
సాక్షి,హైదరాబాద్: జూన్ 2న వరవరరావు(వీవీ) బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నందున ఆయనకు షరతులతో కూడిన బెయి ల్‌కు అవకాశం ఇవ్వాలని వీవీ భార్య, కుమార్తెలు కేంద్ర హోంశాఖ సహా య మంత్రి కిషన్‌రెడ్డికి పంపిన ఓ వినతి పత్రంలో కోరారు. వీవీతో పాటు ప్రొఫెసర్ సాయిబాబాకూ బెయిల్ మంజూరు చేయించాలని కోరారు. వరవరరావు విడుదలకు చొరవ తీసుకోవాలని తెలంగాణ ప్రముఖ రచయితలంతా శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కవులు దేవిప్రియ, అంపశయ్య నవీన్, నందిని సిద్ధారెడ్డి, గొరటి వెంకన్న తదితర 27 మంది లేఖ రాశారు. వీవీ విడుదల కోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలతో మాట్లాడి ఆయన జైలు నుంచి బయటకు వచ్చేలా సహకరించాలని కోరారు. ఇక అక్రమ నిర్బంధంలో ఉన్న వారందరినీ విడుదల చేయాలని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆదివారం నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది.
వరవరరావును విడుదల చేయాలి: ఎమ్మెల్యే రామలింగారెడ్డి
పౌరహక్కుల నాయకుడు వరవరరావును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని దుబ్బాక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే 18 నెలలు జైల్లో ఉన్న ఆయనకు మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. వరవరరావు వయసు, ఆరోగ్యంతో పాటు ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.