సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ధర్నాలో మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా విద్యార్థులకు బాసటగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళనన కార్యక్రమాన్ని జనవరి 29కి ఆ పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, 3వ తేదీన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా 29న నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది.
పోరుబాట విజయవంతం:
ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు రూ.1.20 నుంచి రూ.1.25 పైసలు చొప్పున దాదాపు రూ.15,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారులతో కలిసి వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయమన్న హామీ నిలబెట్టుకోవాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment