రెండడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తం కూల్చివేత
శ్రీకాళహస్తిలో గంగమ్మ గుడి నేలమట్టం
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కుందేటివారి వీ«ధి ఎస్టీ కాలనీలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ గుడిని శనివారం రాత్రి తెలుగుదేశం నేత వెంకటేష్ శెట్టి కూల్చేశారు. ఆలయం రెండడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తాన్ని జేసీబీతో కూల్చేయడమేగాక అడ్డుకున్న కాలనీవాసుల్ని బెదిరించారు. కాలనీలో నివసిస్తున్న యానాదులు పాత గంగమ్మ గుడిని తొలగించి నాలుగు నెలల కిందట ఆరడుగుల స్థలంలో కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు.
ఈ కాలనీకి ఆనుకుని వ్యాపారి అయిన టీడీపీ నేత వెంకటేష్ శెట్టికి స్థలం ఉంది. ఆ స్థలంలో గుడి కడితే తన స్థలాన్ని ఎవరూ కొనరని, అందువల్ల గుడి కట్టవద్దని అతడు ఆ కాలనీవాసులతో గొడవ పడేవారు. శనివారం మండల సర్వేయర్ హరి సర్వే చేసి, కడుతున్న ఆలయం వ్యాపారి స్థలంలో రెండడుగుల మేర ఉందని మార్క్ వేశారు. ఆ రెండడుగుల స్థలానికి డబ్బు ఇస్తామని, లేదంటే సమయం ఇస్తే ఆ మేర ఆలయం తొలగిస్తామని కాలనీవాసులు వెంకటేష్ శెట్టికి, మండల సర్వేయర్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వెంకటేష్‌శెట్టి జేసీబీతో నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని కూల్చేశారు.
అడ్డుకున్న కాలనీవాసులతో మీ నివాసాలు కూడా కూల్చేస్తానంటూ బెదిరించారు. దాతల సాయంతో గుడి నిర్మించుకుంటున్నామని, ఇప్పటికే రూ.2.5 లక్షలు ఖర్చయిందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని కూల్చేసిన వెంకటేష్ శెట్టి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సర్వేయర్ హరిని అడగగా.. వెంకటేష్ స్థలంలో రెండడుగుల మేర ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ విషయమై చర్చించుకుని సామరస్యంగా సర్దుకునే వెసులుబాటు ఉన్నా గుడి మొత్తాన్ని కూల్చేయడం సమంజసం కాదని చెప్పారు.
ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు
కుందేటివారి వీధి ఎస్టీకాలనీ వాసులు రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు. ఇక్కడ అందరూ రోజువారీ కూలీలే. పైసాపైసా కూడబెట్టి గ్రామదేవత గంగమ్మ ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. ఆపై దాతల సాయంతో కొంత మొత్తాన్ని సేకరించారు. తర్వాత వారే కూలీలుగా ఆలయాన్ని నిరి్మస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యాపారి వెంకటేష్ శెట్టి తన స్థలానికి బేరం కుదరడంలేదన్న సాకుతో ఆలయం మొత్తాన్ని కూల్చేసేందుకు స్కెచ్ వేశారు.
సర్వేలో ఆలయం తన స్థలంలోకి రెండడుగుల మేర వచ్చిందన్న సాకుతో మరింత రెచ్చిపోయారు. ఆలయం మొత్తాన్ని రాత్రికిరాత్రే జేసీబీతో కూల్చేశారు. శిథిలాలను ట్రాక్టర్ల ద్వారా రాత్రికిరాత్రే తరలించారు. అడొచ్చినవారిపై చిందులేస్తూ.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో గిరిజనులు చేసేదిలేక ఆలయాన్ని కూల్చేస్తున్నా ఆవేదనగా చూస్తూ ఉండిపోయారు. వెంకటేష్ శెట్టికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండడం వల్లే ఎస్టీలమైన తమపై ప్రతాపం చూపుతున్నాడని వారు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment