
●చౌడేశ్వరీ.. నమోస్తుతే..
అమడగూరు: చల్లని తల్లి చౌడేశ్వరమ్మ జ్యోతుల వెలుగుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ దేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ధర్మకర్త, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జ్యోతి ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, అమ్మవారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
జ్యోతిదర్శనంతో
పులకించిన భక్తజనం
ఉత్సవంలో భాగంగా తొలుత అమ్మవారి విగ్రహాన్ని పూలపల్లకీపై కొలువుదీర్చి ఆలయం నుంచి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వరకూ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి పల్లకీ ముందు జ్యోతిని రగిలించారు. జ్యోతి ముందు వెళ్తుండగా... ఆ వెలుగుల్లో చౌడేశ్వరీదేవి భక్తులను దర్శనమిచ్చారు. ఈ క్రమంలో జ్యోతిని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. డప్పు, మంగళవాయిద్యాలు, బాణసంచా పేలుళ్ల మధ్య యువకులు చిందులేస్తూ ఆడి, పాడారు. భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన కోలాటలు, భజనలు, హరికథలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చీకిరేవులపల్లి యూత్ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.