‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’ | Merugu Nagarjuna Says Chandrababu Govt Neglecting Students Welfare, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’

Published Sun, Apr 27 2025 3:17 PM | Last Updated on Sun, Apr 27 2025 5:31 PM

Merugu Nagarjuna Says Chandrababu Govt Neglecting Students Welfare

సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్‌ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..

ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.

ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

వాయిదాల రూపంలో ఇస్తారా..
కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.

విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్‌ జగన్
‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్‌ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్‌కిన్‌ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు

..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్‌ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement