
సోషల్‌మీడియాలో టీడీపీ ప్రచారం ఇదీ..
గోశాలలో గోవుల మృతి ముమ్మాటికీ నిజం
పవిత్ర క్షేత్రంలో పది నెలలుగా వరుసగా అపచారాలు
కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు బుకాయింపు
చైర్మన్, ఈవో, ఎమ్మెల్యే ప్రకటనలతో నిజాలు వెలుగులోకి
నాడు శ్రీవారి పవిత్ర లడ్డూపై బాబు అసత్య ప్రచారం
తొక్కిసలాట ఘటనపైనా అదే తీరు.. కప్పిపుచ్చే యత్నాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా అబద్ధాలు.. బుకాయింపు మరోసారి పటాపంచలయ్యాయి! టీటీడీ గోశాలలో అసలు గోవులే మరణించలేదని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించగా.. స్వయంగా టీడీపీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్‌మీట్లతో ముమ్మాటికీ గోవులు చనిపోయాయనే విషయం రుజువైంది. ఈ సంఘటన వెలుగులోకి రాగానే అటు టీటీడీ.. ఇటు టీడీపీ అసలు అలాంటి ఘటన ఏదీ జరగనే లేదంటూ బుకాయిస్తూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాయి.
వైఎస్సార్‌సీపీపై దుమ్మెత్తి పోశాయి. కానీ నిజం నిలకడ మీద తేలుతుందన్నట్లుగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో గోవుల మృత్యుఘోష వెలుగు చూడటంతో ఉలిక్కిపడ్డ కూటమి సర్కారు కప్పిపుచ్చేందుకు విఫల యత్నాలు చేసింది. గోవులు చనిపోయాయంటూ అబద్ధాలాడుతున్నారని సీఎం చంద్రబాబు యథాప్రకారం బుకాయించగా.. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే చేసిన ప్రకటనలతో గోమాతల మృతి నిజమేనని తేటతెల్లమైంది.
పరమ పవిత్రంగా పూజించే క్షేత్రంలో గోమాతల మృత్యుఘోషపై భక్తులు భగ్గుమంటున్నారు. టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృత్యువాత పడినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఈనెల 11న సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మరుసటి రోజు తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు 40 గోవులు మాత్రమే మరణించాయని మీడియా సాక్షిగా వెల్లడించారు.
ఈనెల 13న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి గోశాలలో పర్యటించి మీడియా సమావేశం నిర్వహించారు. 20 నుంచి 22 గోవులు మాత్రమే మరణించినట్లు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ప్రకటించారు. ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందాయి..’ అని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ అసత్య ప్రచారం చేస్తోంది అంటూనే.. నిజాలను ఒప్పుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం యథాప్రకారం అసలు గోవులు మరణించనే లేదని, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం గుంటూరు జిల్లా పొన్నెకల్లులో వైఎస్సార్ సీపీపై అసహనం వెళ్లగక్కారు. నాలుగు రోజులుగా పొంతన లేని ప్రకటనలతో టీటీడీని అడుగడుగునా అభాసు పాలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పది నెలలుగా అపచారాలు.. !
కూటమి ప్రభుత్వం వచ్చాక గత పది నెలల కాలంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ చోటుచేసుకోని మహాపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న మహాపచారాలను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాల్సిందిపోయి.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తూ పార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు.
పంది కొవ్వు కలిసిందంటూ..
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది.. అంటూ గతేడాది సెపె్టంబర్ 19న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీసే రీతిలో వ్యాఖ్యలు చేయటం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.
తొక్కిసలాటలో భక్తుల మృతి..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధారి్మక క్షేత్రం తిరుమలకు లక్షలాదిమంది భక్తులు వచి్చనా టీటీడీ చరిత్రలో గతంలో ఒక చిన్న సంఘటన కూడా చోటు చేసుకున్న దాఖలాలు లేవు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా నియంత్రించడంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత పటిష్ట ప్రణాళికలు మరెక్కడా లేవు. అటువంటి చోట భక్తుల తొక్కిసలాట ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది.
అసత్య ఆరోపణలే.. 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండవచ్చు: టీటీడీ చైర్మన్
వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందటం, 40 మందికిపైగా గాయాలు పాలవడం అందరినీ కలచి వేసింది. ఆ తరువాత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
మందు.. ఎగ్ బిర్యానీ
⇒ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషిద్ధం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన వెలుగుచూసింది.
⇒ ఈ ఏడాది మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్‌చల్ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఓ బెల్టుషాపు వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్టుషాపులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఏర్పాటవుతున్న రీతిలోనే తిరుమలలో కూడా బెల్టు దుకాణం వెలసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
⇒ తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్చగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు.