
రాజ్‌బహదూర్ గౌర్ శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో మాట్లాడుతున్న సురవరం
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ పరిరక్షణతో పాటు లౌకికవాదం, ప్రజాస్వామ్య రక్షణకు ప్రతిఘటన పోరాటాలే శరణ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో రోజు రోజుకు ఫాసిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యంపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, దీనిపై పోరాటం చేయడం ద్వారానే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కార్మికనేత డా.రాజ్‌బహదూర్ గౌర్‌కు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో గురువారం రాజ్‌బహదూర్ గౌర్ శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ..గౌర్ స్ఫూర్తిదాయక నాయకుడని, తెలంగాణ సాయుధ పోరాటంలో గొప్ప పాత్రను పోషించారని కొనియాడారు. మోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, మోదీ అభిప్రాయాలతో ఏకీభవించని వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు.
దళితులు, మేధావులు, ఆలోచనపరులపై దాడులు పెరుగుతున్నాయని ప్రతిఘటన లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమన్నారు. ఏఐటీయూసి జాతీయ ప్రధానకార్యదర్శి అమర్‌జిత్‌కౌర్ మాట్లాడుతూ..జీవితాన్ని కార్మికోద్యమానికి ధారపోసిన గొప్పయోధుడు గౌర్ అన్నారు. అంతకుముందు మఖ్దూం భవన్‌లో ఆవరణలో నిర్మించిన రాజ్‌బహదూర్‌గౌర్ సమావేశ మందిరాన్ని గురువారం ఉదయం సురవరం సుధాకరరెడ్డి ప్రారంభించగా, అక్కడ ఏర్పాటు చేసిన గౌర్ విగ్రహాన్ని బూర్గుల నరసింగరావు ఆవిష్కరించారు. త్యాగధనులు, పోరాట యోధుల త్యాగాలు, స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన అవసరముందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కార్మికోద్యమ నిర్మాత గౌర్ అని నరసింగరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌర్ జయంతి ఉత్సవాల కమిటీ ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకరరావు, కోశాధికారి డా. డి.సుధాకర్, గౌర్ సోదరి అవదేశ్‌రాణి, ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ నాయకులు అజీజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.