా చేసే వేల పనులు నేడు ఐటీ సహాయంతో వేగంగా చేయగలుగుతున్నామని చెప్పారు. ఐటీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం, పనుల్లో వేగం సాధ్యమవుతాయన్న విషయాన్ని గుర్తించాలని వివరించారు. రెవెన్యూశాఖలో 113 సర్టిఫికెట్ల కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్నారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్‌లెస్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. రెండేళ్లలో ఈ-ప్రగతి ప్రాజెక్టు పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ అవసరాలకు ఏపీ స్టోర్ పేరుతో యాప్ స్టోర్ రూపొందిస్తున్నామన్నారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో త్వరలో టెలిహెల్త్, ఈ-లెర్నింగ్ ప్రవేశపెడతామని తెలిపారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు, చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు, పరకాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.