మంత్రి ఉన్నంతసేపే బెడ్‌షీట్లు..
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రంగు బెడ్‌షీట్ల తొలగింపు అంశంపై ఆస్పత్రి పాలనా యంత్రాంగం విచారణ చేపట్టింది. వైద్యమంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిలో నూతనంగా సమకూరిన మంచాలు, పరుపులు, రంగు బెట్‌షీట్లను శనివారం ప్రారంభించారు. కార్యక్రమం ముగిసి మంత్రి అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ఆర్థోపెడిక్ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బెడ్‌షీట్లు, దిండ్లను అక్కడి సిబ్బంది తొలగించారు. ఈ విషయమై మీడియాలో కథనాలు ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ జేవీరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్, ఏడీలతో త్రిసభ్య కమిటీని నియమించారు.
ఈసందర్భంగా సూపరింటెండెంట్ జేవీరెడ్డి మాట్లాడుతూ.. బెడ్‌షీట్లను తొలగించిన విషయం వాస్తమేనని, అయితే వార్డులో ఉన్న ఆరుగురు రోగుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారన్నారు. ఉన్న ఒక్కరినీ వేరే వార్డుకు తరలించాలని నిర్ణయించారని, ఈక్రమంలో డిశ్చార్జి అయిన ఒక రోగి దిండును తనతోపాటే తీసుకువెళ్లడాన్ని గమనించి సిబ్బంది అడ్డుకున్నారని, మిగిలినవి కూడా అపహరణకు గురవుతాయనే అనుమానంతో బెడ్‌షీట్లు, దిండ్లు తొలగించారని ప్రాధమిక విచారణలో వెల్లడైందని వివరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని త్రిసభ్య కమిటీని ఆదేశించామని, కమిటీ అందించే వివరాల మేరకు పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.