
సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ నిర్వహణకు ఒకేసారి టెండర్లు పిలిచిన ఏపీ ఎంఎస్‌ఐడీసీ
కోర్టు కేసులు, వివాదాల సాకుతో ఆస్పత్రుల్లో శానిటేషన్ టెండర్ రద్దుకు నిర్ణయం
టెండర్‌లో పాల్గొన్న సీఎం బంధువుకు చెందిన కంపెనీ
సదరు బిడ్ కనీస అర్హతకు నోచుకోని దుస్థితి
సెక్యూరిటీ, పెస్ట్ నిర్వహణలో ఎంపిక చేసిన సంస్థలపైనా ఆరోపణలు
వీరంతా అమాత్యుడు, ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పేలా డీల్
సాక్షి, అమరావతి: అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి కమీషన్ల రూపంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని దండుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. కనీస అనుభవం, అర్హతలేని సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లను అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులు, కమీషన్లు ముట్టజెప్తే కంపెనీలకు కాంట్రాక్ట్ దక్కని పరిస్థితుల్లో ఏకంగా టెండర్లనే రద్దు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్ టెండర్లలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.
చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన సంస్థ
2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్య శాఖల్లో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లులు చేశారు. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం బంధువు కంపెనీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కూడా దేవదాయ, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్‌లపై సీఎం బంధువు కన్నేశారు. కొద్దినెలల క్రితం ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ పనుల కోసం టెండర్లు పిలవగా.. బిడ్ దాఖలు చేయడంతో పాటు, సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు సదరు కంపెనీ సిఫార్సు చేయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, పరిశీలన దశలోనే బిడ్ అనర్హతకు గురైంది. దీనికి తోడు వివిధ మార్గాల్లో ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు పనులు దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో కోర్టు కేసులు, వివాదాలు, ఇతర కారణాలను బూచిగా చూపి మొత్తం టెండర్‌నే ప్రభుత్వం రద్దు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కుట్ర బట్టబయలు
డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఒకేసారి టెండర్లు పిలిచారు. కాగా, ఒక్క శానిటేషన్ టెండర్లనే ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్ల ప్రక్రియలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. సెక్యూరిటీ విభాగంలో ఒక సంస్థ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేస్తే రద్దు చేస్తామని టెండర్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
అయినప్పటికీ ఈ సంస్థ బిడ్‌ను ప్రభుత్వం తిరస్కరించలేదు. కోర్టు కేసులు, బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని, వారికి పనులు కట్టబెట్టకుండా చూడాలని కోర్టులో కేసులు దాఖలయ్యాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే పెస్ట్ కంట్రోల్ విభాగంలో సాయి సెక్యూరిటీ అనే సంస్థపై చీటింగ్ కేసు నమోదైంది. కాగా, ఆయా సంస్థలన్నీ అమాత్యుడు, ఇతర ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పేలా డీల్ కుదుర్చుకోవడంతో ఈ పనుల వరకూ కాంట్రాక్టర్ల ఎంపిక ముగించేశారు. కుంటి సాకులతో ఒక్క శానిటేషన్ టెండర్లను రద్దు చేయడంతో ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలైంది.