
పోలవరం పనులకు రెండో విడత అడ్వాన్సుగా రాష్ట్ర ఖజానాలో జమ చేసిన కేంద్రం
తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలని ఆదేశం
ఇప్పటికీ జమ చేయని రాష్ట్ర ప్రభుత్వం
ఇతర అవసరాలకు మళ్లించారంటున్న అధికార వర్గాలు
అక్టోబర్ 9న తొలి విడత ఇచ్చిన రూ.2,348 కోట్లనూ మళ్లించిన సర్కారు
కేంద్ర జల్ శక్తి శాఖ పదేపదే జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు జనవరిలో జమ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా.. నిధుల సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న రెండో విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,704.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. తక్షణమే ఆ నిధులను సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేసి, రసీదు పంపాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు రోజూ ఒత్తిడి చేస్తుండటంతో జల వనరుల శాఖ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.
నిర్వాసితులకు పరిహారం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించేయడంపై అధికారవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 9న తొలి విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇదే రీతిలో మళ్లించేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు జనవరి రెండో వారంలో వాటిని నోడల్ ఏజెన్సీ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
ఖర్చు పెట్టిన నిధులను తిరిగిస్తే చంద్రబాబు గగ్గోలు
గతంలో పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి (రీయింబర్స్ చేసేది) ఇచ్చేది. అంటే.. కేంద్రం రీయింబర్స్ చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులే. ఆ నిధులను ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పథకాల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినియోగిస్తే.. పోలవరం నిధులను దారి మళ్లించేశారంటూ చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు అప్పట్లో దుష్ఫ్రచారం చేశారు.
రీయింబర్స్‌మెంట్ ప్రక్రియలో జాప్యం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని.. అడ్వాన్సుగా నిధులు ఇచ్చి ప్రాజెక్టు పనులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ప్రధాని మోదీ అప్పట్లో సానుకూలంగా స్పందించారు.
ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు పనులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.459.68 కోట్లను రీయింబర్స్ చేయడంతోపాటు రూ.2,348 కోట్లను తొలి విడత అడ్వాన్సు రూపంలో మొత్తం రూ.2,807.68 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది.

అదే రోజున వాటిని రాష్ట్ర ఖజానాలో జమ చేసింది. ఈ నిధులను సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్‌లో జమచేసి.. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్ నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన పెట్టింది. ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేశాక.. వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) పంపితే మిగతా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది.
ఈ నెల 12న రెండో విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,704.81 కోట్ల విషయంలోనూ ఇదే నిబంధనలు పెట్టింది. అప్పట్లో రీయింబర్స్ చేసిన నిధులను మళ్లించేశారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అడ్వాన్సు నిధులను మళ్లించేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.