డీఎస్పీ కాలేషావలితో మాట్లాడుతున్న రాంబాబు, నాయకులు
సాక్షి, సత్తెనపల్లి: నియోజకవర్గంలో ఓట్ల తొలగింపులో వస్తున్న విమర్శలతో పాటుగా ఓటర్లకు ధైర్యం కలిగించేలా ఎన్నికల అధికారులు పనిచేసేలా చూడాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కోరారు. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో ఓట్ల తొలగింపు ప్రక్రియలోని అవకతవకలపై నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.విజయ్‌కుమార్‌ను పార్టీ నేతలతో కలిసి మంగళవారం మాట్లాడారు. నియోజకవర్గంలో భారీగా ఓట్ల మార్పిడికి ఫామ్–7లు అధికంగా అందాయనే సమాచారం ఉందన్నారు. కొత్త ఓటర్ల కోసం దరఖాస్తులు కూడా అందాయనే సమాచారం ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి ఓటర్లకు ఉన్న అపోహలను తొలగించాలని కోరారు. 2019 జనవరి 11న ఓటర్ల జాబితా విడుదల చేసిన నాటి నుంచి ఓట్ల నమోదు, తొలగింపులు, సవరణల కోసం వచ్చిన జాబితాలను అందించాలని కోరారు.
ఓట్ల మార్పిడికి ఇప్పటివరకు కేవలం నియోజకవర్గం మొత్తం 88 మాత్రమే అందాయని, అలాగే నూతన ఓటు కోసం అర్జీలను పరిశీలించిన తర్వాత జాబితాలో చేరుస్తామన్నారు. తొలగింపునకు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల పేర్లతోనే దరఖాస్తులు అందించి ఆపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దానిపై కూడా దృష్టి సారించాలని రాంబాబు కోరారు. ఫారం–7 అందిన తర్వాత వారం రోజుల గడువు ఉంటుందని, దరఖాస్తు అందించిన వారి వద్ద నుంచి డిక్లరేషన్ తీసుకుంటామని, అలాగే ఓటరు నుంచి కూడా అనుమతి పత్రం స్వీకరించిన తర్వాత తొలగింపు చేపడతామన్నారు. ఆ మేరకు బీఎల్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనిపై అపోహలు వద్దని రిటర్నింగ్ అధికారి సూచించారు.తొలగింపునకు ఆన్‌లైన్‌లో వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పట్టణంలో గుర్తించామని కేసులు నమోదుకు సిద్ధమవుతున్నట్లు సత్తెనపల్లి తహసీల్దార్ తెలిపారు.
నా ఓటే తొలగించారు...
నా ఓటే తొలగించారు.. ఎన్నికలు ముందు మరలా తొలగిస్తే ఏం చేయాలి...అప్పుడంటే సమయం ఉంది, గుర్తించాం ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో మాట్లాడి తిరిగి ఓటు తెప్పించుకోగలిగాం... మరలా అదే రీతిలో తొలగిస్తే.. అంత సమయం ఉండదు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కదా అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి అంబటి రాంబాబు సమస్యను తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి అలా మరోమారు జరగ్గకుండా చూసుకుంటామని, ప్రతి ఓటు పరిశీలించిన తర్వాతే తొలగింపు జాబితాను తయారు చేసి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతామన్నారు. ప్రతి ఓటరుకు ధైర్యం కల్పించేలా చూడాలని అంబటి రాంబాబు అక్కడే ఉన్న తహసీల్దార్ లను కోరారు.
డీఎస్పీని కలిసిన అంబటి రాంబాబు....
అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పట్టణ మోడల్ పోలీస్‌స్టేషన్‌లో డిఎస్పీ కాలేషావలిని అంబటి రాంబాబు కలిసి ఓట్ల అవకతవకలపై నమోదైన కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఎస్పీ అభియోగాలు ఉన్న వారంతా సహకరిస్తే విచారణ పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే ఈ నెల 8న లక్కరాజుగార్లపాడులో జరిగే కావాలిజగన్–రావాలి జగన్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ డీఎస్పీని కోరారు. పార్టీ నాయకులు బాసులింగారెడ్డి, షేక్ నాగూర్‌మీరాన్, రాయపాటి పురుషోత్తమరావు, వేపూరి శ్రీనివాసరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, కోడిరెక్క దేవదాస్, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment