
విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: కూటమి ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు సోమవారం కదంతొక్కారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు రోడ్లపై ఎక్కడికక్కడ నిర్బంధించే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు వాటిని దాటుకొని ముందుకు కదిలారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పినప్పటికీ.. విద్యార్థులు, నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు అక్కడ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వినతిపత్రం ఇచ్చేందుకు సైతం విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఓ విద్యార్థి చేతిని గేటు మధ్యలో పెట్టి లోపల ఉన్న పోలీసులు నొక్కడంతో.. ఆ విద్యార్థి బాధతో విలవిలలాడాడు. చివరకు తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు ఐదుగురు నాయకులను లోపలకు అనుమతించారు.
వారు సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నాలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.రవిచంద్ర, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్ రెడ్డి, కె.శివారెడ్డి, గోలి నరసింహ, గోపి కృష్ణ, వినోద్, కోమల్ సాయి, ఐ.శ్రీనివాస్, కొండల్ రావు, సందీప్, గోపీచంద్, నారాయణ, పూజిత్ తదితరులు పాల్గొన్నారు.