
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారా...వేరుగా కాపురం పెడుతున్నారా. అయితే ఒన్ మినిట్. వధూవరులు వయోపరిమితి పాటించకుంటే రేషన్‌కార్డు కోసం చాలా పరేషాన్ పడకతప్పదు. అంతేకాదు, ప్రేమపెళ్లి చేసుకున్న జంటలు తల్లిదండ్రుల రేషన్‌కార్డులో నుంచి తమ పేర్ల తొలగింపుపై రూ.100 విలువైన స్టాంపు పత్రాల ద్వారా ఖరారుచేస్తూ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని పౌరసరఫరాలశాఖ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
రాష్ట్రంలో కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేసే క్రమంలో వారి పేర్లు మరో కార్డులో ఉండకూడదు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు పాతకార్డులో పేరు తొలగింపు పత్రాలు తప్పనిసరి చేశారు. అయితే, ప్రేమ వివాహం చేసుకున్న పిల్లల పేర్లను తమ రేషన్‌కార్డులో నుంచి తొలగింపునకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. ఈ కారణంగా రేషన్‌కార్డు పొందలేని వారు చెన్నైలోని పౌరసరఫరాలశాఖ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయ అధికారులు దరఖాస్తుదారుని పేరును రేషన్ కార్డుల నుంచి తొలగించాలని సంబంధిత కార్యాలయాలకు లేఖ రాస్తారు. అక్కడి అధికారులు రిజిస్టరులో సదరు వ్యక్తి పేరును తొలగించి ప్రధాన కార్యాలయానికి çసమాచారాన్ని చేరవేస్తారు. ఆ తరువాత పేరును తొలగించినట్లుగా సర్టిఫికెట్ జారీచేస్తారు. దరఖాస్తుకు సదరు సర్టిఫికెట్‌ను జతచేసి కొత్తకార్డును పొందవచ్చు.
ఈ ప్రక్రియకు ఎంతో సమయం పడుతున్న కారణంగా ప్రేమ వివాహాలు చేసుకున్నవారు నేరుగా దరఖాస్తు చేసుకుంటూ కార్డును పొందలేక శ్రమపడుతున్నారు.ఈ పరిస్థితిపై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ వివాహ సమయంలో యువకునికి 21, యువతికి 18 ఏళ్లు నిండాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల అభీష్టం మేరకు, లేదా వారి ఇష్టపడకున్నా రేషన్‌కార్డు నుంచి తమ పేరును తొలగించుకునే హక్కు ఇలాంటి దంపతులకు ఉంటుంది. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు విధిగా రూ.100 విలువైన స్టాంపు డాక్యుమెంటు దరఖాస్తు చేసుకుని చట్టపరంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్టాంపు పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ పత్రం, కొత్త రేషన్‌కార్డు దరఖాస్తును జతచేసి తమ పరిధిలోని పౌరసరఫరాల కార్యాలయం ద్వారా కొత్త రేషన్‌కార్డును పొందవచ్చు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి రేషన్‌కార్డుల జారీకి రూపొందిన ఈ విధానంపై కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాల్సిందిగా అధికారులను అదేశించామని తెలిపారు. అందండీ సంగతి. ప్రేమ వివాహాలు చేసుకునేవారు కొత్తగా రేషన్‌కార్డు పొందాలంటే వివాహ వయోపరిమితిని పాటించాలి. లేకుంటే రేషన్‌కార్డు కోసం పరేషాన్ పడకతప్పదు.