ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హడావుడిగా పట్టిసీమ నుంచి కృష్ణాకు నీరు తరలించేందుకు ప్రమాణాలు లేని నాసిరకం నిర్మాణాలు చేయడంతో జానంపేట అక్విడెట్ వద్ద గండి పడింది.
ఏలూరు మెట్రో (పగో జిల్లా): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హడావుడిగా పట్టిసీమ నుంచి కృష్ణాకు నీరు తరలించేందుకు ప్రమాణాలు లేని నాసిరకం నిర్మాణాలు చేయడంతో జానంపేట అక్విడెట్ వద్ద గండి పడింది. పట్టిసీమ నుంచి పోలవరం కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు జానంపేట వద్ద అక్విడెట్‌ను నిర్మించారు. అక్విడెట్ వద్ద శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గండి పడింది. దాంతో కృష్ణా డెల్టాకు నీరు చేరకపోగా గోదావరి నీరు వృధాగా తమ్మిలేరులోకి చేరుతోంది. దాంతో లోతట్టు ప్రాంతమైన ఏలూరు సంతోష్‌నగర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు అధికారికంగా హెచ్చరిక జారీ చేశారు.
రెవెన్యూ అధికారులు సంతోష్‌నగర్ ప్రాంతానికి చేరుకుని ముంపునకు గురయ్యే ప్రమాదముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గోదావరి నీటిని కృష్ణాకు తరలింపు పనులు హడావుడిగా చేయడమే ఇందుకు ప్రధాన కారణమని, నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంతోష్‌నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాణాలు పాటించకుండా పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కాంట్రాక్టర్ల నుంచి పాలక పెద్దలకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలు నిజమని భావించాల్సివస్తుందని సంతోష్‌నగర్ వాసులు అంటున్నారు.