సాక్షిప్రతినిధి,కాకినాడ: తెలుగుదేశంపార్టీలో నేతల మధ్య అంతర్యుద్ధం తారా స్థాయిలో నడుస్తోంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఆ పార్టీ నేతలు సీట్ల కోసం కత్తులు దూసుకుంటున్నారు. ఆవిర్భావం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భిన్న ధ్రువాలుగా ఉన్న ఇద్దరు మెట్ట ప్రాంత నేతల మధ్య ఇటీవల పరిణామాలు భగ్గుమంటున్నాయి. జనసేనతో టీడీపీకి పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ పొత్తు ఉంటే జిల్లాలో టీడీపీ వదులుకోవాల్సిన సీట్లలో పిఠాపురం ముందు వరుసలో ఉంటుందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్ వర్మ ఆ సీటును వదులుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అదే రీతిలో పావులు కూడా కదుపుతున్నారు.
ఇప్పటికే అల్టిమేటం
ఉమ్మడి తూర్పుగోదావరిలోనే అత్యధిక కాపు సామాజికవర్గం ఉన్న నియోజకవర్గం పిఠాపురం. ఈ సీటు జనసేన ఒప్పందంతో సంబంధం లేకుండా అదే సామాజికవర్గానికి ఇవ్వాలనేది జిల్లా పార్టీలో సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల అనంతరం వర్మ పెత్తందారీ విధానాలతో విసుగెత్తిపోయిన ద్వితీయ శ్రేణి నేతలు ఇటీవల ఈ రాగాన్ని బలంగా వినిపిస్తున్నారు. టీడీపీకి అసలు ఖర్మ వర్మతోనే అంటూ ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
వర్మకే మరోసారి అధిష్టానం అవకాశం ఇస్తేగిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని వీరంతా అల్టిమేటం కూడా ఇచ్చారు. మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు, తెలుగు రైతు అద్యక్షుడు జ్యోతుల సతీష్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు మాదేపల్లి శ్రీను, దుడ్డు నాగు, కుంపట్ల సత్యనారాయణ తదితరులు ఇటీవల వర్మ తీరును ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ తూర్పారబట్టారు. తెలుగుదేశం ఏలుబడిలో వర్మ ఎమ్మెల్యేగా ఉండగా తమను విస్మరించి బంధువర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేతలు రగిలిపోతున్నారు.
ప్రత్తిపాడుపై ఫోకస్ ..
ప్రత్తిపాడు తమకు కేటాయించాలని బీసీలు స్వరం విపిస్తున్నారు. ఇందుకు అక్కడున్న బీసీ సామాజికవర్గాల సంఖ్యాబలాన్ని చూపిస్తున్నారు. అందుకే చాలా కాలంగా యనమల కృష్ణుడు కన్ను ప్రత్తిపాడుపై పడిందని చెబుతున్నారు. వరుస పరాజయాలు మూటగట్టుకున్న ఈయన్ను తుని తెరమీద నుంచి చంద్రబాబు తప్పించి రామకృష్ణుడు కుమార్తెకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అటు తుని, ఇటు ప్రత్తిపాడుల నుంచి కృష్ణుడిని చంద్రబాబు పరిగణనలోకి తీసుకోకపోవడంతో వర్మ పంథా మార్చుకుని ప్రత్తిపాడుపై దృష్టి పెట్టడం వర్గ విబేధాలకు మరింత ఆజ్యం పోసింది.
సత్యప్రభకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాక కూడా వర్మ అక్కడ తన సామాజికవర్గానికి చెందిన మురళీరాజును పనిగట్టుకుని పార్టీలో చేర్పించారంటున్నారు. ఈ చేరిక విషయం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కు మాట మాత్రమైనా చెప్పకపోవడంతో ఆ వర్గం వర్మపై అగ్గిమీద గుగ్గిలమవుతోంది. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు దక్కకుంటే ప్రత్తిపాడు తమ సామాజికవర్గానికి కేటాయించుకోవడం ద్వారా వర్మ ప్రయత్నాలకు చెక్ పెడతామని జ్యోతుల వర్గం బాహాటంగానే చెబుతోంది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి ఎటుదారి తీస్తుందోనని టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ల ఆగ్రహం
పిఠాపురం వ్యవహారాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని వర్మ వర్గీయుల ఆరోపిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని వర్మ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెహ్రూకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు, పార్టీ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు కాపు సామాజికవర్గానికి చెందిన బవిరిశెట్టి రాంబాబును కుంటిసాకులతో పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని వర్మపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ఈ సస్పెన్షన్‌ను నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరిద్దరి మధ్య విబేధాలు పొడసూపాయి. ఈ నేపథ్యంతోనే నెహ్రూతో రాజకీయ వైరం కలిగిన యనమల రామకృష్ణుడుతో వర్మ జట్టు కట్టారంటున్నారు. తన సీటు కాపాడుకోలేని వర్మ ప్రత్తిపాడు సీటు కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి మెట్ట ప్రాంత టీడీపీ భగ్గుమంటోంది. వరుపుల రాజా మరణం తరువాత ఆయన సతీమణి సత్యప్రభకు అధిష్టానం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment