SVS Verma
-
గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది. తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్‌గా తన సేవలు కేబినెట్లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్‌నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మైదుకూరు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే! -
పొత్తు గిత్తు జాన్తానై..! పిఠాపురం సీటు కాపులకే! లేదంటే తడాఖా చూపిస్తాం..
సాక్షిప్రతినిధి,కాకినాడ: తెలుగుదేశంపార్టీలో నేతల మధ్య అంతర్యుద్ధం తారా స్థాయిలో నడుస్తోంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఆ పార్టీ నేతలు సీట్ల కోసం కత్తులు దూసుకుంటున్నారు. ఆవిర్భావం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భిన్న ధ్రువాలుగా ఉన్న ఇద్దరు మెట్ట ప్రాంత నేతల మధ్య ఇటీవల పరిణామాలు భగ్గుమంటున్నాయి. జనసేనతో టీడీపీకి పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ పొత్తు ఉంటే జిల్లాలో టీడీపీ వదులుకోవాల్సిన సీట్లలో పిఠాపురం ముందు వరుసలో ఉంటుందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ వర్మ ఆ సీటును వదులుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అదే రీతిలో పావులు కూడా కదుపుతున్నారు. ఇప్పటికే అల్టిమేటం ఉమ్మడి తూర్పుగోదావరిలోనే అత్యధిక కాపు సామాజికవర్గం ఉన్న నియోజకవర్గం పిఠాపురం. ఈ సీటు జనసేన ఒప్పందంతో సంబంధం లేకుండా అదే సామాజికవర్గానికి ఇవ్వాలనేది జిల్లా పార్టీలో సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల అనంతరం వర్మ పెత్తందారీ విధానాలతో విసుగెత్తిపోయిన ద్వితీయ శ్రేణి నేతలు ఇటీవల ఈ రాగాన్ని బలంగా వినిపిస్తున్నారు. టీడీపీకి అసలు ఖర్మ వర్మతోనే అంటూ ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. వర్మకే మరోసారి అధిష్టానం అవకాశం ఇస్తేగిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని వీరంతా అల్టిమేటం కూడా ఇచ్చారు. మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు, తెలుగు రైతు అద్యక్షుడు జ్యోతుల సతీష్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు మాదేపల్లి శ్రీను, దుడ్డు నాగు, కుంపట్ల సత్యనారాయణ తదితరులు ఇటీవల వర్మ తీరును ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ తూర్పారబట్టారు. తెలుగుదేశం ఏలుబడిలో వర్మ ఎమ్మెల్యేగా ఉండగా తమను విస్మరించి బంధువర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ప్రత్తిపాడుపై ఫోకస్ .. ప్రత్తిపాడు తమకు కేటాయించాలని బీసీలు స్వరం విపిస్తున్నారు. ఇందుకు అక్కడున్న బీసీ సామాజికవర్గాల సంఖ్యాబలాన్ని చూపిస్తున్నారు. అందుకే చాలా కాలంగా యనమల కృష్ణుడు కన్ను ప్రత్తిపాడుపై పడిందని చెబుతున్నారు. వరుస పరాజయాలు మూటగట్టుకున్న ఈయన్ను తుని తెరమీద నుంచి చంద్రబాబు తప్పించి రామకృష్ణుడు కుమార్తెకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అటు తుని, ఇటు ప్రత్తిపాడుల నుంచి కృష్ణుడిని చంద్రబాబు పరిగణనలోకి తీసుకోకపోవడంతో వర్మ పంథా మార్చుకుని ప్రత్తిపాడుపై దృష్టి పెట్టడం వర్గ విబేధాలకు మరింత ఆజ్యం పోసింది. సత్యప్రభకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాక కూడా వర్మ అక్కడ తన సామాజికవర్గానికి చెందిన మురళీరాజును పనిగట్టుకుని పార్టీలో చేర్పించారంటున్నారు. ఈ చేరిక విషయం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కు మాట మాత్రమైనా చెప్పకపోవడంతో ఆ వర్గం వర్మపై అగ్గిమీద గుగ్గిలమవుతోంది. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు దక్కకుంటే ప్రత్తిపాడు తమ సామాజికవర్గానికి కేటాయించుకోవడం ద్వారా వర్మ ప్రయత్నాలకు చెక్ పెడతామని జ్యోతుల వర్గం బాహాటంగానే చెబుతోంది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి ఎటుదారి తీస్తుందోనని టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ల ఆగ్రహం పిఠాపురం వ్యవహారాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని వర్మ వర్గీయుల ఆరోపిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని వర్మ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెహ్రూకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు, పార్టీ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు కాపు సామాజికవర్గానికి చెందిన బవిరిశెట్టి రాంబాబును కుంటిసాకులతో పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని వర్మపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ సస్పెన్షన్‌ను నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరిద్దరి మధ్య విబేధాలు పొడసూపాయి. ఈ నేపథ్యంతోనే నెహ్రూతో రాజకీయ వైరం కలిగిన యనమల రామకృష్ణుడుతో వర్మ జట్టు కట్టారంటున్నారు. తన సీటు కాపాడుకోలేని వర్మ ప్రత్తిపాడు సీటు కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి మెట్ట ప్రాంత టీడీపీ భగ్గుమంటోంది. వరుపుల రాజా మరణం తరువాత ఆయన సతీమణి సత్యప్రభకు అధిష్టానం నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. -
వెన్నులో బాకు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నోటి దాకా తెచ్చిన ముద్దను వెనక్కు లాగి, మూతిమీద గుద్దినట్టు చేస్తున్నారని పలువురు ఆశావహులు వాపోతున్నారు. పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎస్వీఎస్ వర్మ ఈసారి కూడా టిక్కెట్టు ఖాయమనుకున్నారు. బాబు కూడా హామీ ఇచ్చారనే భరోసాతో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ లక్షలు వెచ్చించాలన్నా, జనాన్ని తరలించాలన్నా గుర్తుకు వచ్చే వర్మ టిక్కెట్టు ఇవ్వాల్సి వచ్చేసరికి కనిపించ లేదా అని వర్మ అనుచరులు నిలదీస్తున్నారు. గురువారం బాబుకు వ్యతిరేకంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనదీక్ష చేపట్టారు. బాబు సీఎం కావడమే తన లక్ష్యమని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని వర్మ పైకి అంటున్నా టిక్కెట్టు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలనుకుంటున్నట్టు సమాచారం. పిఠాపురం విషయాన్ని బాబు ఎటూ తేల్చకుండా నానుస్తున్నారని కేడర్ నిప్పులు చెరుగుతోంది. రాజమండ్రి సిటీ, రూరల్‌ల నుంచి గోరంట్ల నామినేషన్ మరో సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరిని కూడా బాబు చివరి వరకు నమ్మించి దగా చేసేందుకు వెనుకాడలేదని గోరంట్ల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన గోరంట్ల వంటి నాయకులకే దిక్కుమొక్కులేని పరిస్థితిపై కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. బాబు తీరుతో విసుగెత్తో లేక తెరవెనుక సంకేతాలు ఇచ్చారో కానీ గురువారం రాజమండ్రి సిటీకి గోరంట్ల నామినేషన్ దాఖలు చేసేశారు. రాజమండ్రి రూరల్లోనూ ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు నలుగురు నామినేషన్లు వేశారు. రాజమండ్రి సిటీని బీజేపీకి కేటాయిస్తున్నట్టు చెప్పిన బాబు 48 గంటలు కూడా గడవకుండానే పొత్తును చిత్తుచేసే ఎత్తుగడకు వెనుకాడ లేదు. రాజమండ్రి సిటీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేద్దామని ఆకుల సత్యనారాయణ అన్నీ సిద్ధం చేసుకుంటుండగా బాబు వెన్నుపోటు రాజకీయాలతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నామని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. తాడోపేడో తేల్చుకోనున్న బత్తుల రాజోలు టీడీపీ ఇన్చార్జి బత్తుల రాము పరిస్థితి కూడా దిక్కుతోచనట్టే ఉంది. గత ఎన్నికల నాటి నుంచి పార్టీ జెండాను భుజానవేసుకుని తిరుగుతున్న రాముకు నమ్మకద్రోహంచేసి రాజోలు టిక్కెట్టును మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఖరారు చేయడంపై పార్టీ శ్రేణులు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఏడాదిన్నర క్రితమే గొల్లపల్లిని అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆ సీటును డబ్బు సంచులున్నాయనే ఏకైక కారణంతో పార్టీ సభ్యత్వం కూడా లేని పండుల రవీంద్రబాబుకు కట్టబెట్టడాన్ని కోనసీమ తెలుగుతమ్ముళ్లు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. బాబు తీరుతో తాడోపేడో తేల్చుకునేందుకు బత్తుల వర్గం శుక్రవారం సమావేశం అవుతోంది. కాకినాడ ఎంపీ సీటుపై భరోసా పొంది, లక్షలు ఖర్చుచేసిన పోతుల విశ్వంకు చివరకు మొండిచేయి చూపించిన బాబు నమ్మకద్రోహానికి మారుపేరుగా నిలిచారని విశ్వం అనుచరులు ఆవేదన చెందుతున్నారు. అభ్యర్థులను ప్రకటించని పెద్దాపురం, పిఠాపురంలో ఏదో ఒకటి కేటాయిస్తారనే చిన్న ఆశతో ఇంకా ఆ వర్గం వేచి చూస్తోంది. సిద్ధమైన బీజేపీ జాబితా మరోపక్క బాబు దగాకోరు రాజకీయాలతో విసుగెత్తి, శనివారం జిల్లాలోని అన్ని స్థానాలకు నామినేషన్లు వేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అమలాపురం పార్లమెంటు స్థానానికి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, రాజోలుకు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి.గన్నవరానికి కొల్లు సూర్యారావు, అమలాపురానికి డాక్టర్ పెయ్యల శ్యామ్‌ప్రసాద్, రామచంద్రపురానికి మోకా వెంకట సుబ్బారావు, ముమ్మిడివరానికి కర్రి చిట్టిబాబు, వేటుకూరి సూర్యనారాయణరావు, కొత్తపేటకు తమలంపూడి రామకృష్ణారెడ్డి, పాలూరి సత్యానందం, కుడుపూడి సూర్యనారాయణరావుల పేర్లతో జాబితా రూపొందించారు. వీరంతా శనివారం నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరానికి వాడుకోవడం, ఆనక వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడుతున్న తెలుగుతమ్ముళ్లకు ఇప్పుడు బీజేపీ నాయకులు తోడయ్యారు. పొత్తు కోసం టీడీపీయే వెంపర్లాడింది : చిట్టిబాబు సీమాంద్రలో తమతో పొత్తు కోసం టీడీపీయే వెంపర్లాడిందని బీజేపీ రాష్ట్ర కార్యనిర్వహక సభ్యుడు కర్రి చిట్టిబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశంలో మోడీ హవాను గమనించిన చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉంటుందని రెండు నెలలుగా ప్రచారం చేసుకున్నారన్నారు. తీరా పొత్తు కుదిరిన తరువాత కుట్రపూరితంగా ఆ పార్టీ నేతలను పోటీకి పెడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని మూడు ఎంపీ, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు శనివారం నామినేషన్లు వేస్తారన్నారు. పొత్తు పేరుతో బాబు దెబ్బ తీశారు : మోకా కార్యకర్తలు, నాయకులు టీడీపీతో పొత్తు వద్దని ముందే అన్నారని బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు చెప్పారు. పొత్తులో కేటాయించిన సీట్లలో కూడా టీడీపీ రెబెల్ అభ్యర్థులు బరిలో ఉన్నారని నిరసించారు. పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ సీమాంధ్రలో అధిక సీట్లు సాధిస్తుందన్నారు. పొత్తు పేరుతో చంద్రబాబు బీజేపీని ఇప్పటికే ఎంతో దెబ్బ తీశారన్నారు. జిల్లాలోని అన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో తమఅభ్యర్థులు పోటీ చేస్తారన్నారు.