bedsheets
-
బెడ్‌షీట్...బీట్ ది హీట్..!
వేసవిలో కాటన్ బెడ్షీట్లను ఉపయోగించడం మంచిది. కాటన్ చెమటను త్వరగా గ్రహిస్తుంది. నిద్ర పోతున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. చర్మాన్ని జిగటగా ఉంచదు. బెడ్ షీట్లను ఎంచుకునేటప్పుడు 100 శాతం కాటన్ ట్యాగ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని బ్రాండ్లు కాటన్ షీట్లను అమ్ముతున్నప్పటీకి... అవి బ్లెండెడ్ కాటన్‌వి (ఇతర రకాల పదార్థాలతో కలిసిన కాటన్) అయి ఉంటాయి. బ్లెండెడ్ కాటన్ స్కిన్ ఫ్రెండ్లీ కాదు.కలప గుజ్జును ఫైబర్‌గా మార్చడం ద్వారా తయారుచేయబడిన మృదువైన వస్త్రాలలో ‘టన్సెల్’ ఒకటి. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది. వేసవిలో చెమట కారణంగా బెడ్ షీట్లు త్వరగా మురికి పడతాయి. అందువల్ల వారానికి కనీసం రెండుసార్లు బెడ్ షీట్లను మార్చాలి. ఇలాంటి సందర్భాలలో తేలికైన, ఫ్లోయింగ్ కాటన్ షీట్లను ఎంచుకోవడం మంచిది.వేసవిలో దద్దుర్లలాంటి వివిధ చర్మ సమస్యలు వస్తాయి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే సింథటిక్ కాని బెడ్షీట్లను వాడితే మంచిది. వేసవిలో ఎలాంటి కలర్స్ బెడ్ షీట్లను ఎంచుకోవాలనే విషయానికి వస్తే నీలం రంగు బెటర్. లేత నీలం రంగు బెడ్షీట్లు చల్లదనాన్ని కలిగిస్తాయి. (చదవండి: ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!) -
మురికి బెడ్‌షీట్‌తో హఠాత్ అగ్నిప్రమాదాలు.. హెచ్చరించిన ఫైర్ ఫైటర్స్!
రోజంతా పనిచేసి అలసిపోయాక సాయంత్రం అయ్యేసరికి మంచం మీద వాలిపోతాం. రాత్రంతా మంచంపైననే విశ్రాంతి తీసుకుంటాం. అయితే మంచం మీద వేసే బెడ్‌షీట్ గురించి అంతగా ఆలోచించం. చాలామంది అపరిశుభ్రంగా ఉన్న బెడ్‌షీట్‌నే వాడేస్తుంటారు. ఇది అనారోగ్యకరం అని తెలిసినా చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. అయితే తాజాగా ఫైర్ ఫైటర్స్ బెడ్‌షీట్ గురించి తెలిపిన ఒక విషయం ఎంతో ఆశ్చర్యం గొలుపుతోంది. స్లీప్ ఫౌండేషన్ వెలువరించిన ఒక రిపోర్టు ప్రకారం ప్రతీ మనిషి అధిక సమయం బెడ్‌పైనే గడుపుతాడు. అయితే మురికి పట్టిన బెడ్‌షీట్ ఉపయోగిస్తే అది అగ్ని ప్రమాదానికి దారి తీయవచ్చు. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఫైర్ బ్రిగేడ్ డిపార్ట్మెంట్ తెలియజేసింది. మురికిపట్టిన బెడ్షీట్లపై ఎమోలియంట్స్, లేదా స్కిన్ క్రీమ్ అవశేషాలు జమ అవుతాయి. ఇవి మండే గుణాన్ని కలిగివుంటాయి. వేసవి కాలంలో ఇవి మరింత వేడికి గురై అగ్నిప్రమాదాలకు తావిస్తాయి. అందుకు ఎవరైనా చర్మపు క్రీమ్‌లను వినియోగిస్తున్నప్పుడు ఎంతో అప్రమత్తంగా మెలగాలి. అటువంటి క్రీమ్‌లు బెడ్‌షీట్‌కు అంటుకోకుండా చూసుకోవాలి. లండన్‌లో ఈ విధంగా బెడ్షీట్లు దగ్ధమైన ఘటనలు వెలుగు చూశాయి. మిర్రర్ రిపోర్టును అనుసరించి ఎవరైనా వారానికి ఒకసారి బెడ్‌షీట్‌ను శుభ్రం చేయాలి.వీటిని 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటిలో ఉతకాలి.బెడ్షీట్లు, తలదిండు గలేబులు ఎక్కువగా మురికి పట్టినట్లు అనిపిస్తే వారానికి రెండుసార్లు ఉతకాల్సి ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా చర్మవ్యాధులు ఉన్న పక్షంలో బెడ్షీట్లను తరచూ ఉతుకుతుండాలి. ఇది కూడా చదవండి: అందం కోసం కొత్త దంతాలు..‘షార్క్’లా మారిన యువకుడు -
దుప్పట్లు.. ఇక్కట్లు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఏడురోజులు..ఏడు రంగుల దుప్పట్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, అది ఆచరణలో సాధ్యం కాలేదు. వైట్, పింక్ కలర్ దుప్పట్లు ఇచ్చి సరిపెట్టారు. చలికాలం సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా దుప్పట్ల పంపిణీ సంగతి దేవుడెరుగు..కనీసం వాటికోసం ప్రతిపాదనలు కూడా తయారు చేయలేదంటే... ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగుల పట్ల అధికారులకున్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు దుప్పట్లు లేక చలికి గజగజ వణికిపోతున్నారు. జనవరి నెల నాటికి చలితీవ్రత పెరిగే అవకాశమున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్టీ, ఛాతి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మానసిక చికిత్సలయాల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు విలవిల్లాడుతున్నారు. అసలే అనారోగ్యం..ఆపై చలేస్తే కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక రోగులకు సహాయంగా వచ్చిన బంధువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్‌లో నైట్ షైల్టర్లు ఏర్పాటు చేసినా, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఏడన్నారు..రెండిచ్చారు... ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం రోజుకో దుప్పటి చొప్పున ఏడు రంగుల దుప్పట్లను సరఫరా చేయాలని భావించింది. ఆదివారం–బూడిద రంగు, సోమవారం–తెలుగుపురంగు. మంగళవారం–గులాబీరంగు, బుధవారం–ఆకుపచ్చరంగు, గురువారం పసుపుపచ్చరంగు, శుక్రవారం–ఊదారంగు, శనివారం–నీలిరంగు దుప్పట్లు అందజేస్తామని ప్రకటించింది. ఆ మేరకు 2016 ఆగస్టు 27న నగరంలోని ఉస్మానియా, గాంధీ సహా అనుబంధ ఆస్పత్రులకు సుమారు 12 వేల దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఏడు రోజులకు ఏడు రంగులు సరఫరా చేయడం సాధ్యం కాదని, వైట్, పింక్ రంగులకు పరిమితం చేసింది. ఆ తర్వాత దుప్పట్ల సరఫరా నిలిపివేయడంతో ఆయా ఆస్పత్రులే సొంత నిధులతో కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొన్ని ఆస్పత్రులు జైళ్లశాఖ తయారు చేసిన దుప్పట్లను కొనుగోలు చేశాయి. ప్రభుత్వం ఆస్పత్రులకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడంతో అధికారులు దుప్పట్ల కొనుగోలు నిలిపివేశారు. అప్పుడు కొనుగోలు చేసినవాటిలో చాలా వరకు చిరిగిపోగా, మిగిలినవాటిలో మరికొన్ని రోగులు డిశ్చార్జి అయ్యాక తమవెంట తీసుకెళ్లారు. ప్రస్తుతం చాలా పడకలపై దుప్పట్లు కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు రోగుల అవసరాలకు అనుగుణంగా దుప్పట్లు కొనుగోలు చేయాల్సి ఉండగా, దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. అసలే చలికాలం..ఆపై అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు చేరుకున్న క్షతగాత్రులకు కప్పుకునేందుకు పడకపై దుప్పటి కూడా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రుల్లో ఇలా ఉంటే రోగుల నుంచి వైద్య ఖర్చులు వసూలు చేస్తున్న నిమ్స్‌లోనూ దుప్పట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు చలి..అటు డెంగీ దోమలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులుకు ఇన్ఫెక్షన్ సోకుతోంది. ఆస్పత్రిలో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న దుప్పట్లు కూడా రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో రోగులే సొంతంగా దుప్పట్లు సమకూర్చుకోవాల్సి వస్తోంది. పొరపాటున ఎవరైనా దుప్పటి తెచ్చుకోక పోతే రాత్రంగా చలికి వణకాల్సిందే. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన దుప్పట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటి వరకు తయారు చేయలేదు. -
మంత్రి ఉన్నంతసేపే బెడ్షీట్లు..
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రంగు బెడ్షీట్ల తొలగింపు అంశంపై ఆస్పత్రి పాలనా యంత్రాంగం విచారణ చేపట్టింది. వైద్యమంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిలో నూతనంగా సమకూరిన మంచాలు, పరుపులు, రంగు బెట్‌షీట్లను శనివారం ప్రారంభించారు. కార్యక్రమం ముగిసి మంత్రి అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ఆర్థోపెడిక్ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బెడ్షీట్లు, దిండ్లను అక్కడి సిబ్బంది తొలగించారు. ఈ విషయమై మీడియాలో కథనాలు ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ జేవీరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్, ఏడీలతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఈసందర్భంగా సూపరింటెండెంట్ జేవీరెడ్డి మాట్లాడుతూ.. బెడ్షీట్లను తొలగించిన విషయం వాస్తమేనని, అయితే వార్డులో ఉన్న ఆరుగురు రోగుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారన్నారు. ఉన్న ఒక్కరినీ వేరే వార్డుకు తరలించాలని నిర్ణయించారని, ఈక్రమంలో డిశ్చార్జి అయిన ఒక రోగి దిండును తనతోపాటే తీసుకువెళ్లడాన్ని గమనించి సిబ్బంది అడ్డుకున్నారని, మిగిలినవి కూడా అపహరణకు గురవుతాయనే అనుమానంతో బెడ్షీట్లు, దిండ్లు తొలగించారని ప్రాధమిక విచారణలో వెల్లడైందని వివరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని త్రిసభ్య కమిటీని ఆదేశించామని, కమిటీ అందించే వివరాల మేరకు పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.