కడప శాసనసభ్యులు షేక్ బెపారీ అంజద్‌బాషాకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కడప కార్పొరేషన్: కడప శాసనసభ్యులు షేక్ బెపారీ అంజద్‌బాషాకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన్ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2005 ఎన్నికల్లో కార్పొరేటర్‌గా రాజకీయాల్లోకి ప్రవేశించిన అంజద్‌బాషా, 2014లో కడప నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి 45వేల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన కొన్నాళ్లకే పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డారు. జిల్లాలో ప్రప్రథమంగా ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. అంజద్‌బాషాకు అత్యున్నత పదవి లభించడంపై పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం– అంజద్
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తానని ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు. పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకముంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ప్రజాధనంతో జాతీయ పార్లమెంటరీ సదస్సు నిర్వహించి, అందులో పాల్గొనేందుకు వచ్చిన రోజాను నిర్బంధించి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మహిళలపై సీఎంకు, స్పీకర్‌కు ఉన్న చిన్నచూపు వారి మాటల్లోనే తెలిసిపోతోందని దుయ్యబట్టారు. కడపలో పట్టపగలే టీడీపీ గూండాలు కార్పొరేటర్‌పై దాడి చేయడం వారి అరాచకాలకు పరాకాష్ట అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే టీడీపీ యత్నాలు సాగనీయబోమని హెచ్చరించారు.