అసంతృప్తి ‘కన్నా’లెన్నో! | Clash Between TDP and Janasena Leaders in Sattenapally: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అసంతృప్తి ‘కన్నా’లెన్నో!

Published Tue, Jan 9 2024 4:38 AM | Last Updated on Fri, Feb 2 2024 12:00 PM

Clash Between TDP and Janasena Leaders in Sattenapally: Andhra pradesh - Sakshi

సాక్షి, నరసరావుపేట: ఎన్నో ఆశలతో రాజ­కీయ బద్ధశత్రువు, టీడీపీ అధినేత చంద్రబాబు చెంత చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా మారి­ంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజ­కీ­యాల్లో సీనియర్‌ నేత. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ చేశారు. వంగవీటి రంగా తర్వాత కాపు సామాజికవర్గంలో తానే కీలక నేతనని ఆయన భావిస్తుంటారు. అలాంటి కన్నా... వంగవీటి రంగా హత్య­కు కారణమైన టీడీపీలో చేరడంతో రాజకీయంగా ఆత్మహత్యకు పాల్ప­డ్డా­రని రాజకీయ విశ్లేషకులు అభి­ప్రాయ­­పడుతు­న్నారు. చంద్రబాబు పంచన చేరిన తర్వాత కన్నాకు పార్థిలో అనుకున్న­ంత ప్రాధాన్యం లభించడం లేదు.

తనకు గుంటూరు వెస్ట్‌ అసెంబ్లీ స్థానం కేటాయించాలని ఆయన కోరినా బాబు వినకుండా సత్తెనపల్లికి పంపారు. అక్కడ అప్పటికే పార్టీ క్యాడర్‌ మూడు గ్రూపులుగా విడిపోయి ఉంది.  కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు, అబ్బూరి మల్లి వర్గాలు పరస్పరం కత్తులు నూరుతున్నాయి. ఇందులో అబ్బూ­­రి మల్లి కొంత కన్నాకు సహ­క­­రిస్తున్నా, వైవీ ఆంజనేయులు పార్టీ కార్య­క్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

మరోవైపు కోడెల శివరాం పల్లె నిద్ర పేరిట ఇంటింటికీ తిరుగుతున్నారు. శివరాంను నిలువరించే యత్నం టీడీపీ అధిష్టానం చేయడం లేదని కన్నా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకే టీడీపీ టికెట్‌ ఇస్తుందని, ఒకవేళ ఇవ్వని పక్షంలో కోడెల శివప్రసాదరావు ఆశ­య సాధన కోసం స్వతంత్ర అభ్యర్థి గా అయినా పోటీ చేస్తానని శివరాం నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతుండటం గమనార్హం.

కన్నాకు వ్యతిరేకంగా కాపులను ఏకం చేస్తున్న ‘బొర్రా’
కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, జనసేనకే ఇక్కడ పొత్తులో సీటు ఖరారవుతుందని చెబుతున్నారు. ఆ పార్టీ ఇన్‌చార్జి  బొర్రా వెంకట అప్పారావుకు గానీ, మరో నేత బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌కు గానీ అవకాశం రావచ్చనే చర్చ జరుగుతోంది.

కన్నా లక్ష్మీనారాయణ జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌­తో మాత్రమే సన్నిహితంగా ఉంటున్నారు. బొర్రా అప్పారావును దూరం పెడుతున్నారు. దీంతో ఆర్థిక, అంగబలం ఉన్న బొర్రా అప్పారావు నియోజకవర్గంలోని కాపు నేతలను ఏకం చేసి జనసేన వైపు ఉండేలా చూస్తున్నారు. జనసేనకు టికెట్‌ ఇస్తేనే ఈ నియోజకవర్గంలో కాపులకు ప్రాధాన్యం ఉంటుందని, టీడీపీ తరఫున కన్నా గెలిచినా పెత్తనం ఓ సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుందని ప్రచారం చేస్తున్నారు.

జనసేనతోపాటు టీడీపీలోని గ్రూపులు కన్నాకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో తనకు గుంటూరు వెస్ట్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కన్నా లక్ష్మీనారాయణ కోరుతున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలూ లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

పైగా కాపు సామాజికవర్గంలో బలమైన నేతనైనా తనకన్నా పవన్‌ కళ్యాణ్‌కే పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యం ఇస్తుండడం ఆయనకు రుచించడం లేదని సమాచారం. టీడీపీలో చేరి తప్పు చేశారనే భావన కన్నా వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా సత్తెనపల్లి సీటును జనసేనకు కేటాయించేందుకే సుముఖంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement