
1,136 ఎస్‌జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులుగా మార్చిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో రెగ్యులర్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 2,260 టీచర్ పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులుగా ప్రభుత్వం మార్పు చేసింది. ఈమేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. ఇలా మార్చిన పోస్టుల్లో 1,136 ఎస్‌జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ రెగ్యులర్ టీచర్లలో మిగులు (సర్‌ప్లస్) పోస్టులను స్పెషల్ టీచర్లుగా మార్చి, ఆయా ఖాళీలను జిల్లాల వారీగా సృష్టించి ఆ స్థానాల్లో మార్పుచేసిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు.
స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 1,984 పోస్టులు అవసరం ఉండగా,860 పోస్టులకు అనుమతి ఉంది. మిగిలిన 1,124 పోస్టులను కొత్తగా మంజూరు చేసి, రెగ్యులర్ టీచర్లను స్పెషల్ టీచర్లుగా మార్పు చేశారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను గరిష్టంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 151, కనిష్టంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 44 మంజూరు చేశారు.
ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు లేరు. తాజాగా 1,136 ఎస్‌జీటీ పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగానికి మంజూరు చేయడంతో ప్రత్యేక అవసరాల గల పిల్లల బోధనకు అవకాశం కల్పించినట్టయింది.