
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ, జనసేన ఫ్లెక్సీల రగడ తారస్థాయికి చేరింది. జనసైనికుల ఫ్లెక్సీలను పురపాలక సంఘ టౌన్‌ప్లానింగ్ అధికారి తొలగించడంతో జనసేన ఇన్‌చార్జ్ కోట వినుత భర్త చంద్రబాబు ఆధ్వర్యంలో స్థానిక బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద నిరసనకు దిగారు. తమ ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తీశారని కమిషనర్‌ను నిలదీశారు. టీడీపీ ఫ్లెక్సీలను ఎందుకు తీయలేదని మండిపడ్డారు.
గంటకుపైగా నిరసన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి ఫ్లెక్సీని అధికారులు తొలగించారు. అనంతరం వినుత కటౌట్‌ను శరవణ సూపర్ మార్కెట్ వద్ద ఉండగా దానిని తొలగించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పురపాలక సంఘ అధికారులు తొలగించకుంటే తామే తొలగిస్తామని అధికారులతో రచ్చకు దిగారు.
మీడియా ప్రతినిధులపై దాడి
శరవణ సూపర్‌మార్కెట్ సమీపంలో టీడీపీ నాయకులు జనసేన నాయకుల ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేస్తుండగా.. అక్కడ కవరేజీకి వచి్చన సాక్షి విలేకరి, మరో రిపోర్టర్‌పై టీడీపీ నాయకులు దాడికి దిగారు. అక్కడి నుంచి తప్పించుకుని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్న విలేకరులపై స్టేషన్ బయట దాదాపు 30 మంది దాడికి తెగబడ్డారు. చివరకు రిపోర్టర్లు పోలీస్ స్టేషన్‌లోకి పరుగెత్తి ఫిర్యాదు స్వీకరించాలని కోరారు. అయితే రిపోర్టర్లపైనే కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరించారు. ఈ విషయంపై కొందరు డీఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ అర్ధరాత్రి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రిపోర్టర్లపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
