హైకోర్టుకు నివేదించిన హోంమంత్రి అనిత బాధితుడు
అనిత పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి
రాజీ కుదిరిందంటే చాలదు.. ఏం పరిష్కారం కుదిరిందో చెప్పాల్సిందే
అన్ని వివరాలతో అఫిడవిట్ వేయండి
తదుపరి విచారణ 12కి వాయిదా
సాక్షి, అమరావతి: చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారు, తన మధ్య రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో తనపై విశాఖపట్నం 7వ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏం రాజీ కుదిరిందో చెప్పకుండా, రాజీ కుదిరిందని చెప్పేస్తే సరిపోదని వ్యాఖ్యనించింది. ఈ సందర్భంగా హైకోర్టు, అనిత తన డబ్బు తీసుకుని ఎగవేసిందంటూ కింది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన వేగి శ్రీనివాసరావుతో స్వయంగా మాట్లాడింది.
మీ మధ్య రాజీ కుదిరిందని అనిత పిటిషన్ దాఖలు చేశారని, రాజీ కుదిరిందా? మీరు తప్పుడు కేసు వేశారని వారు చెబుతున్నారంటూ ఆయన్ను ప్రశ్నించింది. అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నానని శ్రీనివాసరావు బదులిచ్చారు. తనకు వారి చుట్టూ తిరిగే ఓపిక లేదన్నారు. అందుకే రాజీ అంటే సరేనన్నానని తెలిపారు. రాజీ ఏం కుదిరిందని న్యాయస్థానం ప్రశ్నించగా, అనిత తరఫు న్యాయవాది సతీష్ స్పందిస్తూ.. కుదిరిన రాజీ ప్రకారం వేగి శ్రీనివాసరావు చెక్ బౌన్స్ కేసును కొనసాగించడానికి వీల్లేదని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదని తెలిపారు.
న్యాయస్థానం స్పందిస్తూ, ఇది రాజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. రాజీలో ఇరుపక్షాల మధ్య ఏం ఒప్పందం కుదిరింది, సమస్యకు ఏం పరిష్కారం చూపారు, శ్రీనివాసరావుకు ఇవ్వాల్సిన దాంట్లో ఏం ఇచ్చారు.. తదితర వివరాలు ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. రాజీ కుదిరిపోయిందని, దానిని రికార్డ్ చేసేయాలంటే కుదరదని తేల్చిచెప్పింది.
రాజీని రికార్డ్ చేసేందుకు అవసరమైన అన్నీ వివరాలను తమ ముందుంచాలని అనితను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment