
పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి నదికి 2027లో వచ్చే పుష్కరాలకు ముందుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గురువారం పోలవరం ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శించి ఎంపిక చేసిన నిర్వాసితులతో సమావేశమయ్యారు. అనంతరం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.
మార్చి నెలాఖరుకు కాంట్రాక్టర్లకు నిర్దేశించిన పనుల్లో వెనుకబడి ఉండటం, కొందరు సమావేశానికి హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ 2025 నాటికి, కుడి మెయిన్ కెనాల్ కనెక్టివిటీ పనులను 2026 జూలై నాటికి, ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్–1 పనులను 2026 మార్చి నాటికి, ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్–2 పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ పుష్కరాల దృష్ట్యా 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.
అర్హులైన నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు ప్రాంతాలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బట్రస్ డ్యామ్ పూర్తికి రూ.82 కోట్లు ఖర్చవుతుందని, ప్రాజెక్టు అత్యవసర పనులకు రూ.400 కోట్లు, భూసేకరణకు రూ.486 కోట్లు ఖర్చవుతుందని అధికారులు సీఎంకు వివరించారు.
ప్రాజెక్ట్ పూర్తయితే 400 టీఎంసీల నిల్వ
అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రాజెక్టు పూర్తయితే 400 టీఎంసీలు నిల్వ చేయొచ్చని, వాటిని వాడుకుంటే రాష్ట్రాన్ని కరువురహితంగా చేయవచ్చని చెప్పారు. పోలవరంపై 82 సార్లు వర్చువల్‌గా సమీక్షించానని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుందని, 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027కు పూర్తవుతుందని చెప్పారు.
మంత్రులు నిమ్మల, నాదెండ్ల, పార్థసారథి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఎస్.రామసుందరరెడ్డి, జెన్‌కో ఎండీ చక్రధరబాబు ఆయన వెంట ఉన్నారు.