
సాక్షి, అమరావతి : చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల నిర్వహించనున్న పోలింగ్‌లో 3,899 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో ఈ ఐదు బూత్‌లలో మొత్తం 3,483 ఓట్లు నమోదయ్యాయి. ఈ ఐదు చోట్ల అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్‌లను స్వాధీనం చేసుకుని యధేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడినట్లు వీడియో రికార్డులు స్పష్టం చేస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం రీ–పోలింగ్‌కు ఆదేశించింది. ఈ ఐదు చోట్ల పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు రీ–పోలింగ్ జరగనుంది. ఎన్‌ఆర్ కమ్మపల్లి (321) బూత్‌లో మొత్తం 698 మంది ఓటర్లుండగా.. పురుషులు 336, మహిళలు 362 మంది ఉన్నారు.
ఇందులో ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో 658 ఓట్లు నమోదయ్యాయి. అదే విధంగా పుల్లివర్తిపల్లి (104) బూత్‌లో 805 ఓట్లుండగా.. పురుషులు 391, మహిళలు 414 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ బూత్‌లో 767 ఓట్లు నమోదయ్యాయి. కొత్త కండ్రిగ (316) పోలింగ్ కేంద్రంలో 991 ఓట్లుండగా.. పురుషులు 482, మహిళలు 509 ఉండగా గత ఎన్నికల్లో 812 ఓట్లు నమోదయ్యాయి. కమ్మపల్లి (318) పోలింగ్ కేంద్రంలో 1,028 ఓట్లుంటే.. పురుషులు 490, మహిళలు 538 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ బూత్‌లో 925 ఓట్లు పోలయ్యాయి. వెంకట్రామపురం (313) పోలింగ్ కేంద్రంలో 377 మంది ఓటర్లలో పురుషులు 179, మహిళలు 198 మంది ఉండగా గత ఎన్నికల్లో 323 ఓట్లు నమోదయ్యాయి.