Pithapuram constituency
-
రేపు పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు(శుక్రవారం) పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. అక్కడ ప్రజలు, రైతులను వైఎస్ జగన్ కలువనున్నారు.కాగా, వైఎస్ జగన్ రేపు పిఠాపురంలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో మాధవరం, నాగులపల్లి, రమణక్కపేలో వరద బాధితులను పరామర్శించనున్నారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పిఠాపురంలో పంటలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. పర్యటన షెడ్యూల్ ఇలా..వైఎస్ జగన్.. శుక్రవారం ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు. అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యూ.కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు. అనంతరం.. రమణక్కపేట వెళతారు. అక్కడ బాధితులని పరామర్శిస్తారు. రేపు (13.09.2024) కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు @ysjagan గారు పర్యటనఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమైన గ్రామాల్లో పర్యటనఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు, అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి…— YSR Congress Party (@YSRCParty) September 12, 2024 ఇది కూడా చదవండి: పవన్‌పై పిఠాపురం ప్రజల ఆగ్రహం -
పవన్‌ను ఓడించి, తరిమేయడం ఖాయం: ముద్రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించి, తన్ని తరిమేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖానికి రంగులు వేసుకొని వచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారా అని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన పవన్, చంద్రబాబు తీరును ఎండగట్టారు. పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఉప్మా, కాఫీలు పెడుతున్నారని విమర్శించడం పవన్‌కు తగదని, ఇంటికి వచ్చినవారికి మర్యాద చేయటం తమ కుటుంబానికి అలవాటని చెప్పారు. 2014 నుంచి బీజేపీతో కలిసే ఉన్న పవన్‌కళ్యాణ్ ప్రత్యేకహోదా ఎందుకు తీసుకురాలేదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా ఎందుకు ఆపలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?విషయాలపై అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీలేక పవన్ బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని ఘటన 2016లో జరిగిందన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఆ సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు పవన్ పక్కన ఉన్న జ్యోతుల నెహ్రూ వైఎస్సార్సీపీలోనే ఉన్నారని, ఆ ఘటనకు చంద్రబాబే కారణమనే విషయం తెలుసుకోవాలని సూచించారు. తాను చేతగానివాడిననుకున్నప్పుడు కాపుల కోసం పవన్ ఏంచేశారు, ఎందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడని ప్రశ్నించారు. అసలు పవన్ కల్యాణ్ అడ్రస్ ఏమిటి? ఎక్కడ పుట్టాడని అడిగారు. త్వరలో ప్యాకప్తెలంగాణ ఎన్నికల్లో పవన్ నిలబెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా అని ఎద్దేవా చేశారు. సినిమాల్లో నటించండి.. ఇలా రాజకీయాల్లో నటించడం కుదరదని స్పష్టం చేశారు. త్వరలో పవన్ పార్టీ ప్యాకప్ అవుతుందన్నారు. 1978లో చంద్రబాబు, తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లామన్నారు. 1978లో చంద్రబాబుకు శిథిలమైన పెంకుటింటికి మరమ్మతులు చేయించడానికి కూడా డబ్బులు లేని విషయం మర్చిపోయారా.. అని నిలదీశారు. 2019లో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశానని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారని, 2014లో ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు చేశానని చంద్రబాబు చెప్పగలరా అని ముద్రగడ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి, గణేశుల లచ్చబాబు, గోపు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పొత్తు గిత్తు జాన్తానై..! పిఠాపురం సీటు కాపులకే! లేదంటే తడాఖా చూపిస్తాం..
సాక్షిప్రతినిధి,కాకినాడ: తెలుగుదేశంపార్టీలో నేతల మధ్య అంతర్యుద్ధం తారా స్థాయిలో నడుస్తోంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఆ పార్టీ నేతలు సీట్ల కోసం కత్తులు దూసుకుంటున్నారు. ఆవిర్భావం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భిన్న ధ్రువాలుగా ఉన్న ఇద్దరు మెట్ట ప్రాంత నేతల మధ్య ఇటీవల పరిణామాలు భగ్గుమంటున్నాయి. జనసేనతో టీడీపీకి పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ పొత్తు ఉంటే జిల్లాలో టీడీపీ వదులుకోవాల్సిన సీట్లలో పిఠాపురం ముందు వరుసలో ఉంటుందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ వర్మ ఆ సీటును వదులుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అదే రీతిలో పావులు కూడా కదుపుతున్నారు. ఇప్పటికే అల్టిమేటం ఉమ్మడి తూర్పుగోదావరిలోనే అత్యధిక కాపు సామాజికవర్గం ఉన్న నియోజకవర్గం పిఠాపురం. ఈ సీటు జనసేన ఒప్పందంతో సంబంధం లేకుండా అదే సామాజికవర్గానికి ఇవ్వాలనేది జిల్లా పార్టీలో సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల అనంతరం వర్మ పెత్తందారీ విధానాలతో విసుగెత్తిపోయిన ద్వితీయ శ్రేణి నేతలు ఇటీవల ఈ రాగాన్ని బలంగా వినిపిస్తున్నారు. టీడీపీకి అసలు ఖర్మ వర్మతోనే అంటూ ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. వర్మకే మరోసారి అధిష్టానం అవకాశం ఇస్తేగిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని వీరంతా అల్టిమేటం కూడా ఇచ్చారు. మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు, తెలుగు రైతు అద్యక్షుడు జ్యోతుల సతీష్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు మాదేపల్లి శ్రీను, దుడ్డు నాగు, కుంపట్ల సత్యనారాయణ తదితరులు ఇటీవల వర్మ తీరును ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ తూర్పారబట్టారు. తెలుగుదేశం ఏలుబడిలో వర్మ ఎమ్మెల్యేగా ఉండగా తమను విస్మరించి బంధువర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ప్రత్తిపాడుపై ఫోకస్ .. ప్రత్తిపాడు తమకు కేటాయించాలని బీసీలు స్వరం విపిస్తున్నారు. ఇందుకు అక్కడున్న బీసీ సామాజికవర్గాల సంఖ్యాబలాన్ని చూపిస్తున్నారు. అందుకే చాలా కాలంగా యనమల కృష్ణుడు కన్ను ప్రత్తిపాడుపై పడిందని చెబుతున్నారు. వరుస పరాజయాలు మూటగట్టుకున్న ఈయన్ను తుని తెరమీద నుంచి చంద్రబాబు తప్పించి రామకృష్ణుడు కుమార్తెకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అటు తుని, ఇటు ప్రత్తిపాడుల నుంచి కృష్ణుడిని చంద్రబాబు పరిగణనలోకి తీసుకోకపోవడంతో వర్మ పంథా మార్చుకుని ప్రత్తిపాడుపై దృష్టి పెట్టడం వర్గ విబేధాలకు మరింత ఆజ్యం పోసింది. సత్యప్రభకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాక కూడా వర్మ అక్కడ తన సామాజికవర్గానికి చెందిన మురళీరాజును పనిగట్టుకుని పార్టీలో చేర్పించారంటున్నారు. ఈ చేరిక విషయం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కు మాట మాత్రమైనా చెప్పకపోవడంతో ఆ వర్గం వర్మపై అగ్గిమీద గుగ్గిలమవుతోంది. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు దక్కకుంటే ప్రత్తిపాడు తమ సామాజికవర్గానికి కేటాయించుకోవడం ద్వారా వర్మ ప్రయత్నాలకు చెక్ పెడతామని జ్యోతుల వర్గం బాహాటంగానే చెబుతోంది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి ఎటుదారి తీస్తుందోనని టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ల ఆగ్రహం పిఠాపురం వ్యవహారాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని వర్మ వర్గీయుల ఆరోపిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని వర్మ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెహ్రూకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు, పార్టీ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు కాపు సామాజికవర్గానికి చెందిన బవిరిశెట్టి రాంబాబును కుంటిసాకులతో పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని వర్మపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ సస్పెన్షన్‌ను నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరిద్దరి మధ్య విబేధాలు పొడసూపాయి. ఈ నేపథ్యంతోనే నెహ్రూతో రాజకీయ వైరం కలిగిన యనమల రామకృష్ణుడుతో వర్మ జట్టు కట్టారంటున్నారు. తన సీటు కాపాడుకోలేని వర్మ ప్రత్తిపాడు సీటు కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి మెట్ట ప్రాంత టీడీపీ భగ్గుమంటోంది. వరుపుల రాజా మరణం తరువాత ఆయన సతీమణి సత్యప్రభకు అధిష్టానం నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. -
గోతుల నుంచి లక్షలు దండుకున్న..ఘరానా గారడీ
పిఠాపురం, న్యూస్‌లైన్ : పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలంలో అవినీతి తారాస్థాయికి చేరింది. జరగని నిర్మాణం జరిగినట్టు రికార్డులు సృష్టించి రూ.7 లక్షలు డ్రా చేసి పంచేసుకున్నారు. మండలంలోని వాకతిప్పలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి పంచాయతీ తరఫున రూ.25 లక్షలతో తలపెట్టిన భారత్ నిర్మాణ్ రాజీవ్‌గాంధీ సేవాకేంద్రానికి (స్త్రీశక్తి భవనం) 2011లో రాష్ట్ర మంత్రి తోట నరసిం హం, స్థానిక ఎమ్మెల్యే వంగా గీత శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ పునాదుల కోసం గోతులు తవ్వారు. అయితే నిర్మాణం గోతులను మించి అంగుళం ముందుకు వెళ్లకుండానే నిలిచిపోయింది. అనంతరం అదే స్థలంలో హస్తకళా ప్రదర్శన నిర్మాణానికి అంటూ ఎమ్మెల్యేయే మరో శంకుస్థాపన చేశారు. ‘ఇందులో గారడీ ఏముంది?’ అనిపించవచ్చు. కానీ, గోతులకే పరిమితమైన స్రీశక్తి భవనం నిమిత్తం రూ.7 లక్షలు వెచ్చించినట్టు చూపి, ఆ మొత్తాన్ని డ్రా చేశారు అధికారులు. అనుమతి లేకుండానే శంకుస్థాపన వాస్తవానికి గ్రామ పరిధిలో ప్రభుత్వ నిధులతో ఎక్కడ ఏ నిర్మాణం చేపట్టినా ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులదైతే వారు, పంచాయతీది అయితే పాలకవర్గం తీర్మానంతో నిర్మించేశాఖకు రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ స్థలంలో నిర్మాణానికి అనుమతినిస్తూ పాలకవర్గం తీర్మానించాలి. అప్పుడు మాత్రమే నిధులు మంజూరు చేయాలి. కానీ వాకతిప్పలో స్త్రీశక్తి భవన నిర్మాణం తలపెట్టిన పంచాయతీ స్థలానికి సంబంధించి ఎలాంటి తీర్మానమూ లేదు. అయినా శంకుస్థాపన చేయించి, నిర్మాణం జరుగుతున్నట్టు చూపి, లక్షలు బొక్కేశారు. దాని నిమిత్తం మహిళా సంఘం నుంచి రూ.3.40 లక్షలు, గ్రామ పంచాయితీ నిధుల నుంచి రూ.3.60 లక్షలు డ్రా చేశారు. సాధారణంగా ఎక్కడైనా నిర్మాణం ప్రారంభించి, కొంత పని పూర్తయ్యాకే ఆ పనికి తగ్గ నిధులు విడుదల చేస్తారు. అయితే ఇక్కడ స్థలం స్వాధీనం కాకుండానే, ఏ పనీ చేయకుండానే అధికారులు నిధులు విడుదల చేయడం గమనార్హం. ఇది జరిగి రెండేళ్లు అయినా అడిగిన వారే లేరు. కాగా అదే స్థలంలో 2013లో రూ.50 లక్షలతో తలపెట్టిన హస్తకళా ప్రదర్శనశాల నిర్మాణానికి ఎమ్మెల్యే వంగా గీత మరో శంకుస్థాపన చేసేశారు. శిలాఫలకాన్నీ ఆవిష్కరించారు. అనంతరం మొదటి శిలాఫలకాన్ని తొలగించేశారు. అంటే ఆ నిర్మాణానికి నీళ్లు వదిలినట్టే. మరి, డ్రా చేసిన రూ.7 లక్షలు ఏమయ్యాయి అన్న ప్రశ్నకు జవాబు లేదు. అధికారులు, కొందరు ప్రజా ప్రతినిధులు పంచేసుకున్నారన్న ఆరోపణ ప్రబలంగా వినిపిస్తోంది. పనులు జరుగుతున్నాయని డబ్బులు డ్రా చేసిన జేఈ స్త్రీశక్తి భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయని పంచాయితీరాజ్ జేఈ లిఖితపూర్వకంగా కోరిన మీదటే రూ.3.60 లక్షలు విడుదల చేశామని కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి ఆర్ఎస్ కుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కాగా మెటీరియల్ కోసం నిధులు ఇవ్వక పోతే పనులు నిలిచిపోతాయని చెప్పడంతో రూ.3.40 లక్షలు విడుదల చేశామని మండల మహిళా సమాఖ్య కో ఆర్డినేటర్ తవుడు చెప్పారు. గోతులతో నిలిచిపోయిన ఆ నిర్మాణం నిమిత్తం డ్రా చేసిన రూ.7 లక్షలకూ ఎవరూ సమాధానం చెప్పడం లేదని వీరు అంటున్నారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీఓ జె.అరుణను వివరణ కోరగా పంచాయితీ రాజ్ పూర్వపు జేఈ సత్యనారాయణ నిధులు డ్రా చేసిన విషయం వాస్తవమేనన్నారు ఆ నిధులతో మెటీరియల్ తెప్పించామని చెప్పారని, కానీ ఆ మెటీరియల్ ఎక్కడుందో, ఆ నిధులు ఏమయ్యాయో తనకు తెలియదన్నారు. ప్రస్తుతం అదే స్థలంలో వేరే భవన నిర్మాణం తలపెట్టినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా.. మొదట స్త్రీశక్తి భవనం నిర్మాణం కోసం అంటూ తవ్విన ఆ గోతులనే ఇప్పుడు హస్తకళా ప్రదర్శన శాల నిర్మాణం కోసం తవ్వినట్టు చూపుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఒకసారి గారడీ చేసి, లక్షలు దండుకున్న ఆ గోతుల నుంచే మరోసారి అవినీతి పంట పండించుకోవడానికి రంగం సిద్ధమవుతోందన్న మాట!