ఆయన్ని ఓడించకపోతే పేరు మార్చుకుంటా
తుని ఘటనకు చంద్రబాబే కారణం
పవన్, చంద్రబాబుపై ముద్రగడ ఫైర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించి, తన్ని తరిమేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖానికి రంగులు వేసుకొని వచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారా అని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన పవన్, చంద్రబాబు తీరును ఎండగట్టారు.
పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఉప్మా, కాఫీలు పెడుతున్నారని విమర్శించడం పవన్‌కు తగదని, ఇంటికి వచ్చినవారికి మర్యాద చేయటం తమ కుటుంబానికి అలవాటని చెప్పారు. 2014 నుంచి బీజేపీతో కలిసే ఉన్న పవన్‌కళ్యాణ్ ప్రత్యేకహోదా ఎందుకు తీసుకురాలేదని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా ఎందుకు ఆపలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?
విషయాలపై అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీలేక పవన్ బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తుని ఘటన 2016లో జరిగిందన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఆ సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు పవన్ పక్కన ఉన్న జ్యోతుల నెహ్రూ వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారని, ఆ ఘటనకు చంద్రబాబే కారణమనే విషయం తెలుసుకోవాలని సూచించారు.
తాను చేతగానివాడిననుకున్నప్పుడు కాపుల కోసం పవన్ ఏంచేశారు, ఎందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడని ప్రశ్నించారు. అసలు పవన్ కల్యాణ్ అడ్రస్ ఏమిటి? ఎక్కడ పుట్టాడని అడిగారు.
త్వరలో ప్యాకప్
తెలంగాణ ఎన్నికల్లో పవన్ నిలబెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా అని ఎద్దేవా చేశారు. సినిమాల్లో నటించండి.. ఇలా రాజకీయాల్లో నటించడం కుదరదని స్పష్టం చేశారు. త్వరలో పవన్ పార్టీ ప్యాకప్ అవుతుందన్నారు. 1978లో చంద్రబాబు, తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లామన్నారు. 1978లో చంద్రబాబుకు శిథిలమైన పెంకుటింటికి మరమ్మతులు చేయించడానికి కూడా డబ్బులు లేని విషయం మర్చిపోయారా.. అని నిలదీశారు.
2019లో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారని, 2014లో ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు చేశానని చంద్రబాబు చెప్పగలరా అని ముద్రగడ ప్రశ్నించారు. ఈ సమావేశంలో ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి, గణేశుల లచ్చబాబు, గోపు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment