సీఐ ఇబ్రహీం తీరుపై సర్వత్రా ఆగ్రహం
ఖాకీ డ్రస్సు విప్పేసి ‘పచ్చ’ చొక్కా వేసుకోవాలని హితవు
వీధి రౌడీని మరిపిస్తూ మందు బాబులా చిందులేయడం ఏంటని నిలదీత
ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పెద్దరికాన్ని మరచి సీఐ దుర్భాషలు
‘నువ్వేం చూస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..ని పోండి’ అంటూ దూషణ
సుదీర్ఘ రాజకీయాల్లో మచ్చలేని నేతగా చెన్నకేశవరెడ్డికి మంచి పేరు
ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ భారీ ధర్నా, సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘నువ్వేం చూస్తావు రా.. నన్ను నువ్వేం చేస్తావు.. మళ్లీ చెబుతా విను.. ఇక్కడి నుంచి దెం..ని పోండి’ అంటూ చూపుడు వేలితో హెచ్చరిస్తూ, భీకరమైన గొంతుతో.. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని సీఐ ఇబ్రహీం దుర్భాషలాడుతూ బెదిరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఎవరిని చూసుకుని ఆ సీఐ ఇలా రెచ్చిపోయారంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఖాకీ డ్రస్సు విప్పేసి ‘పచ్చ’ చొక్కా, ప్యాంటు ధరించాలని ప్రజలు సూచిస్తున్నారు. వీధి రౌడీని మరిపిస్తూ మందు బాబులా చిందులేసిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మిగనూరు సోమప్పసర్కిల్‌లో ఆ పార్టీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. సీఐ ఇబ్రహీంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చెన్నకేశవరెడ్డికి క్షమాపణలు చెప్పాలని ఆయన కుమారుడు ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సీఐపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేస్తామని చెప్పారు. సీఐ ఇబ్రహీంను సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. అతడిని విధుల నుంచి తప్పించాలన్నారు. ఇబ్రహీంపై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
వీడియో వైరల్
ఎమ్మిగనూరు నియోజకవర్గం పార్లపల్లిలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సీఐ ఇబ్రహీం.. చెన్నకేవశరెడ్డిని బెదిరించిన తీరు, సీఐ బాడీ లాంగ్వేజ్, దబాయిస్తూ మాట్లాడిన మాటలు, అయినప్పటికీ సహనం కోల్పోకుండా చెన్నకేవశరెడ్డి మాట్లాడిన తీరు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. చెన్నకేశవరెడ్డి వయస్సు 82 ఏళ్లు.
తన రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అత్యంత గౌరవంగా గడిపారు. ఏ పార్టీ, ఏ వ్యక్తి అతన్ని అగౌరవ పరిచిన సందర్భం లేదు. అధికారులు, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలను కూడా ఎంతో గౌరవంగా సంభోదిస్తూ ‘అజాత శత్రువుగా, పెద్దాయన’గా గుర్తింపు పొందారు.
అలాంటి వ్యక్తిని అరేయ్.. ఒరేయ్.. అంటూ సీఐ బెదిరించడాన్ని జిల్లా వ్యాప్తంగా అంతా తప్పుపడుతున్నారు. చెన్నకేశవరెడ్డి సహనంతో మాట్లాడుతున్నా, అకారణంగా సీఐ రెచ్చిపోయి బెదిరించడం సరికాదని పోలీసులు సైతం విస్తుపోతున్నారు.
ఘటన జరిగిన తీరిది
పార్లపల్లె 38వ నీటి వినియోగదారుల సంఘానికి శనివారం ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వారికి మద్దతుగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి బంధువులు విరూపాక్షిరెడ్డి, బాలిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి స్కూలు లోపలికి వెళ్లారు. వీరికి ఓటు హక్కు కూడా లేదు. వీరు వెళ్లిన తర్వాత గేటుకు తాళం వేశారు. చెన్నకేశవరెడ్డి తన కుటుంబ సభ్యులను పోటీ చేయించేందుకు 8 గంటలకు అక్కడికి వెళ్లారు. 9 – 9.45 గంటల వరకూ నామినేషన్లు. అయితే టీడీపీ మినహా మిగిలిన వారెవ్వరినీ సీఐ ఇబ్రహీం లోపలికి వెళ్లనివ్వలేదు.
‘లోపల టీడీపీ వాళ్లు ఉన్నారు. మమ్మల్ని నామినేషన్ వేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు..’ అని మాజీ ఎమ్మెల్యే అడిగారు. దీనికి సీఐ ఇబ్రహీం వేలితో హెచ్చరిస్తూ, తన చేతిని ప్రైవేటు పార్ట్స్ వైపు చూపిస్తూ.. తీవ్రంగా బెదిరించారు. ‘దెం..ని పోండి’ అని బూతులు మాట్లాడారు. అయినప్పటికీ చెన్నకేశవరెడ్డి ఓర్పుగానే తన వాళ్లను లోపలికి పంపాలని అడిగారు. ఆపై ఇతర పోలీసులు వచ్చి చెన్నకేశవరెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్‌కు దూరంగా ఉన్నా కూడా అక్కడ ఉండకుండా పంపించేశారు.
చెన్నకేశవరెడ్డి వర్గీయులను నామినేషన్ కూడా వేయించలేదు. గేటు వేసిన తర్వాత టీడీపీ వ్యక్తులను నిచ్చెనపై నుంచి లోపలికి పంపి ఎన్నికలు ముగించేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వయస్సును కూడా గౌరవించకుండా సీఐ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment