సత్తెనపల్లిలో ఆకట్టుకున్న పోలీసుల మాక్‌డ్రిల్ నిరసనకారుల దాడులను నిలువరించిన బలగాలు
అల్లర్ల నియంత్రణపై ప్రజలకు విశదీకరణ అధిక సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు
సత్తెనపల్లి : ఒక్కసారిగా జరిగిన ఈ అలజడికి పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పట్టణ సీఐ పోలూరి శ్రీనివాసరావు ఘటనా స్ధలికి చేరుకొని నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు సరి కదా.. ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. చేతికందినవన్నీ పోలీసులపై విసరడం మొదలు పెట్టారు. అంతే ఉన్నతాధికారులకు సీఐ శ్రీనివాసరావు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో డీఎస్పీ గుర్‌నాథ్‌బాబు ఆధ్వర్యంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ దళాలు, సివిల్, ప్రత్యేక సాయుధ దళాలు వ్యాన్లతో అక్కడికి చేరాయి.
ముందుగా ఆందోళనకారులకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ ఖాతరు చేయకపోవడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి బాష్ప వాయువును ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గక పోవడం.. పరిస్థితులు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరోవైపు ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైర్ చేసి హెచ్చరించారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ నిరసనకారుడికి బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలగా.. మరొకరు తలకు గాయాలై తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్ట్రెక్చర్‌పై వాహనంలో తరలించారు. అంబులెన్సుల హడావుడి.. పోలీస్ సైరన్ల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వారిని వాహనాల్లో తరలించారు.
కళ్లకు కట్టిన ప్రదర్శన
ఈ దృశ్యాలను చూస్తూ భీతావహులైన ప్రజలకు మైక్‌లో ఒక ఎనౌన్స్‌మెంట్ వినిపించింది. ‘ఇది మాక్ డ్రిల్.. కౌంటింగ్ నేపథ్యంలో ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించడంలో భాగంగా పోలీసులు చేసిన సన్నాహక కార్యక్రమం’ అని పోలీసులు ప్రకటించడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు ‘నటించిన’ పోలీసులు అక్కడి నుంచి ని్రష్కమించారు. పట్టణంలో పోలీసులు చేపట్టిన నమూనా ప్రదర్శన ఇది. పేరుకే మాక్ డ్రిల్ అయినప్పటికీ వాస్తవాలను కళ్లకు కట్టింది.
స్థలం : సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్
సమయం: ఆదివారం సాయంత్రం 5.11 గంటలు
50 మందికి పైగా ఆందోళనకారుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది.. ఓ చేతిలో ప్లకార్డులు .. మరో చేతిలో రాళ్లు ... పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు. తాలూకా సెంటర్లో నడిరోడ్డుపై మంట పెట్టిన టైర్లు.. ఎటుచూసినా భయానక వాతావరణం..
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్రరాజు అన్నారు. మాక్ డ్రిల్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తెలిపారు. ఇప్పటికే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో లూజ్ విక్రయాలకు, పేలుడు పదార్థాలు, బాణసంచా విక్రయాలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మరో మూడు రోజులు 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రదర్శనలు, అల్లర్లు, గుమికూడటం చేయరాదని సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నరసరావుపేటలో ఒకరిపై చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్రైం అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథ్ బాబు, ఏఆర్ డీఎస్పీ గాంధీ, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.రాంబాబు, సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.రాజేష్ కుమార్, ఎస్‌ఐలు ఎం. సంధ్యారాణి, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment