ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి లక్ష మరణాలు
⇒ గాంధీలో రోజుకు 25–30 మంది మృతి: మంత్రి లక్ష్మారెడ్డి
⇒ చివరి దశలో వస్తుంటారు..
⇒ సాధారణ మరణాలుగా పరిగణించాలని వినతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడాదికి ఆరున్నర లక్షల మంది జన్మిస్తుండగా.. అదే సమయంలో 3 లక్షల మంది చని పోతున్నారని.. అందులో లక్ష మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ ఆసు పత్రిలో రోజుకు 25 నుంచి 30 మంది, ఉస్మానియా ఆసుపత్రిలో 20 నుంచి 25 మంది చనిపోతు న్నారని, ఇది ప్రత్యేకమైన విషయం కాదన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశోత్తరాల సమయంలో గీతారెడ్డి, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సీరియస్ కేసులు.. చివరి దశలో ప్రభుత్వాసుపత్రులకు ముఖ్యంగా ఉస్మా నియా, గాంధీ ఆసుపత్రులకు వస్తుంటాయని మంత్రి చెప్పారు. అందుకే మరణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయని, ఇది సర్వసాధారణమన్న విష యాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
నీలోఫర్‌లో బాలింతల మరణాలపై కలెక్టర్ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2,118 వైద్య సిబ్బంది పోస్టులను త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రం లో గర్భిణీల కోసం ఇప్పటికే 41 వాహనాలు నడు స్తున్నాయని, అదనంగా మరో 200 వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్వైన్ ఫ్లూతో కొన్ని మరణాలు సంభవించాయని.. వాటిల్లో అనేకం ఇతరత్రా అనారోగ్య కారణా లతో సంభవించాయన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి స్వైన్‌ఫ్లూ వచ్చిన మాట వాస్తవమేనని.. అయితే ఆయన నిమ్స్‌లో చేరలేదన్నారు. 12 ప్లేట్‌లెట్ సెపరేట్ మిషన్లను తాము కొనుగోలు చేశామని చెప్పారు. కాంగ్రె స్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 108 తీసు కొచ్చి పేదలకు వైద్య సేవలు అందించారని.. 104 సర్వీ సుతో ఉచితంగా మందులు అందజేశారన్నారు.
123పై కోర్టు కెళ్లి స్టే తీసుకొచ్చారు: హరీశ్
123 జీవోపై కాంగ్రెస్ పెట్టిన కేసులను వెనక్కు తీసుకుంటే నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు 10 నెలల్లో పూర్తి చేస్తానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భక్త రామదాసును 11 నెలల్లో పూర్తి చేసిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పట్టించుకోలేదని.. ఇప్పుడూ అంతేనన్నారు.
ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను తాను దగ్గరుండి చేయిస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. హరీశ్ స్పందిస్తూ.. ప్రాజెక్టుకు అడ్డుపడుతోంది కాంగ్రెస్సే అన్నారు. ‘2013 చట్టం వచ్చాక దేశంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్లలేదు.. అదో గుదిబండగా మారింది’ అని మంత్రి అన్నారు. 800 ఎకరాల భూసేకరణకు రైతులు అంగీకరించారని.. కానీ మన కాంగ్రెస్ నాయకులే అడ్డుపడుతున్నారని.. 123 జీవోపై కోర్టుకెళ్లి స్టే తెచ్చారన్నారు. రైతు కేసు వేస్తే సరేనని.. కానీ భూమిలేని రైతులతోనూ కాంగ్రెస్ కేసులు వేయించిందని మండిపడ్డారు.
పాసు పుస్తకాలు రద్దు చేయలేదు: మహమూద్ అలీ
పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయలేదని.. వాటిని హై సెక్యురిటీతో పాస్‌పోర్టు తరహాలో మార్పు చేసి రైతులకిస్తామని జీవన్‌రెడ్డి, సంపత్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సమాధానమిచ్చారు. పాసు పుస్తకాలు రద్దు చేస్తూ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వలేదన్నారు. సభ్యుల సలహా మేరకు చిన్న కార్డుల తరహాలో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కాగా, ‘రద్దు’ ప్రచారంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయని జీవన్‌రెడ్డి ప్రస్తావించారు.