
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడితే బీజేపీకి వచ్చే లాభం ఏంటని ఆయన ప్రశ్నించారు. తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టమని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి ఐదేళ్లు సమయం ఉంది. ప్రభుత్వాన్ని కూల గొట్టడానికి గుజరాత్ వ్యాపారులకు పని లేదా? వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.
తాజాగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశ్యం మాకు లేదు. దీంతో, బీజేపీకి వచ్చే లాభమేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అది అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదే. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎటువంటి తొందర లేదు. త్వరలో కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. భూములు అమ్మకం, మద్యం అమ్మకం, అప్పులు తేవడంలో తెలంగాణను నంబర్ వన్‌గా మార్చారు.
అర్థరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టీ ఇలా చెట్లు నరికిన ఘటనలు దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడ జరగలేదు. హెచ్‌సీయూలో చెట్లు కొట్టిన AI వీడియో పోస్టుపై కేసు పెడితే పెట్టుకోండి. భావితరాలకు ల్యాండ్ కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. భూములు అమ్మకం ద్వారానే ప్రభుత్వం నడపాలని అనుకోవద్దు. రేవంత్ ఏ బ్రాండ్ అనేది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. నేషనలిజమే నా బ్రాండ్. ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఎస్‌ఎల్‌బీసీపై నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీకి ఎలా ఫిర్యాదు చేస్తాం?. సింగరేణి కార్మికులకు ఐటీ పన్నులు మేం అధికారంలోకి వస్తే రియింబర్స్ చేస్తాం. సింగరేణి కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తారు. వాళ్లది వైట్ కాలర్ జాబ్ కాదు.

సన్నబియ్యంపై..
ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర ప్రజల అవసరానికి అనుగుణంగా ఇస్తాం. కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు కూడా సరఫరా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కోటా కాకుండా ప్రతీ లబ్దిదారుడికి అదనంగా ఐదు కేజీల సన్న బియ్యం ఇచ్చి చూపించాలి. దొడ్డు బియ్యం పైసలతోనే సన్న బియ్యం ఇస్తున్నారు. దీంట్లో కొత్తగా ఏముంది? అని ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికలలో తమిళనాడులో నష్టపోయామని.. అక్కడ పొత్తుకు వెళ్లాం. య అధ్యక్షుడిగా నా పేరు ప్రచారంపై అటువంటి ప్రస్తావనే లేదు. దక్షిణాదికి లోక్ సభ సీట్లు తగ్గుతాయనేది గాలి ప్రచారం మాత్రమే. అన్యాయంగా వక్ఫ్ పేరుతో ఆక్రమించిన భూముల కోసమే కొంతమంది ఆందోళనలు చేస్తున్నారు. ఎంఐఎం నేతలు, అక్రమంగా లబ్ది పొందిన వారే ఆందోళనల్లో ఉన్నారు. ఏ ఒక్క సామాన్య, పేద ముస్లిం కూడా ఆందోళన చేయడం లేదు. వక్ఫ్ సవరణ చట్టం మీద భూ బకాసురులు ఉద్యమం చేస్తున్నారు. ముస్లిం ప్రార్థన మందిరాలను, వక్ఫ్‌కు సంబంధం లేదు’ అని అన్నారు.