
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టించారు. కూటమి ప్రభుత్వానికి అప్పు వారమైన మంగళవారం(నిన్న) రోజున 7.09 శాతం వడ్డీతో మరో రూ.4,548 కోట్లు అప్పు తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీంతో, చంద్రబాబు చేసిన అప్పులు రికార్డు స్థాయిలో రూ.1.52లక్షల కోట్లకు చేరుకున్నాయి.
అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కార్ దూసుకెళ్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వం రూ.4,548 కోట్లు తీసుకుంది. ఇందుకు గాను 7.09 శాతం వడ్డీతో అప్పు తీసుకోవడం గమనార్హం. దీంతో, రాష్ట్ర చరిత్రలో ఒక్క ఏడాదిలో ఇంత అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. బడ్జెట్‌లో చెప్పిన దానికి మించి కూటమి సర్కార్ అప్పులు చేసింది. బడ్జెట్ అప్పులు రూ.98,088 కోట్లకు చేరగా.. బడ్జెట్ బయట అప్పు రూ.54,700 కోట్లకు చేరుకుంది. దీంతో, బడ్జెట్ బయట, లోపల.. చంద్రబాబు చేసిన అప్పులు రూ.1.52లక్షల కోట్లకు చేరుకుంది. అయితే, ఇన్ని అప్పులు చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు.
ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గత గురువారం వెల్లడించింది.
భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు
ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు
2024–25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది.