వెన్నులో బాకు | PITHAPURAM losing the last election SVS Verma ticket again | Sakshi
Sakshi News home page

వెన్నులో బాకు

Published Fri, Apr 18 2014 12:45 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

వెన్నులో బాకు - Sakshi

వెన్నులో బాకు

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నోటి దాకా తెచ్చిన ముద్దను వెనక్కు లాగి, మూతిమీద గుద్దినట్టు చేస్తున్నారని పలువురు ఆశావహులు వాపోతున్నారు. పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎస్‌వీఎస్ వర్మ ఈసారి కూడా టిక్కెట్టు ఖాయమనుకున్నారు. బాబు కూడా హామీ ఇచ్చారనే భరోసాతో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ లక్షలు వెచ్చించాలన్నా, జనాన్ని తరలించాలన్నా గుర్తుకు వచ్చే వర్మ టిక్కెట్టు ఇవ్వాల్సి వచ్చేసరికి కనిపించ లేదా అని వర్మ అనుచరులు నిలదీస్తున్నారు. గురువారం   బాబుకు వ్యతిరేకంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనదీక్ష చేపట్టారు. బాబు సీఎం కావడమే తన లక్ష్యమని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని వర్మ పైకి అంటున్నా టిక్కెట్టు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలనుకుంటున్నట్టు సమాచారం. పిఠాపురం విషయాన్ని బాబు ఎటూ తేల్చకుండా నానుస్తున్నారని కేడర్ నిప్పులు చెరుగుతోంది.
 
 రాజమండ్రి సిటీ, రూరల్‌ల నుంచి గోరంట్ల నామినేషన్
 మరో సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరిని కూడా బాబు చివరి వరకు నమ్మించి దగా చేసేందుకు వెనుకాడలేదని గోరంట్ల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన గోరంట్ల వంటి నాయకులకే దిక్కుమొక్కులేని పరిస్థితిపై కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. బాబు తీరుతో విసుగెత్తో లేక తెరవెనుక సంకేతాలు ఇచ్చారో కానీ గురువారం రాజమండ్రి సిటీకి గోరంట్ల నామినేషన్ దాఖలు చేసేశారు. రాజమండ్రి రూరల్‌లోనూ ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు నలుగురు నామినేషన్‌లు వేశారు. రాజమండ్రి సిటీని బీజేపీకి కేటాయిస్తున్నట్టు చెప్పిన బాబు 48 గంటలు కూడా గడవకుండానే పొత్తును చిత్తుచేసే ఎత్తుగడకు వెనుకాడ లేదు. రాజమండ్రి సిటీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేద్దామని ఆకుల సత్యనారాయణ అన్నీ సిద్ధం చేసుకుంటుండగా బాబు వెన్నుపోటు రాజకీయాలతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నామని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు.
 
 తాడోపేడో తేల్చుకోనున్న బత్తుల
 రాజోలు టీడీపీ ఇన్‌చార్జి బత్తుల రాము పరిస్థితి కూడా దిక్కుతోచనట్టే ఉంది. గత ఎన్నికల నాటి నుంచి పార్టీ జెండాను భుజానవేసుకుని తిరుగుతున్న రాముకు నమ్మకద్రోహంచేసి రాజోలు టిక్కెట్టును మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఖరారు చేయడంపై పార్టీ శ్రేణులు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఏడాదిన్నర క్రితమే గొల్లపల్లిని అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆ సీటును డబ్బు సంచులున్నాయనే ఏకైక కారణంతో పార్టీ సభ్యత్వం కూడా లేని పండుల రవీంద్రబాబుకు కట్టబెట్టడాన్ని కోనసీమ తెలుగుతమ్ముళ్లు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. బాబు తీరుతో తాడోపేడో తేల్చుకునేందుకు బత్తుల వర్గం శుక్రవారం సమావేశం అవుతోంది. కాకినాడ ఎంపీ సీటుపై భరోసా పొంది, లక్షలు ఖర్చుచేసిన పోతుల విశ్వంకు చివరకు మొండిచేయి చూపించిన బాబు నమ్మకద్రోహానికి మారుపేరుగా నిలిచారని విశ్వం అనుచరులు ఆవేదన చెందుతున్నారు. అభ్యర్థులను ప్రకటించని పెద్దాపురం, పిఠాపురంలో ఏదో ఒకటి కేటాయిస్తారనే చిన్న ఆశతో ఇంకా ఆ వర్గం వేచి చూస్తోంది.
 
 సిద్ధమైన బీజేపీ జాబితా
 మరోపక్క బాబు దగాకోరు రాజకీయాలతో విసుగెత్తి, శనివారం జిల్లాలోని అన్ని స్థానాలకు నామినేషన్‌లు వేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అమలాపురం పార్లమెంటు స్థానానికి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, రాజోలుకు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి.గన్నవరానికి కొల్లు సూర్యారావు, అమలాపురానికి డాక్టర్ పెయ్యల శ్యామ్‌ప్రసాద్, రామచంద్రపురానికి మోకా వెంకట సుబ్బారావు, ముమ్మిడివరానికి కర్రి చిట్టిబాబు, వేటుకూరి సూర్యనారాయణరావు, కొత్తపేటకు తమలంపూడి రామకృష్ణారెడ్డి, పాలూరి సత్యానందం, కుడుపూడి సూర్యనారాయణరావుల పేర్లతో జాబితా రూపొందించారు. వీరంతా శనివారం నామినేషన్లు వేసేందుకు  ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరానికి వాడుకోవడం, ఆనక వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని  మండిపడుతున్న తెలుగుతమ్ముళ్లకు ఇప్పుడు బీజేపీ నాయకులు తోడయ్యారు.
 
 పొత్తు కోసం టీడీపీయే
 వెంపర్లాడింది : చిట్టిబాబు
 సీమాంద్రలో తమతో పొత్తు కోసం టీడీపీయే వెంపర్లాడిందని బీజేపీ రాష్ట్ర కార్యనిర్వహక సభ్యుడు కర్రి చిట్టిబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశంలో మోడీ హవాను గమనించిన చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉంటుందని రెండు నెలలుగా ప్రచారం చేసుకున్నారన్నారు. తీరా పొత్తు కుదిరిన తరువాత కుట్రపూరితంగా ఆ పార్టీ నేతలను పోటీకి పెడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని మూడు ఎంపీ, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు శనివారం నామినేషన్లు వేస్తారన్నారు.
 పొత్తు పేరుతో
 
 బాబు దెబ్బ తీశారు : మోకా
 కార్యకర్తలు, నాయకులు టీడీపీతో పొత్తు వద్దని ముందే అన్నారని బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు చెప్పారు. పొత్తులో కేటాయించిన సీట్లలో కూడా టీడీపీ రెబెల్ అభ్యర్థులు బరిలో ఉన్నారని నిరసించారు. పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ సీమాంధ్రలో అధిక సీట్లు సాధిస్తుందన్నారు. పొత్తు పేరుతో చంద్రబాబు బీజేపీని ఇప్పటికే ఎంతో దెబ్బ తీశారన్నారు. జిల్లాలోని అన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో తమఅభ్యర్థులు పోటీ చేస్తారన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement