Ice Sheet
-
5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్లాండ్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట! గ్రీన్‌లాండ్‌పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. ‘‘మొత్తమ్మీద ధ్రువాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’’అని ఆందోళన వెలిబుచి్చంది. అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది. అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ‘‘ఆవిరయ్యే నీటిలో ఎంతోకొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలావరకు మాత్రం గ్రీన్లాండ్ జలవ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం’’అని అధ్యయనానికి సారథ్యం వహించిన కెవిన్ రోజి్మయారెక్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్కిటిక్ నుంచి హిమాలయాల దాకా గ్లేసియర్లు మటుమాయం
ఇదేమిటో తెలుసా? కేవలం గత 50 ఏళ్లలో భూమిపై ఉన్న గ్లేసియర్లన్నింట్లో కలిపి కరిగిపోయిన మంచు పరిమాణం! నమ్మశక్యంగా లేకున్నా నిజమిది. పర్యావరణంతో మనిషి చెలగాటం తాలూకు విపరిణామమిది. పారిశ్రామికీకరణకు గ్లోబల్ వార్మింగ్ తదితరాలు తోడై గ్లేసియర్ల ఉసురు తీస్తున్నాయి. ఏటా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు భూమ్మీద మంచు నిల్వలు శరవేగంగా కరిగి నీరైపోతున్నాయి.ఫలితంగా 1976 నుంచి 8,200 గిగా టన్నుల మంచు మాయమైపోయినట్టు కోపర్నికస్ వాతావరణ సేవల విభాగం (సీ3ఎస్) తేల్చింది. ‘‘కేవలం 2000 నుంచి 2023 మధ్యే ఏకంగా 6,000 గిగాటన్నులు ఆవిరైపోయింది. 2010 నుంచి ఈ ధోరణి మరీ వేగం పుంజుకుంది. ఏటా 370 గిగాటన్నుల చొప్పున మంచు కరిగిపోతోంది’’ అని వివరించింది.శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సీ3ఎస్ ఈ గణాంకాలను వెల్లడించింది. ఆర్కిటిక్ నుంచి హిమాలయాల దాకా ప్రపంచవ్యాప్తంగా గ్లేసియర్ల ఉనికి నానాటికీ ప్రశ్నార్థకంగా మారుతోందని హెచ్చరించింది. అందుకే ఈ ఏడాది గ్లేసియర్ల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఐరాస కూడా పిలుపునిచ్చింది. అన్నిచోట్లా.. గత 50 ఏళ్లలో గ్లేసియర్లు అతి ప్రమాదకర వేగంతో చిక్కిపోతున్న ప్రాంతాల్లో పశ్చిమ కెనడా, అమెరికా, మధ్య యూరప్ టాప్‌లో ఉన్నాయి. నైరుతీ ఆసియాతో పాటు రష్యా, కెనడాల పరిధిలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ వేగం కాస్త తక్కువగా, అంటార్కిటికాలో ఇంకా తక్కువగా ఉంది. భారత్‌లోనూ ఆందోళనే భారత్ ఏకంగా 9,000 పైచిలుకు గ్లేసియర్లకు నిలయం. భారత్‌కే గాక పాకిస్తాన్ తదితర పరిసర దేశాలకు కూడా ప్రాణాధారమైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి ప్రధాన జీవనదీ వ్యవస్థలకు ఈ గ్లేసియర్లే జన్మస్థానాలు. దక్షిణాసియాలో 60 కోట్ల మంది ప్రజలకు ఇవి జీవనాధారం. గ్లేసియర్ల కరుగుదలతో ఈ కీలక నదీ వ్యవస్థల భవితవ్యం నానాటికీ ప్రమాదంలో పడుతోంది. కోటా షిగ్రీ గ్లేసియర్ గత 50 ఏళ్లలో సగానికి పైగా చిక్కిపోయింది.గ్లోబల్ వార్మింగ్ తదితర విపత్తులు ఇలాగే కొనసాగితే 2100 నాటికి సగానికి పైగా హిమాలయ గ్లేసియర్లు మాయమైపోతాయని పలు అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరించాయి. హిమాలయాల్లోని కనీసం 10 హెక్టార్ల కంటే పెద్దవైన 2,431 గ్లేసియర్ సరస్సుల పరిమాణం 1984 నుంచి 2023 దాకా నానాటికీ పెరుగుతూ వస్తున్నట్టు ఇస్రో ఉపగ్రహాలు తేల్చాయి. వీటిలో 676 సరస్సుల సైజు రెట్టింపునకు పైగా పెరిగినట్టు తేలడం గ్లేసియర్ల కరుగుదల వేగానికి అద్దం పడుతోంది. ఈ పరిణామం ఆకస్మిక వరదల ముప్పును కూడా నానాటికీ పెంచుతోంది. అంతేగాక దీనివల్ల దీర్ఘకాలంలో మంచినీటి లభ్యత పూర్తిగా తగ్గిపోతుంది. వీటిలో 130కి పైగా సరస్సులు భారత్‌లోనే గంగ, సింధు, బ్రహ్మపుత్ర బేసిన్ల పరిధిలో ఉన్నాయి. ⇒ హిమాచల్‌ప్రదేశ్‌లో 4,068 మీటర్ల ఎత్తులో ఉన్న గెపాంగ్ ఘాట్ గ్లేసియల్ సరస్సు గత 30 ఏళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగి 36 హెక్టార్ల నుంచి 101 హెక్టార్లకు చేరింది. ఇప్పుడు కూడా ఏటా 2 హెక్టార్ల చొప్పున విస్తరిస్తోంది. ⇒ ప్రపంచంలో రెండో అతి పెద్ద ధ్రువేతర గ్లేసియర్ అయిన సియాచిన్ కూడా కుంచించుకుపోతున్నట్టు పలు అధ్యయనాలు తేల్చాయి.గ్లేసియర్లు కరగడం వల్ల... ⇒ పరిసర ప్రాంతాలకు నిత్యం ముంపు భయం పొంచి ఉంటుంది. ⇒ సముద్రమట్టం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ⇒ దీనివల్ల తీర ప్రాంత మహానగరాలన్నీ నీటమునుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 250 కోట్ల మందికి పైగా నిర్వాసితులవుతారు. ⇒ సముద్ర జలాల సంతులనం పూర్తిగా కట్టు తప్పుతోంది. ⇒ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను కాపాడే కీలక సముద్ర ప్రవాహాలు నెమ్మదిస్తున్నాయి. ఇది వాతావరణంలో తీవ్ర హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఫలితంగా ఆకస్మిక వరదలు, కరువు కాటకాలు పరిపాటిగా మారతాయి. ⇒ మంచు నిల్వలు 200 కోట్ల మందికి తాగునీటికి ఆధారంగా నిలుస్తున్నాయి. వాటినుంచి జాలువారే నీటి వనరులు పెద్ద నదులుగా మారి ప్రజల తాగు, సాగుతో పాటు రవాణా తదితర అవసరాలను సుష్టుగా తీరుస్తూ వస్తున్నాయి. అలాంటి కీలక నీటి వనరులు ప్రమాదకర వేగంతో కుంచించుకుపోతుండటంతో కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా నీటి కొరత నానాటికీ పెరిగిపోతోంది. -
ఆ సముద్ర ప్రవాహం... నెమ్మదిస్తోంది!
పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలు ఊహాతీత వేగంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధ్రువాల వద్ద మంచు ఎన్నడూ లేనంత వేగంతో కరిగిపోతుండటం కొన్నేళ్లుగా మనమంతా చూస్తున్న భయానక పరిణామమే. ఇది మరో పెను ప్రమాదానికి కూడా దారి తీస్తోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంటార్కిటికాలో అత్యంత బలమైన సముద్ర ప్రవాహ గతి కొన్నేళ్లుగా క్రమంగా నెమ్మదిస్తూ వస్తోందని వెల్లడించింది. అంటార్కిటికా వద్ద భారీ మంచు ప్రమాదకర వేగంతో కరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని క్రమబదీ్ధకరించడంలో ఈ ప్రవాహానిదే అతి కీలకపాత్ర. అంతేగాక మహాసముద్రాల ప్రవాహాల గతి కూడా చాలావరకు ఈ ప్రవాహ గతిమీదే ఆధారపడి ఉంటుంది. ‘‘లక్షలాది ఏళ్లుగా సమతుల్యంగా కొనసాగుతూ వస్తున్న అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రవాహం కూడా పర్యావరణ మార్పుల దెబ్బకు గాడి తప్పుతుండటం అత్యంత ఆందోళనకరం. ఇదిలాగే కొనసాగితే మానవాళి ఊహాతీతమైన పర్యావరణ విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఏసీసీ... పెట్టనికోట! ప్రపంచ పర్యావరణ సమతుల్యతకు అంటార్కిటికా అత్యంత కీలకమైనది. అంటార్కిటిక్ సర్కంపొలార్ కరెంట్ (ఏసీసీ)గా పిలిచే అక్కడి మహాసముద్ర ప్రవాహం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన సముద్ర ప్రవాహం! పశ్చిమం నుంచి తూర్పుగా అంటార్కిటికా మహాసముద్రం పొడవునా సాగే ఈ ప్రవాహం ప్రపంచ వాతావరణాన్ని, ఇతర సముద్ర ప్రవాహాల గతిని నిత్యం నియంత్రిస్తూ ఉంటుంది. అంతేగాక ప్రధానంగా వేటాడే తత్వముండే ఇతర ప్రాంతాల్లోని సముద్ర జీవరాశులు అంటార్కిటికా జలాల్లోకి ప్రవేశించకుండా ప్రాకృతిక అడ్డుగోడలా కూడా ఏసీసీ నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మానవాళి మనుగడకు ఇది పెట్టనికోట వంటిది. గ్లోబల్ వార్మింగ్ తదితరాల దెబ్బకు అంటార్కిటికాలోని అపారమైన మంచు కొన్నేళ్లుగా శరవేగంగా కరుగుతోంది. దాంతో అపార స్వచ్ఛ జలరాశి నిరంతరం సముద్రంలోకి పోటెత్తుతోంది. దాని దెబ్బకు అంటార్కిటికా మహాసముద్రంలో లవణీయత, నీటి సాంద్రత మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఇదంతా అంతిమంగా ఏసీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ప్రవాహ గతి నానాటికీ నెమ్మదిస్తూ వస్తోంది.ఇలా చేశారుఏసీసీ ప్రవాహ గతిలో మార్పు లపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్కు చెందిన పరిశోధకుల బృందం పరిశోధన చేసింది. అధ్యయనంలో భాగంగా పలు అంశాలపై సైంటిస్టులు లోతుగా దృష్టి పెట్టారు. ఆ్రస్టేలియాలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ జీఏడీఐ సాయంతో సముద్ర ప్రవాహాల్లో మార్పులు తదితరాలను కచి్చతంగా లెక్కగట్టారు. హెచ్చు రెజల్యూషన్‌తో కూడిన సముద్ర, యాక్సెస్–ఓఎం2–01 క్లైమేట్ మోడల్ సేవలను కూడా ఇందుకు వాడుకున్నారు. మహాసముద్ర ప్రవాహాలపై మంచు, స్వచ్ఛ జలరాశి ప్రభావం, తద్వారా వేడిని మోసుకుపోయే సామర్థ్యంలో హెచ్చుతగ్గులు తదితరాలను నిశితంగా పరిశీలించారు. అంతిమంగా ఇవన్నీ ఉష్ణోగ్రత, లవణీయత, పవనాల గతి తదితరాల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతాయో గమనించారు. మంచు కరిగి సముద్రంలోకి చేరే అపార జలరాశి ఏసీసీ ప్రవాహాన్ని వేగవంతం చేస్తుందన్న గత పరిశోధనల ఫలితాలు సరికావని స్పష్టం చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా ఏసీసీ ప్రవాహ గతి బాగా నెమ్మదిస్తోందని తేల్చారు. తాజా పరిశోధన ఫలితాలను ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించారు. పెను విపత్తులే...! ఏసీసీ ఒకరకంగా ప్రపంచ వాతావరణ సమతుల్యతకు ఇంజిన్ వంటిదని అధ్యయన బృంద సభ్యుడైన అసోసియేట్ ప్రొఫెసర్ భిషగ్దత్త గయేన్ వివరించారు. ‘‘మహాసముద్రాలన్నింటికీ కన్వేయర్ బెల్ట్ మాదిరిగా ఏసీసీ పని చేస్తుంది. వేడిమి, కార్బన్ డయాక్సైడ్తో పాటు సముద్రంలోని జీవరాశుల మనుగడకు అత్యంత కీలకమైన పలు పోషకాలు తదితరాలు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ తదితర మహాసముద్రాల మధ్య సజావుగా పంపిణీ అయ్యేలా చూస్తుంది. అది గనక పడకేసిందంటే జరిగే విపరిణామాలు అన్నీ ఇన్నీ కావు’’ అని ఆయన స్పష్టం చేశారు. అవేమిటంటే... → ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు → పలు ప్రాంతాల్లో అత్యంత వేడిమి, ఆ వెనకే అతి శీతల పరిస్థితులు → సముద్ర జలాల్లో లవణీయత పరిమాణం నానాటికీ తగ్గిపోవచ్చు → ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ మరింత వేగం పుంజుకోవచ్చు → ఇతర ప్రాంతాల సముద్ర జలాలకే పరిమితమైన నాచు, కలుపు మొక్కలు, మొలస్కా వంటి జీవులు అంటార్కిటికాలోకి ప్రవేశించవచ్చు. అదే జరిగితే అక్కడి జీవావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇవి అంతిమంగా పెంగి్వన్ల వంటి స్థానిక జీవరాశుల ఆహార వనరులకు కూడా ఎసరు పెట్టవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
హిమ ఫలకం కింద నగరమంత సరస్సు
ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్ షీట్ అని రికార్డు ఉండగానే మరో రికార్డును తూర్పు అంటార్కిటికా హిమ ఫలకం సొంతం చేసుకుంది. దీని కింద ఓ నగరమంత వైశాల్యంలో ఓ పెద్ద సరస్సు ఉందని తేలింది. హిమ ఫలకం మీద దాదాపు మూడేళ్లు ఏరియల్ సర్వే చేసిన చైనా శాస్త్రవేత్తలు.. దీనికి దాదాపు 3.2 కిలోమీటర్ల కింద సరస్సు ఉన్నట్టు గుర్తించారు. ఈ సరస్సుకు ‘స్నో ఈగల్’అని పేరు పెట్టారు. దీని వైశాల్యం 370 చదరపు కిలోమీటర్లు, పొడవు 48 కిలోమీటర్లు, వెడల్పు 14.5 కిలోమీటర్లు, లోతు 198 మీటర్లు. ఈ సరస్సులో 3.4 కోట్ల ఏళ్ల నాటి నది అవక్షేపాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే గనక తెలిస్తే అంటార్కిటికా మంచుమయం కాకముందు ఎలా ఉండేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు వీలుకానుంది. చదవండి👉చేపా చేపా.. వాకింగ్‌కు వస్తావా?