sattenapally
-
మాక్ డ్రిల్.. పవర్ఫుల్
సత్తెనపల్లి : ఒక్కసారిగా జరిగిన ఈ అలజడికి పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పట్టణ సీఐ పోలూరి శ్రీనివాసరావు ఘటనా స్ధలికి చేరుకొని నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు సరి కదా.. ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. చేతికందినవన్నీ పోలీసులపై విసరడం మొదలు పెట్టారు. అంతే ఉన్నతాధికారులకు సీఐ శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో డీఎస్పీ గుర్నాథ్బాబు ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ దళాలు, సివిల్, ప్రత్యేక సాయుధ దళాలు వ్యాన్లతో అక్కడికి చేరాయి.ముందుగా ఆందోళనకారులకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి బాష్ప వాయువును ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గక పోవడం.. పరిస్థితులు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరోవైపు ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైర్ చేసి హెచ్చరించారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ నిరసనకారుడికి బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలగా.. మరొకరు తలకు గాయాలై తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్ట్రెక్చర్‌పై వాహనంలో తరలించారు. అంబులెన్సుల హడావుడి.. పోలీస్ సైరన్ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు. కళ్లకు కట్టిన ప్రదర్శన ఈ దృశ్యాలను చూస్తూ భీతావహులైన ప్రజలకు మైక్‌లో ఒక ఎనౌన్స్మెంట్ వినిపించింది. ‘ఇది మాక్ డ్రిల్.. కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించడంలో భాగంగా పోలీసులు చేసిన సన్నాహక కార్యక్రమం’ అని పోలీసులు ప్రకటించడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు ‘నటించిన’ పోలీసులు అక్కడి నుంచి ని్రష్కమించారు. పట్టణంలో పోలీసులు చేపట్టిన నమూనా ప్రదర్శన ఇది. పేరుకే మాక్ డ్రిల్ అయినప్పటికీ వాస్తవాలను కళ్లకు కట్టింది.స్థలం : సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్ సమయం: ఆదివారం సాయంత్రం 5.11 గంటలు 50 మందికి పైగా ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది.. ఓ చేతిలో ప్లకార్డులు .. మరో చేతిలో రాళ్లు ... పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు. తాలూకా సెంటర్లో నడిరోడ్డుపై మంట పెట్టిన టైర్లు.. ఎటుచూసినా భయానక వాతావరణం..అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్రరాజు అన్నారు. మాక్ డ్రిల్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తెలిపారు. ఇప్పటికే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో లూజ్ విక్రయాలకు, పేలుడు పదార్థాలు, బాణసంచా విక్రయాలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మరో మూడు రోజులు 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రదర్శనలు, అల్లర్లు, గుమికూడటం చేయరాదని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నరసరావుపేటలో ఒకరిపై చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్రైం అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథ్ బాబు, ఏఆర్ డీఎస్పీ గాంధీ, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రాంబాబు, సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.రాజేష్ కుమార్, ఎస్ఐలు ఎం. సంధ్యారాణి, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. -
అసంతృప్తి ‘కన్నా’లెన్నో!
సాక్షి, నరసరావుపేట: ఎన్నో ఆశలతో రాజకీయ బద్ధశత్రువు, టీడీపీ అధినేత చంద్రబాబు చెంత చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ చేశారు. వంగవీటి రంగా తర్వాత కాపు సామాజికవర్గంలో తానే కీలక నేతనని ఆయన భావిస్తుంటారు. అలాంటి కన్నా... వంగవీటి రంగా హత్యకు కారణమైన టీడీపీలో చేరడంతో రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పంచన చేరిన తర్వాత కన్నాకు పార్థిలో అనుకున్నంత ప్రాధాన్యం లభించడం లేదు. తనకు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం కేటాయించాలని ఆయన కోరినా బాబు వినకుండా సత్తెనపల్లికి పంపారు. అక్కడ అప్పటికే పార్టీ క్యాడర్ మూడు గ్రూపులుగా విడిపోయి ఉంది. కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు, అబ్బూరి మల్లి వర్గాలు పరస్పరం కత్తులు నూరుతున్నాయి. ఇందులో అబ్బూరి మల్లి కొంత కన్నాకు సహకరిస్తున్నా, వైవీ ఆంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కోడెల శివరాం పల్లె నిద్ర పేరిట ఇంటింటికీ తిరుగుతున్నారు. శివరాంను నిలువరించే యత్నం టీడీపీ అధిష్టానం చేయడం లేదని కన్నా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకే టీడీపీ టికెట్ ఇస్తుందని, ఒకవేళ ఇవ్వని పక్షంలో కోడెల శివప్రసాదరావు ఆశయ సాధన కోసం స్వతంత్ర అభ్యర్థి గా అయినా పోటీ చేస్తానని శివరాం నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతుండటం గమనార్హం. కన్నాకు వ్యతిరేకంగా కాపులను ఏకం చేస్తున్న ‘బొర్రా’ కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, జనసేనకే ఇక్కడ పొత్తులో సీటు ఖరారవుతుందని చెబుతున్నారు. ఆ పార్టీ ఇన్చార్జి బొర్రా వెంకట అప్పారావుకు గానీ, మరో నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌కు గానీ అవకాశం రావచ్చనే చర్చ జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌తో మాత్రమే సన్నిహితంగా ఉంటున్నారు. బొర్రా అప్పారావును దూరం పెడుతున్నారు. దీంతో ఆర్థిక, అంగబలం ఉన్న బొర్రా అప్పారావు నియోజకవర్గంలోని కాపు నేతలను ఏకం చేసి జనసేన వైపు ఉండేలా చూస్తున్నారు. జనసేనకు టికెట్ ఇస్తేనే ఈ నియోజకవర్గంలో కాపులకు ప్రాధాన్యం ఉంటుందని, టీడీపీ తరఫున కన్నా గెలిచినా పెత్తనం ఓ సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. జనసేనతోపాటు టీడీపీలోని గ్రూపులు కన్నాకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో తనకు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కన్నా లక్ష్మీనారాయణ కోరుతున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలూ లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పైగా కాపు సామాజికవర్గంలో బలమైన నేతనైనా తనకన్నా పవన్ కళ్యాణ్‌కే పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యం ఇస్తుండడం ఆయనకు రుచించడం లేదని సమాచారం. టీడీపీలో చేరి తప్పు చేశారనే భావన కన్నా వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా సత్తెనపల్లి సీటును జనసేనకు కేటాయించేందుకే సుముఖంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జిగా కన్నా ఇష్టపడే వస్తున్నారా?
సత్తెనపల్లి: సత్తెనపల్లి టీడీపీలో ముసలం మరింత ముదరనుందా? ఇప్పటి వరకు సీటు తమదంటే తమదంటూ పావులు కదిపిన నేతలు.. ఇకపై తమ అసమ్మతి గళం వినిపించనున్నారా ? ఇప్పటికే ప్రజల్లో మెండైన సానుకూలతతో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణ ఇష్టపడే వస్తున్నారా? తప్పనిసరి పరిస్థితుల్లోనా! అనేది స్పష్టత కొరవడింది. పెదకూరపాడు కాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కానీ కన్నా ఆశించారనేది సన్నిహితుల మాట. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్ సీపీ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళుతోంది. అదే సమయంలో మహానాడు ద్వారా పార్టీకి ఉత్సాహాన్ని తీసుకొద్దామనుకున్న చంద్రబాబు.. కాపీ మేనిఫెస్టోతో బొక్కబోర్లా పడ్డారు. ఈ క్రమంలో పార్టీలో చేరిన మూడు నెలల తర్వాత సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మార్పుపై పార్టీలో భిన్నమైన టాక్ వినిపిస్తోంది. నాలుగు స్తంభాలాట గత ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోడెల శివప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆయన అకాల మరణంతో ఇన్చార్జి బాధ్యతలను అధిష్టానం ఎవరికీ అప్పగించలేదు. కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మన్నెం శివనాగమల్లేశ్వరరావు(అబ్బూరి మల్లి), మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా పార్టీ కార్యక్రమాలు చేపట్టడంతో మూడు గ్రూపులుగా విడిపోయారు. ఈ వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నట్టు ఆ పార్టీ అధిష్టానం తాజాగా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివరామ్, మన్నెం శివనాగమల్లేశ్వరరావు ఆందోళనలో ఉన్నారు. దీనివల్ల గ్రూపు విభేదాలు, అసంతృప్తులు మరింత పెరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కన్నాకు కాపు కాసేది లేదు... తొలి నుంచి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1989, 1994, 1999, 2004లలో పెదకూరపాడు నుంచి గెలిచారు. 2009లో గుంటూరు పశ్చిమ నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో కన్నా గురి కూడా పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలపైనే ఉందని ఆయన సన్నిహితుల మాట. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ అంబటి రాంబాబు తొలి నుంచి కాపులతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలుస్తున్నారు. 2009లో టీడీపీ నుంచి ఓటమిపాలైన నిమ్మకాయల రాజనారాయణ యాదవ్, ఆయనపై గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి (2004లోనూ గెలుపొందారు), కాపు సంఘ నేత పక్కాల సూరిబాబు వైఎస్సార్ సీపీలో చేరడంతో అధికారపార్టీ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా ఉండేందుకు కన్నా కూడా విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లిలో టీడీపీకి నాలుగో కృష్ణుడు కన్నా లక్ష్మీనారాయణకు ఇన్చార్జిగా బాధ్యతల అప్పగింత ఇప్పటికే వర్గపోరు పార్టీ శ్రేణుల్లో నిస్తేజం తాజాగా నాలుగు స్తంభాలాటకు అధిష్టానం ఆజ్యం కన్నాకు సత్తెనపల్లికి రావడం ఇష్టం లేదని టాక్ -
ఐపీఎల్ క్రేజ్.. బుకీల అరెస్టు
-
ఐపీఎల్ క్రేజ్.. బుకీల అరెస్టు
సాక్షి, గుంటూరు: ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. అందులోనూ ఫైనల్ మ్యాచ్ అంటే అటు క్రీడాభిమానులకు పండగే పండగ. వాళ్లతో పాటు బుకీలు కూడా అంతే సంబరాలు చేసుకుంటారు. వందల కోట్ల రూపాయల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై పందేలను బుకీలు నిర్వహిస్తుండటంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇద్దరు బూకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన అభీర్ చంద్, శ్యాంఘోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
అమాత్య... అన్న పిలుపేదీ?
సాక్షి, గుంటూరు : జిల్లాలో గతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య పనర్విభజనతో 19 నుంచి 17కు తగ్గిపోయింది. అయితే ఇప్పటి వరకూ మూడు నియోజకవర్గాలకు మంత్రి పదవి దక్కలేదు. వాటిలో ఒకటి రద్దయిన దుగ్గిరాల నియోకవర్గంకాగా మిగిలిన రెండు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని సత్తెనపల్లికి కేవలం నెలరోజులే మంత్రి పదవి దక్కింది. దుగ్గిరాల నియోజకవర్గం నుంచి గుదిబండి వెంకటరెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. మాజీ మంత్రి ఆలపాటి ధర్మారావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. అనంతరం వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయ్యారు. సత్తెనపల్లిది విచిత్ర పరిస్థితి. 1983లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నన్నపనేని రాజకుమారి ఎమ్మెల్యేగా గెలుపొంది నాదెండ్ల భాస్కరరావు మంత్రి వర్గంలో నెలపాటు మంత్రిగా కొనసాగారు. ఆ నెల మినహా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు. సత్తెనపల్లి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు సైతం మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 స్వల్ప మెజార్టీతో గెలిచినా శాసన సభ స్పీకర్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు మంత్రి పదవి దక్కలేదు. 2014లో మాత్రం మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావు అమాత్యుడిగా ప్రమాణం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గం నుంచి ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవి పొందలేదు. అయితే గురజాల వాసి అయిన డొక్కా మాణిక్యవరప్రసాదరావు తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా కొనసాగారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడూ రెండు సార్లుకంటే ఎక్కువ సార్లు గెలవకపోవడంతో మంత్రి పదవులు దక్కలేదని చెప్పుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవిని పొందలేకపోయారు. ఈ నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి గెలిచి రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో సైతం విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ రికార్డు సృష్టించారు. ఆయన మినహా మిగిలిన ఎవరూ రెండు సార్లు గెలవలేదు. -
ఓట్ల తొలగింపుపై అపోహలు తొలగించండి : అంబటి
సాక్షి, సత్తెనపల్లి: నియోజకవర్గంలో ఓట్ల తొలగింపులో వస్తున్న విమర్శలతో పాటుగా ఓటర్లకు ధైర్యం కలిగించేలా ఎన్నికల అధికారులు పనిచేసేలా చూడాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కోరారు. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో ఓట్ల తొలగింపు ప్రక్రియలోని అవకతవకలపై నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.విజయ్‌కుమార్‌ను పార్టీ నేతలతో కలిసి మంగళవారం మాట్లాడారు. నియోజకవర్గంలో భారీగా ఓట్ల మార్పిడికి ఫామ్–7లు అధికంగా అందాయనే సమాచారం ఉందన్నారు. కొత్త ఓటర్ల కోసం దరఖాస్తులు కూడా అందాయనే సమాచారం ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి ఓటర్లకు ఉన్న అపోహలను తొలగించాలని కోరారు. 2019 జనవరి 11న ఓటర్ల జాబితా విడుదల చేసిన నాటి నుంచి ఓట్ల నమోదు, తొలగింపులు, సవరణల కోసం వచ్చిన జాబితాలను అందించాలని కోరారు. ఓట్ల మార్పిడికి ఇప్పటివరకు కేవలం నియోజకవర్గం మొత్తం 88 మాత్రమే అందాయని, అలాగే నూతన ఓటు కోసం అర్జీలను పరిశీలించిన తర్వాత జాబితాలో చేరుస్తామన్నారు. తొలగింపునకు వైఎస్సార్సీపీ సానుభూతి పరుల పేర్లతోనే దరఖాస్తులు అందించి ఆపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దానిపై కూడా దృష్టి సారించాలని రాంబాబు కోరారు. ఫారం–7 అందిన తర్వాత వారం రోజుల గడువు ఉంటుందని, దరఖాస్తు అందించిన వారి వద్ద నుంచి డిక్లరేషన్ తీసుకుంటామని, అలాగే ఓటరు నుంచి కూడా అనుమతి పత్రం స్వీకరించిన తర్వాత తొలగింపు చేపడతామన్నారు. ఆ మేరకు బీఎల్ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనిపై అపోహలు వద్దని రిటర్నింగ్ అధికారి సూచించారు.తొలగింపునకు ఆన్లైన్లో వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పట్టణంలో గుర్తించామని కేసులు నమోదుకు సిద్ధమవుతున్నట్లు సత్తెనపల్లి తహసీల్దార్ తెలిపారు. నా ఓటే తొలగించారు... నా ఓటే తొలగించారు.. ఎన్నికలు ముందు మరలా తొలగిస్తే ఏం చేయాలి...అప్పుడంటే సమయం ఉంది, గుర్తించాం ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో మాట్లాడి తిరిగి ఓటు తెప్పించుకోగలిగాం... మరలా అదే రీతిలో తొలగిస్తే.. అంత సమయం ఉండదు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కదా అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి అంబటి రాంబాబు సమస్యను తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి అలా మరోమారు జరగ్గకుండా చూసుకుంటామని, ప్రతి ఓటు పరిశీలించిన తర్వాతే తొలగింపు జాబితాను తయారు చేసి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతామన్నారు. ప్రతి ఓటరుకు ధైర్యం కల్పించేలా చూడాలని అంబటి రాంబాబు అక్కడే ఉన్న తహసీల్దార్ లను కోరారు. డీఎస్పీని కలిసిన అంబటి రాంబాబు.... అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పట్టణ మోడల్ పోలీస్‌స్టేషన్‌లో డిఎస్పీ కాలేషావలిని అంబటి రాంబాబు కలిసి ఓట్ల అవకతవకలపై నమోదైన కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఎస్పీ అభియోగాలు ఉన్న వారంతా సహకరిస్తే విచారణ పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే ఈ నెల 8న లక్కరాజుగార్లపాడులో జరిగే కావాలిజగన్–రావాలి జగన్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ డీఎస్పీని కోరారు. పార్టీ నాయకులు బాసులింగారెడ్డి, షేక్ నాగూర్‌మీరాన్, రాయపాటి పురుషోత్తమరావు, వేపూరి శ్రీనివాసరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, కోడిరెక్క దేవదాస్, పాల్గొన్నారు. -
సత్తెనపల్లిలో దారి దోపిడీ
సత్తెనపల్లి(గుంటూరు): సత్తెనపల్లి మండలంలోని నర్సరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద దారిదోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు సంతూరు సుబ్బారావు అనే వ్యాపారిని బాగా కొట్టి రూ.60 వేలు దోచుకెళ్లారు. ఈ ఘటన బుధవారం రాత్రి 11.30 సమయంలో జరిగింది. గురువారం ఉదయం బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖరీదైన మద్యం సీసాలు మాయం
సత్తెనపల్లి(గుంటూరు): గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైన్‌షాపులో చోరీ జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని రెడ్ వైన్స్‌లో మంగళవారం రాత్రి దొంగలు పడి రూ. 50 వేలు విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. బుధవారం ఇది గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సత్తెనపల్లిలో గిన్నిస్ రికార్డు సాధనా కార్యక్రమం
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం గిన్నిస్ రికార్డు సాధనా కార్యక్రమం జరగనుంది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1,500 మంది నీటితో చేతులను శుభ్రం చేసుకోనున్నారని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ సామూహిక చేతుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణ కోసం ఆదివారం ఇక్కడ సన్నాహక కార్యక్రమం జరిగింది. ఇందులో కోడెల పాల్గొని పరిశీలించారు.