గోతుల నుంచి లక్షలు దండుకున్న..ఘరానా గారడీ
Published Sun, Jan 26 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
పిఠాపురం, న్యూస్‌లైన్ : పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలంలో అవినీతి తారాస్థాయికి చేరింది. జరగని నిర్మాణం జరిగినట్టు రికార్డులు సృష్టించి రూ.7 లక్షలు డ్రా చేసి పంచేసుకున్నారు. మండలంలోని వాకతిప్పలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి పంచాయతీ తరఫున రూ.25 లక్షలతో తలపెట్టిన భారత్ నిర్మాణ్ రాజీవ్‌గాంధీ సేవాకేంద్రానికి (స్త్రీశక్తి భవనం) 2011లో రాష్ట్ర మంత్రి తోట నరసిం హం, స్థానిక ఎమ్మెల్యే వంగా గీత శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ పునాదుల కోసం గోతులు తవ్వారు. అయితే నిర్మాణం గోతులను మించి అంగుళం ముందుకు వెళ్లకుండానే నిలిచిపోయింది. అనంతరం అదే స్థలంలో హస్తకళా ప్రదర్శన నిర్మాణానికి అంటూ ఎమ్మెల్యేయే మరో శంకుస్థాపన చేశారు. ‘ఇందులో గారడీ ఏముంది?’ అనిపించవచ్చు. కానీ, గోతులకే పరిమితమైన స్రీశక్తి భవనం నిమిత్తం రూ.7 లక్షలు వెచ్చించినట్టు చూపి, ఆ మొత్తాన్ని డ్రా చేశారు అధికారులు.
అనుమతి లేకుండానే శంకుస్థాపన
వాస్తవానికి గ్రామ పరిధిలో ప్రభుత్వ నిధులతో ఎక్కడ ఏ నిర్మాణం చేపట్టినా ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులదైతే వారు, పంచాయతీది అయితే పాలకవర్గం తీర్మానంతో నిర్మించేశాఖకు రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ స్థలంలో నిర్మాణానికి అనుమతినిస్తూ పాలకవర్గం తీర్మానించాలి. అప్పుడు మాత్రమే నిధులు మంజూరు చేయాలి. కానీ వాకతిప్పలో స్త్రీశక్తి భవన నిర్మాణం తలపెట్టిన పంచాయతీ స్థలానికి సంబంధించి ఎలాంటి తీర్మానమూ లేదు. అయినా శంకుస్థాపన చేయించి, నిర్మాణం జరుగుతున్నట్టు చూపి, లక్షలు బొక్కేశారు. దాని నిమిత్తం మహిళా సంఘం నుంచి రూ.3.40 లక్షలు, గ్రామ పంచాయితీ నిధుల నుంచి రూ.3.60 లక్షలు డ్రా చేశారు. సాధారణంగా ఎక్కడైనా నిర్మాణం ప్రారంభించి, కొంత పని పూర్తయ్యాకే ఆ పనికి తగ్గ నిధులు విడుదల చేస్తారు. అయితే ఇక్కడ స్థలం స్వాధీనం కాకుండానే, ఏ పనీ చేయకుండానే అధికారులు నిధులు విడుదల చేయడం గమనార్హం. ఇది జరిగి రెండేళ్లు అయినా అడిగిన వారే లేరు. కాగా అదే స్థలంలో 2013లో రూ.50 లక్షలతో తలపెట్టిన హస్తకళా ప్రదర్శనశాల నిర్మాణానికి ఎమ్మెల్యే వంగా గీత మరో శంకుస్థాపన చేసేశారు. శిలాఫలకాన్నీ ఆవిష్కరించారు. అనంతరం మొదటి శిలాఫలకాన్ని తొలగించేశారు. అంటే ఆ నిర్మాణానికి నీళ్లు వదిలినట్టే. మరి, డ్రా చేసిన రూ.7 లక్షలు ఏమయ్యాయి అన్న ప్రశ్నకు జవాబు లేదు. అధికారులు, కొందరు ప్రజా ప్రతినిధులు పంచేసుకున్నారన్న ఆరోపణ ప్రబలంగా వినిపిస్తోంది.
పనులు జరుగుతున్నాయని డబ్బులు డ్రా చేసిన జేఈ
స్త్రీశక్తి భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయని పంచాయితీరాజ్ జేఈ లిఖితపూర్వకంగా కోరిన మీదటే రూ.3.60 లక్షలు విడుదల చేశామని కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి ఆర్‌ఎస్ కుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కాగా మెటీరియల్ కోసం నిధులు ఇవ్వక పోతే పనులు నిలిచిపోతాయని చెప్పడంతో రూ.3.40 లక్షలు విడుదల చేశామని మండల మహిళా సమాఖ్య కో ఆర్డినేటర్ తవుడు చెప్పారు.
గోతులతో నిలిచిపోయిన ఆ నిర్మాణం నిమిత్తం డ్రా చేసిన రూ.7 లక్షలకూ ఎవరూ సమాధానం చెప్పడం లేదని వీరు అంటున్నారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీఓ జె.అరుణను వివరణ కోరగా పంచాయితీ రాజ్ పూర్వపు జేఈ సత్యనారాయణ నిధులు డ్రా చేసిన విషయం వాస్తవమేనన్నారు ఆ నిధులతో మెటీరియల్ తెప్పించామని చెప్పారని, కానీ ఆ మెటీరియల్ ఎక్కడుందో, ఆ నిధులు ఏమయ్యాయో తనకు తెలియదన్నారు. ప్రస్తుతం అదే స్థలంలో వేరే భవన నిర్మాణం తలపెట్టినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా.. మొదట స్త్రీశక్తి భవనం నిర్మాణం కోసం అంటూ తవ్విన ఆ గోతులనే ఇప్పుడు హస్తకళా ప్రదర్శన శాల నిర్మాణం కోసం తవ్వినట్టు చూపుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఒకసారి గారడీ చేసి, లక్షలు దండుకున్న ఆ గోతుల నుంచే మరోసారి అవినీతి పంట పండించుకోవడానికి రంగం సిద్ధమవుతోందన్న మాట!
Advertisement
Advertisement